జనహృదయ నేతకు ఘన నివాళి

2 Sep, 2018 09:58 IST

సాక్షి, విజయవాడ : వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి (సెప్టెంబర్‌ 2) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పలువురు ముఖ్య నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి, మల్లాది విష్ణు, వంగవీటి రాధా, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మేరుగ నాగార్జున, గౌతమ్‌రెడ్డి, బొప్పన భవకుమార్‌, ఎంవీఆర్‌ చౌదరి, తుమ్మల చంద్రశేఖర్‌, పైలా సోమినాయుడు వైఎస్సార్‌ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వై​ఎస్సార్‌ సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజంలో పేదరికాన్ని రూపుమాపేందుకు వైఎస్‌ఆర్‌ కృషి చేశారని పార్థసారథి అన్నారు. రాష్ట్రాన్ని రాజన్న పెద్ద కొడుకుగా పాలించారని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు.అనంతపురం జిల్లాలో మహానేత వైఎస్సార్‌కు మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ఘన నివాళి అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఓటమి ఎరుగని నేత.. వైఎస్సార్‌..
సాక్షి, హైదరాబాద్‌ : దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలు నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంటేశ్వర్లు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పేదవారికి సేవా చేయాలనే తపన వైఎస్సార్‌కి ఉండేదనీ, జీవితంలో ఓటమి ఎరుగని వ్యక్తి వైఎస్సార్‌ అని ఉమ్మారెడ్డి అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 మీడియాతో మాట్లాడుతున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

విజయవాడలో..

మహానేత వైఎస్సార్‌ వర్ధంతిని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు పాలు, పండ్లను పంపిణీ చేశారు. రక్తదానం, అన్నదానం శిబిరాలను నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి నివాస్‌, కార్పోరేటర్ల ఆధ్వర్యంలో కారపెజ్జోనిపేట, కేదారేశ్వర పేట ప్రాంతాలలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. సత్యనారయణపురంలో పేదలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వంగవీటి రాధా కృష్ణ పైపుడ్‌ రోడ్డులో గల వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

కృష్ణాలో
జిల్లా వ్యాప్తంగా జనహృదయ నేత వైస్సార్‌ తొమ్మిదో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పామర్రు నియోజక వర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్నం కోర్టు సెంటర్‌లో పేర్నినానిలు వైస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణలో
వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి  ఆయన అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌లో మహానేత విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేత రాంభూపాల్‌ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో పార్టీ నేత ఆశోక్‌గౌడ్‌ మహానేత విగ్రహానికి నివాళలర్పించారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.  

 

Tags