తనకు తానే నివాళి పోస్టర్లు!

2 Sep, 2018 01:58 IST

సాక్షి ప్రతినిధి, చెన్నై: భార్యపై కోపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతూ.. తన నివాళి పోస్టర్లను తానే ముద్రించుకున్నాడు ఓ వింతైన వ్యక్తి. ఈ ఉదంతం తమిళనాడు ఈరోడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాలు.. 
పుంజైపులియంపట్టి సమీపంలో పుదుప్పాళయం గ్రామానికి చెందిన అన్బరసన్‌ (37) భవన నిర్మాణ కార్మికుడు. ఆగస్టు 31వ తేదీన అతడు మరణించినట్లుగా ‘కన్నీటి అంజలి’పేరుతో శుక్రవారం ఊరంతా పోస్టర్లు వెలిశాయి. వీటిని చూసి ఆవేదనకు గురైన బంధుమిత్రులు శనివారం తండోపతండాలుగా అన్బరసన్‌ ఇంటికి చేరుకుని, అతను కులాసాగా కూర్చుని ఉండడంతో బిత్తరపోయారు.

ఇదేమి చోద్యమని బంధువులు అతడిని ప్రశ్నించగా, ‘‘మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య తగవు పెట్టుకుంది. దీంతో విరక్తి చెంది కన్నీటి అంజలి పోస్టర్లు వేశాను. ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాను. అయితే బంధువులు ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణం పోలేదు. వైద్యులతో చెప్పి ఇంటికి చేరుకున్నా’’నని వివరించాడు.

Tags