సీఎంకు ఢిల్లీలో కొత్త కాన్వాయ్‌

4 Sep, 2018 01:33 IST

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు ఢిల్లీలో కొత్త కాన్వాయ్‌ను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్‌కు భద్రతా పరంగా ముప్పు ఉందనే నిఘా వర్గాల తాజా నివేదిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్నట్లుగానే ఢిల్లీలోనూ బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనంతో కొత్త కాన్వాయ్‌ ఉండాలని అధికారులు నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌కు ప్రస్తుతం ఢిల్లీలో మూడు వాహనాలతో ప్రత్యేక కాన్వాయ్‌ ఉంది. స్కార్పియో, ఫార్చునర్, సఫారీ వాహనాలున్నాయి. ఢిల్లీలో వాహనాల వినియోగంపై ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. వీవీఐపీలకు, వీఐపీలకు సైతం మూడు వాహనాలతోనే కాన్వాయ్‌ ఉంటుంది. కొత్త కాన్వాయ్‌ ఏర్పాటు కోసం అక్కడి గవర్నర్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ సీఎంకు ఢిల్లీలో కొత్త వాహనాలను సమకూర్చే ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో సీఎం  వినియోగిస్తున్నట్లు ఢిల్లీలోనూ బుల్లెట్‌ప్రూఫ్‌ ల్యాండ్‌ క్రూజర్‌ వాహనం అధికారులు సమకూర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే సీఎం కాన్వాయ్‌ కోసం గతంలో కొనుగోలు చేసిన ఫార్చునర్‌ వాహనాలను అక్కడికి పంపించే యోచన చేసినా.. కొత్త వాటి కొనుగోలుకే నిర్ణయం జరిగినట్లు సమాచారం. సీఎం ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కాన్వాయ్‌లోని ఒక వాహనం మొరాయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనూ కొత్త కాన్వాయ్‌ అవసరం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. 

Tags