‘కోర్టు’లోని అంశంపై మీరెలా మాట్లాడతారు?

4 Sep, 2018 03:01 IST
బాంబే హైకోర్టు

ముంబై: మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ హక్కుల నేతలను అరెస్టు చేసిన పోలీసులు మీడియా సమావేశంలో ఆధారాలను ఎలా బహిర్గతం చేస్తారంటూ బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ)కు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. ఈ కేసులో పుణె పోలీసుల దర్యాప్తు దురుద్దేశపూరితమనీ, వారిని విచారణ బాధ్యతల నుంచి తప్పించాలని పిటిషనర్‌ కోరారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో హక్కుల కార్యకర్తలు, లాయర్లు, కవులు, రచయితలు, మేథావులు ఉన్నారని పేర్కొన్నారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వీరిని అరెస్టు చేసినప్పుడు, దర్యాప్తును ఎన్‌ఐకు అప్పగించడం సముచితమని తెలిపారు. స్పందించిన న్యాయస్థానం..‘ఈ అంశం కోర్టు విచారణలో ఉండగా పోలీసులు ప్రెస్‌మీట్‌ ఎలా పెడతారు? ప్రస్తుతం విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇలాంటి కేసులకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేయడం తప్పు’ అని పేర్కొంది. రాష్ట్ర అదనపు డైరెక్టర్‌ జనరల్‌(శాంతిభద్రతలు) పరమ్‌వీర్‌ సింగ్, పుణె పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హక్కుల నేతలు రాసినట్లుగా చెబుతున్న ఉత్తరాలను చదివి వినిపించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వాలను కూల్చేది ప్రజలే: శివసేన
హక్కుల నేతలను అరెస్టు చేయటాన్ని తెలివితక్కువ పనిగా శివసేన అభివర్ణించింది. ప్రధాని మోదీ భద్రతకు మావోల  నుంచి ముప్పు ఉందన్న పోలీసుల వాదన కుట్రసిద్ధాంతమని తన సామ్నా పత్రిక సంపాదకీయంలో శివసేన పేర్కొంది. మోదీకి అత్యున్నత స్థాయి భద్రత ఉందని ఆరోపణలు చేసే ముందు పోలీసులు సంయమనం పాటించకుంటే కేంద్రం, బీజేపీ నవ్వులపాలు కాకతప్పదని తెలిపింది. ‘యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దించింది ప్రజలే. మావోలు, నక్సలైట్లు కాదు. అధికారం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మారుతోంది. ప్రభుత్వాలను మార్చే శక్తే మావోయిస్టులకు ఉంటే పశ్చిమబెంగాల్, త్రిపుర, మణిపూర్‌లో వామపక్షాలు అధికారం కోల్పోయేవి కావు’ అని వ్యాఖ్యానించింది.  
 

Tags