‘భోజనం’ అమలయ్యేనా?

4 Sep, 2018 10:12 IST
కళాశాల ఆవరణలో ఇంటి భోజనం చేస్తున్న విద్యార్థినులు

మహబూబ్‌నగర్‌ మండలంలోని మాసన్‌పల్లికి చెందిన విమల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. నిత్యం 15కిలోమీటర్లు ప్రయాణించి కాలేజీకి వెళ్తుంది. వ్యవసాయ కుటుంబం కావడంతో ఉదయం ఇంటిపని పూర్తి చేసుకుని బస్సు వచ్చే సమయానికి రెడీగా ఉండాలి. ఆమె బయలుదేరే సమయానికి ఇంట్లో వంట పూర్తవదు. దీంతో టిఫిన్‌ బాక్స్‌ లేకుండానే వచ్చేస్తుంది. మధ్యాహ్నం వరకు ఎలాగోలా ఉంటున్నా, ఆ తర్వాత పాఠాలు వినలేకపోతోంది. వారంలో నాలుగు రోజులు ఇదే వరుస. ఈ పరి స్థితి ఒక్క విమలదే కాదు.. గ్రామీణ ప్రాంతాల నుంచి నిత్యం కళాశాలలకు వస్తున్న చాలామంది విద్యార్థులది.  

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌:  జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిపాదన కొంతకాలంగా ఉన్నప్పటికీ జూలైలో హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులతో జరిగిన సమావేశంలో మధ్యాహ్న భోజనం పథకం అమలుకు సంబం దించి పలుఅంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే భోజనం అందుతుందని విద్యార్థులు ఆనందించారు. కానీ నిర్ణయం వెలువడి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు అమలుకు నోచుకోకపోవడంతో నిరాశ అలుముకుంది. ఎప్పటి నుంచి అమలుచేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. 

గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం..  
గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే చాలామంది విద్యార్థులు ప్రతిరోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ఇంటినుంచి మధ్యాహ్నం భోజనం తీసుకురాలేకపోతున్నారు. ఎదిగే వయస్సులో విద్యార్థులు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల చాలారకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం తగ్గుతున్న క్రమంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పౌష్టికాహారం అందుతుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయని గుర్తించారు.   
అమలు ఎంతో అవసరం  
ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలు, వృత్తి విద్యా కళాశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలుచేయడం ఎంతో అవసరమని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఈ పథకం ద్వారా అన్ని కళాశాలల్లో కలిపి 20,016 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఎదిగే క్రమంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తే రక్తహీనత, బలహీనత, ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశమే లేదని పేర్కొంటున్నారు.
 
ఇబ్బందులు తప్పేవి  
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు చాలా వరకు జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రంలో ఉన్నాయి. వీటిలో చదివే చాలా మంది విద్యార్థులకు జిల్లాలోని గ్రామాల నుంచి బస్సుతో పాటు పలువాహనాలలో వస్తుంటారు. చాలా గ్రామాలకు సకాలంలో బస్సు సదుపాయం లేక విద్యార్థులు కాలినడకన వస్తున్నారు. ఈ క్రమంలో వారు బయలుదేరే సమయానికి భోజనం ఉండటం లేదు. కాలికడుపుతోనే వచ్చి, చిరుతిళ్లతో సరిపెట్టుకుంటున్నారు. అవి ఏ మూలకూ సరిపోక ఆకలితో నకనకలాడుతున్నారు. శారీర, మానసికంగా ఇబ్బందిపడుతున్నారు.  

ప్రయాణానికే సరిపోతుంది  
చాలాకాలంగా కళాశాలలో మధ్యాహ్న భోజనం పెడతారని అందరూ అంటున్నారు. కానీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఇంటి వద్ద అన్ని పనులు పూర్తి చేసుకుని రావాలంటే చదువుకోవడానికి సమయం సరిపోవడం లేదు. ఉదయం, సాయంత్రం ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక భోజనం మీద ప్రత్యేక దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కళాశాలలో విద్యార్థులకు భోజనం పెడితే పెద్ద సమస్య తీరుతుంది.     
  – సరోజ, కోయిల్‌కొండ, బాలికల జూనియర్‌ కళాశాల 

వెంటనే అమలు చేయాలి  
ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెంటనే అమలుచేయాలి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. దీనిద్వారా ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. బాగా చదువుకునే అవకాశం ఉంటుంది.  – అనూష, మానన్‌పల్లి, బాలికల జూనియర్‌ కళాశాల

ఇబ్బందులు తీర్చాలి  
నేను నిత్యం మా ఊరు పిల్లగుండుతండా నుంచి కళాశాలకు బస్సులో వస్తున్నాను. ఉదయం బస్సు వచ్చే సమయానికి పనులు పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి. లేదంటే బస్సు పోతుంది. నేను వచ్చే సమయానికి ఇంట్లో వంట కాదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నాలాగే చాలామంది విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.  – సురేఖ, పిల్లగుండతండా, బాలికల జూనియర్‌ కళాశాల

సంబంధిత ఫోటోలు
Tags