పెళ్లింట విషాదం...

2 Sep, 2018 07:41 IST

రొంపిచర్ల(నరసరావుపేట): వేగంగా వస్తున్న పెళ్లి బృందం ఆటో అదుపు తప్పి రోడ్డుపై ఆగి వున్న లారీని ఢీకొంది. శనివారం అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై చోటుచేసుకున్న  ఈ సంఘటనలో  ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా రొంపిచర్ల పోలీసుల కథనం ప్రకారం...  గత నెల 31వ తేదీన ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామానికి చెందిన నాగరాజుతో గుంటూరు జిల్లా నకరికల్లు మండలం  దేచవరం గ్రామానికి చెందిన  ఇర్లా తిరుపతమ్మకు వివాహం అయింది.  వివాహం అయిన అనంతరం మూడు నిద్రల నిమిత్తం శనివారం పెళ్లికుమార్తె స్వగ్రామం అయిన దేచవరానికి కురిచేడు నుంచి ఆటోలో బయలుదేరారు.

 సుబ్బయ్యపాలెం గ్రామ సమీపంలోకి రాగానే నిలిచివున్న లారీని ఆటో ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న వధువు సోదరుడు ఇర్లా గురుమూర్తి(16)కు తీవ్రగాయాలై ఆటోలోనే మృతి చెందాడు. వరుడి మేనత్త అయిన తమ్మిశెట్టి వెంకటరమణ(35) తీవ్రగాయాలై నరసరావుపేటలోని ప్రయివేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో దేచవరం గ్రామానికి చెందిన వధువు ఇర్లా తిరుపతమ్మ, కురిచేడుకు చెందిన వరుడు చల్లా నాగరాజుతో పాటు కురిచేడుకు చెందిన ఉప్పు దుర్గ, బత్తుల లక్ష్మి ఉన్నారు.

 సమాచారం తెలుసుకున్న మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. క్షతగాత్రులు నరసరావుపేటలోని ప్రయివేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. రొంపిచర్ల ఎస్‌ఐ ఎస్‌.వెంకట్రావు సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు. మృతుని బందువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎస్‌.వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.

Tags