ఆరోజు ఏం జరిగింది..

2 Sep, 2018 12:31 IST

ఆకాశానికి రంధ్రం పడ్డదా అన్నంతగా వర్షం.. కాలు బయటకు పెట్టలేనంత జడివాన.. 2009 సెప్టెంబర్‌ 2న వాతావరణ పరిస్థితి. ఆత్మకూరు మండలంలో పొంగని వాగు లేదు. తెగని రోడ్డు లేదు. సుమారు 24 సెం.మీ. వర్షపాతం నమోదు. దాదాపు కుంభవృష్టే. రాయలసీమలో వర్షమెప్పుడూ హర్షదాయకమే.. అయితే నాటి వర్షం యావత్‌ దేశానికే విషాదాన్ని పంచింది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రయాణించిన   హెలికాప్టర్‌ నల్లమల అడవుల్లో కూలిపోయి ఆయనతో పాటు వ్యక్తిగత, చాపర్‌ సిబ్బంది దారుణ మరణాన్ని పొందారు.  
– ఆత్మకూరు రూరల్‌

► రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌లో ఉద యం 8.38 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి  చిత్తూరుకు బయలు దేరారు. ఆరోజు హెలికాప్ట్టర్‌ ప్రయాణించేందుకు వాతావరణం ఏమాత్రం సరిగా లేదు. ఆకాశమంతా దట్టమైన క్యుములో నింబస్‌ మేఘాలు ఆవరించి ఉన్నాయి.  

►  35 నిమిషాల ప్రయాణం అనంతరం హైదరాబాద్‌కు 150 కి.మీ. దూరంలో హెలికాఫ్టర్‌ ప్రయాణిస్తూ ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది.  

► సరిగ్గా కొత్తపల్లె మండలంలోని సంగమేశ్వరం వద్ద శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌పై  వెళ్తున్న ఈ ప్రదేశంలోనే çశంషాబాద్‌ ఏటీసీ నుంచి సిగ్నల్‌ వ్యవస్థ చెన్నై ఏటీసీ పరిధిలోకి మారుతుంది. ఈ సందర్భంలో సిగ్నల్స్‌ కాస్త వీక్‌గా కూడా ఉంటాయి.   

► గంటకు 250 కి.మీ. వేగంతో వెళుతున్న చాపర్‌ రెండు నిమిషాల్లో తూర్పు వైపునకు తిరిగి నేరుగా నల్లమల కొండల్లోకి వెళ్లింది. ఒక సిరిమాను చెట్టు కొమ్మలను తాకుతూ చిరుత గుండం తిప్పను ఢీకొంది.  

► ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్‌ ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌)తో సంబంధాలు తెగిపోయే సరికి అందులో ప్రయాణించిన వారి సెల్‌ ఫోన్‌లకు  చివరిగా  ఇస్కాలలోని టవర్‌ నుంచే సిగ్నల్స్‌ అందినట్లు తెలుసుకుని ముఖ్యమంత్రి పేషీ నుంచి ఇక్కడి అధికారులను అప్రమత్తం చేశారు.

► సాయంత్రానికే ప్రముఖులంతా ఆత్మకూరు చేరుకున్నారు. బానుముక్కల టర్నింగ్‌ వద్ద నుంచి పాము లపాడు మండలమంతా జోరు వర్షంలోనే జల్లెడ పట్టారు. హెలికాప్టర్‌ నల్లమలలో దిగి ఉండవచ్చనే అనుమానంతో నల్లమలలో నలుమూలలకు జనం పరుగులు తీశారు.  

► అడవి గురించి తెలిసిన  పశువుల కాపర్ల సహకారం తీసుకున్నారు. చీకటి పడే సరికి కూడా జాడ తెలియ లేదు. 

► భారత వైమానిక దళంలోని సుఖోయ్‌ యుద్ధ విమానాలు రాత్రి రంగంలోకి దిగాయి. వాటికి అమర్చిన అత్యంత శక్తివంతమైన  సెన్సర్ల సహాయంతో రుద్రకోడు శివక్షేత్రానికి ఎడమవైపు ఉన్న పసురుట్ల బీట్‌లో చిరుత గుండం తిప్పపై  హెలికాప్ట్టర్‌ అవశేషాలు ఉన్నట్లు గుర్తించాయి.  

► చాపర్‌లో ప్రయాణించిన ఏ ఒక్కరు ప్రాణాలతో లేని విషయం సెప్టెంబర్‌ 3వ తేదీ ఉదయం అధికారులు ప్రకటించారు. వైఎస్‌  రాజశేఖరరెడ్డి మృతదేహం తాను కూర్చున్న సీట్‌కు బెల్ట్‌తో బిగించి కనబడింది. ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుబ్రమణ్యం. చీఫ్‌ సెక్యూరిటీ అధికారి వెస్లీ, చాపర్‌ పైలట్‌ భాటియా, కో– పైలట్‌ ఎంఎస్‌ రెడ్డి శరీర భాగాలు చెల్లా చెదరై కనిపించాయి.  

Tags