నిర్మానుష్యంగా కొంగరకలాన్‌   

4 Sep, 2018 12:39 IST
కుప్పలుగా వాటర్‌ బాటిళ్లు  

ఇబ్రహీంపట్నంరూరల్‌ : లక్షలుగా తరలివచ్చిన ప్రజలను ఆ గ్రామం అక్కున చేర్చుకుంది. టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వేదికగా నిలిచిన కొంగరకలాన్‌ ప్రస్తుతం బోసిపోయింది. సభ ఏర్పాట్లు ప్రారంభమైన పది రోజుల నుంచి అక్కడ సందడి నెలకొంది. ప్రతి రోజూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకుల రాకపోకలతో రద్దీగా మారింది. సభకు తరలివచ్చిన జనంతో రహదారులు కిక్కిరిపోయాయి. జనం నినాదాలు, మైకుల శబ్ధాలతో హోరెత్తిన ఆ ప్రాంతం సోమవారం  తెల్లారే సరికి మూగబోయింది. ఆదివారం ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందులు పడ్డారు. మరుసటి రోజు ఒక్క వాహనం కూడా కనిపించలేదు.

కలెక్టరేట్‌ వద్దకు వెళ్లే వారు కూడా లేకుండా పోయారు. ప్రగతి సభ కోసం ఏర్పాటు చేసిన కార్పెట్‌ను తీసేశారు. గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన కుర్చీలను ప్రాంగణం నుంచి తరలించారు. సభ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, వాటర్‌ బాటిళ్లు, వాటర్‌ ప్యాకెట్లను తొలగించే పనిలో పడ్డారు. సూమారు 2వేల ఎకరాల్లో చెత్త ఎత్తివేయడానికి టీఆర్‌ఎస్‌ పార్టీ పనులు చేపడుతోంది. పర్యావరణానికి ముప్పు రాకుండా శుభ్రం చేస్తున్నారు. మోబైల్‌ మూత్రశాలను ప్రాంగనం నుంచి తరలించారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో శుభ్రం చేసేలా చర్యలు చేపడతామని స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు.

Tags