మంటగలిసిన మానవత్వం

1 Sep, 2018 10:50 IST
చెట్టుకింద ఉంచిన పిశిక వెంకన్న మృతదేహం వద్ద భార్య, పిల్లలు

నకిరేకల్‌ : మానవత్వం మంటగలిసింది. శాస్త్ర, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా ప్రజల్లో మూఢత్వం మాత్రం పోవడం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చనిపోవడంతో అద్దె ఇంటి వారు మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లమనడంతో కాలనీలోని రోడ్డుపైనే చెట్టుకింద ఉంచి శుక్రవారం దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. వివరాలు.. తిప్పర్తికి చెందిన పిశిక వెంకన్న (47) నకిరేకల్‌లో అద్దె ఇంట్లో నివా సం ఉంటున్నాడు. వెంకన్న ప్రస్తుతం తిప్పర్తి మండలం అల్లిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.

వెంకన్నకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వికలాంగురాలు. భార్య లక్ష్మి ఇంటి వద్ద కుట్టు మిషన్‌ కుడుతూ కుటుంబం జీవనం సాగి స్తుంది. వెంకన్న పదేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడడంతో ఆర్థికంగా చితికిపోయాడు. అతనికి వ స్తున్న వేతనం కూడా చేసిన అప్పులకు సరిపోవడం లేదు. అనారోగ్యంతోనే కన్నుమూశాడు. అద్దె ఇంట్లో ఉండడంతో అద్దె ఇంటి వారు మృతదేహాన్ని తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో కుటుం బీకులు కాలనీలోని రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద మృతదేహాన్ని ఉంచారు.

నడివీధిలో భార్య, పిల్లలు దీనంగా రోదిస్తుండడంతో స్నేహితులు వెంకన్న కుటుంబానికి రూ.10వేల సాయం చేశారు. దీంతో  చెట్టుకింద ఉంచే కార్యక్రమాలు నిర్వహిం చి ఊరు శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. తదనంతరం స్థానిక పద్మశాలీ సంఘం ప్రతి నిధులు వెంకన్న కుటుంబీకులను అంత్యక్రియలు పూర్తయ్యేవరకు తమ పద్మశాలీ భవనంలో కార్యక్రమాలు చేసుకునే విధంగా కుటుంబీకులకు వసతి కల్పిస్తామని తెలిపారు. వారు అక్కడికే 10 రోజుల పాటు ఉండేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags