బోల్తా కొట్టిన తుఫాన్‌.. పెళ్లి కుమార్తె క్షేమం

31 Aug, 2018 12:45 IST
భయాందోళనలో పెళ్లి బృందం., క్షేమంగా బయట పడిన పెళ్లి కుమార్తె

ప్రకాశం, అద్దంకి: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న తుఫాన్‌ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలోని కొంగపాడు డొంక వద్ద గురువారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం  కారుమంచికి చెందిన పెనుమాక వెంకటేశ్వరరావు కుటుంబానికి చెందిన పెళ్లి బృందం 11 మంది తుఫాన్‌ వాహనంలో తిరుపతి వెళ్లారు.

అక్కడ వివాహం చేసుకుని గురువారం తెల్లవారు జామున తిరుపతి నుంచి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ వాహనానికి చిన్నం వెంకట వీరాంజనేయులు డ్రైవర్‌గా వెళ్లాడు. ఈ క్రమంలో వాహనం అద్దంకి మండలం కొంగపాడు డొంక సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్‌కు  చేయి విరిగింది. ఎస్‌ఐ సుబ్బరాజు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

డ్రైవర్‌ నిద్రమత్తే కారణం
నిరంతర ప్రయాణంతో డ్రైవర్‌కు నిద్రలేదు. తెల్లవారు జాము కావడంతో ఆయన నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఫలితంగా వాహనం అదుపు తప్పింది. ఏది ఏమైనా పెను ప్రమాదం తప్పి బృంద సభ్యులు స్వల్ప గాయాలతో బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Tags