అలెగ్జాండర్‌ని ప్రెసిడెంట్‌ చేసింది నేనే: చంద్రబాబు

2 Sep, 2018 14:56 IST

సాక్షి, హైదరాబాద్‌ : భరింపశక్యంకాని గొప్పలు చెప్పుకోవడంలో తమను మించిన వారు లేరని మరోసారి రుజువుచేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చరిత్రంటే నారా వారిదేనని.. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టడం.. విశిష్టులకు నోబెల్‌, ఆస్కార్‌లు ఇప్పించడం.. సత్య నాదెళ్లకు ఇంజనీరింగ్‌ సలహా ఇవ్వడం.. పీవీ సింధుచేత షటిల్‌ రాకెట్‌ పట్టించడంలాటి ఘనకార్యాలెన్నో చేశానని చెప్పుకునే చంద్రబాబు తాజాగా మరో బాంబు పేల్చారు. అయితే ఈసారి చంద్రబాబు పేల్చింది అలాంటి ఇలాంటి బాంబుకాదు. చంద్రబాబు చెప్పింది ఏంటో అర్థం కాక టీడీపీ నేతలు, కార్యకర్తలు జుట్టుపీక్కుంటుంటే, నెటిజన్లు మాత్రం చంద్రబాబు మాటలను రీపీట్‌ చేసుకొని మరీ వింటూ తెగ నవ్వుకుంటున్నారు.

అసలు ఏం జరిగిందంటే...
గత మంగళవారం గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగిన ‘నారా హమారా... టీడీపీ హమారా’ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడేందుకు సుప్రీం కోర్టులో పోరాడుతానని, రాయలసీమతో పాటు నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేస్తామని, హజ్‌యాత్రకు అమరావతి నుంచి నేరుగా విమాన సదుపాయం కల్పిస్తామని, మైనార్టీ సబ్‌ ప్లాన్‌ తీసుకొచ్చి ఆదుకుంటామని హామీలిచ్చారు. ముస్లిం మైనార్టీ వర్గానికి త్వరలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పిస్తానన్నారు. ఇక అదే ఫ్లో లో 'తెలుగుదేశం పార్టీ ఎన్నో చరిత్రలు సృష్టించాము. ఒకటి రెండు కాదు ఒక దశలో అలెగ్జాండర్‌ గారిని ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాగా చేశాము. నేనొక్కటే చెప్పాను ఈ దేశానికి అన్ని విధాలుగా అర్హత కలిగిన వ్యక్తి ఆయనే ఉండాలని చెప్పి ప్రధాన మంత్రిగారిని ఒప్పించి దేశ అధ్యక్ష పదవికి సహకరించిన పార్టీ ఈ తెలుగు దేశం పార్టీ' అంటూ చంద్రబాబు స్పీచ్‌ దంచికొట్టారు. దీంతో అక్కడున్నవారంతా ఎవరబ్బా ఈ అలెగ్జాండర్‌ అంటూ ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబుకు ప్రసంగానికి సంబంధించి వీడియో సామాజికమాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ అలెగ్జాండర్‌ ఎవరో కాదు క్రీ.పూ. 3వ శతాబ్ధంలో ప్రపంచ దండయాత్రకు బయలుదేరిన గ్రీకు రాజు అలెగ్జాండర్‌ అయ్యిండొచ్చు, అతనికి మన చంద్రబాబుకు మంచి స్నేహితుడనుకుంటా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ యువతలో స్పూర్తినింపిన అబ్దుల్ కలాం అయ్యి ఉంటారని, చివరికి పేరుకూడా సరిగ్గా పలకడం రాదు కానీ మిసైల్ మ్యాన్ కలాంకు చంద్రబాబు రాష్ట్రపతి పదవి ఇప్పించారా అంటూ మండిపడుతున్నారు.

ఇంతకుముందు కూడా ఇలానే..
హైదరాబాద్‌లో గత మేలో నిర్వహించిన మహానాడుకు సంబంధించి చంద్రబాబు ఒక ట్వీట్‌ చేశారు. ‘‘ఒకప్పుడు తాగునీరు లేని పరిస్థితి నుంచి హైదరాబాద్‌ నేడు మహానగరంగా మారిందంటే దాని వెనుక టీడీపీ ప్రభుత్వ శ్రమ, కష్టం ఎంతో ఉంది. దేశంలోనే నంబర్‌ వన్‌గా పేరొందిన బేంగంపేట విమానాశ్రయమూ టీడీపీ హయాంలోనే నెలకొల్పాం. భావితరాల భవిష్యత్తు కోసం హైటెక్‌ సిటీని నిర్మించాం’’ అని రాసుకొచ్చారు. అంతే, నెటిజన్లు ఒక్కసారిగా ఘొల్లున నవ్వుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ 1930లోనే నిజాం రాజు కట్టించారు. అప్పటికి మన సారు ఇంకా పుట్టనేలేదు! ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ కొందరు ‘అవునవును.. నిజాం రాజు మీ దోస్తే కదా..’’ అంటూ సెటైర్లు వేశారు. తప్పును గ్రహించిన చంద్రాలు సారు కొద్ది నిమిషాలకు ఆ ట్వీట్‌ను డిలిట్‌చేసి, ‘బేగంపేట’ ప్రస్తావన లేకుండా మరో ట్వీట్‌ చేశారు. కానీ అప్పటికే ఆ స్క్రీన్‌ షాట్లు వైరల్‌ అయిపోయాయి...
(డిలిట్‌ చేసిన బాబు ట్వీట్‌ స్ర్కీన్‌షాట్‌)

Tags