బీఎంసీ స్వపరిపాలన దినోత్సవం నేడు

31 Aug, 2018 13:36 IST
ముఖ్య అతిథిగా హాజరుకానున్న బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి 

బరంపురం : బీఎంసీ (బరంపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌) 151వ స్వపరిపాలనా దినోత్సవాలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా బీజేడీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రాహి తెలిపారు. ఈ మేరకు స్థానిక ఐవీ సమావేశ మందిరంలో బీఎంసీ ఆధ్వర్యంలో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి మున్సిపాలిటీ బరంపురం మున్సిపాలిటీ అని గుర్తు చేశారు.

బరంపురం మున్సిపాలిటీ ఏర్పడి 151 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ స్వపరిపాలన దినోత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛభారత్‌ అంబాసిడర్, బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలిమల, పరిశుభ్రతపై నగర ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు వివరించారు. గతేడాది బీఎంసీ 150వ స్వపరిపాలనా దినోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామని, ఈ నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ నగర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన

అలాగే బీఎంసీ 151వ స్వపరిపాలనా దినోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమానికి నేతలు, అధికారులు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కళ్లికోట్‌ కళాశాల మైదానంలో సాయంత్రం జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్‌ నటులు సునీల్‌శెట్టితో పాటు కరీనాఖాన్, పాప్‌ సింగర్‌ వినోథ్‌రాథోడ్‌  పాల్గొని, వీక్షకులకు కనువిందు చేయనున్నట్లు తెలిపారు. 

సమావేశంలో ఎమ్మేల్యే రమేష్‌చంద్ర చావ్‌ పట్నాయక్, మాజీ కేంద్రమంత్రి చంద్రశేఖర్‌ సాహు, మేయర్‌ కె.మాధవి, డిప్యూటీ మేయర్‌ జోత్సా్న నాయక్, కమిషనర్‌ చక్రవర్తి రాథోడ్, బరంపురం అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుభాష్‌ మహరణ తదితరులు పాల్గొన్నారు.

Tags