చంద్రన్న పెళ్లి కానుక అడిగితే పెళ్లైందంటున్నారు!

1 Sep, 2018 09:33 IST

సాక్షి, ప్రొద్దుటూరు : చంద్రన్న పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకున్న ఆ నిరుపేద కుటుంబాలకు అధికారులు చుక్కలు చూపించారు. కానుక మాట అటుంచి వరుడికి ఇదివరకే పెళ్లయిందనే నిందను మోపారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో నివసిస్తున్న బాల ఓబులేసు, నాగలక్షుమ్మ కుమారుడు ఓబులేసుకు ఇదే ప్రాంతంలో నివసిస్తున్న రాజు, గుర్రమ్మల కుమార్తె రామాంజనమ్మను ఇచ్చి సెప్టెంబర్‌ 19న గండి క్షేత్రంలో వివాహం జరపించాలని పెద్దలు నిర్ణయించారు. ఇరువురి కుటుంబీకులు స్థానిక ఇటుకల పరిశ్రమల్లో పనిచేస్తూ సమీపంలోనే నివసిస్తున్నారు. నిరుపేదలైన వీరు సీఎం చంద్రబాబు ప్రకటించిన చంద్రన్న పెళ్లి కానుక కోసం ఇటీవల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు.

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు సందర్భంగా ఓబులేసుకు ఇదివరకే వివాహం అయిందని సర్వే జాబితాలో ఉంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులను సంప్రదించగా ప్రజాసాధికార సర్వేలో ఆ విధంగా నమోదైందని అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం శుక్రవారం గ్రామదర్శినిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికాకుండానే పెళ్లి అయిందని ఎలా రాస్తారని అధికారులను ఓబులేసుతో పాటు బంధువులు ప్రశ్నించారు. అధికారులు మాత్రం ఇది తమ తప్పిదం కాదని బదులిచ్చారు. తప్పును సరిదిద్దితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటామని బాధితులు చెప్పగా రెండేళ్ల క్రితం జరిగిన ప్రజాసాధికార సర్వే సమయంలో ఉన్న సూపర్‌వైజర్‌ మాత్రమే దీనిని సరిచేసే అవకాశం ఉందని, తామేమి చేయలేమని స్పష్టం చేశారు. ఆ సమయంలో ఎవరు సర్వే చేశారు అనే వివరాలు అధికారుల వద్ద లేవు. ఇదే విషయాన్ని 1100 ద్వారా ఫిర్యాదు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

Tags