పెళ్లయిన మూడు నెలలకే..

31 Aug, 2018 07:04 IST
అరుణాదేవి (ఫైల్‌ ఫోటో)

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: పెళ్లయిన మూడు నెలలకే ఓ వివాహిత అదనపు కట్నం వేధింపులతో ఆత్యహత్య చేసుకుంది. పెళ్లయిన నెల రోజులకే విదేశం వెళ్లిన భర్త అక్కడి నుంచి అదనపు కట్నం కోసం ఫోన్‌లో తరచూ వేధిస్తుండడంతో అమలాపురం విద్యుత్‌నగర్‌కు చెందిన కామిశెట్టి అరుణాదేవి(24) తన పుట్టింట్లో ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు పట్టణ సీఐ సీహెచ్‌ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. యానానికి చెందిన కేవీ పెరుమాళ్లతో అరుణాదేవికి గత మే ఐదోతేదీన అమలాపురంలో వివాహమైంది. పెరుమాళ్లు ఫ్రాన్స్‌ దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. నెల రోజులపాటు ఇండియాలో ఉండి ఆ తర్వాత భార్య అరుణాదేవిని వెంట తీసుకుని వెళ్లకుండా ఆమెను పుట్టింటి వద్దే ఉంచి ఫ్రాన్స్‌ వెళ్లిపోయాడు.

పెరుమాళ్లు తల్లిదండ్రులు కూడా ఉద్యోగాల రీత్యా ఫ్రాన్స్‌ దేశంలోనే స్థిరపడ్డారు. వెళ్లిన తర్వాత నుంచి పెరుమాళ్లు భార్య అరుణాదేవికి రోజూ ఫోన్‌ చేస్తూ అదనపు కట్నం కోసం వేధించ సాగాడు. భర్తతో పాటు అతడి తల్లిదండ్రులు, హైదరాబాద్‌లో ఉంటున్న అతడి సోదరి కూడా అదనపు కట్నం కోసం ఒత్తిడి తెస్తున్నారని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. తనకు అదనంగా మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడని చెప్పారు. ఇందులో భాగంగానే భర్త పెరుమాళ్లు నుంచి భార్యకు బుధవారం ఫోన్‌ వచ్చింది. మళ్లీ అదనపు కట్నం కోసం అరుణాదేవిని ఫోన్‌లో పదేపదే వేధించడంతో తట్టుకోలేక ఆమె అమలాపురంలోని తన పుట్టింటిలోనే ఓ గదిలో ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకుందని సీఐ తెలిపారు.

ఎంతో అల్లారుముద్దుగా పెంచాం..
విదేశంలో ఉద్యోగస్తుడని, అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లిని ఎంతో ఆడంబరంగా చేశామని, పెళ్లయిన మూడు నెలలకే తమ అల్లుడు, అతడి తల్లిదండ్రుల వేధింపులతో మా అమ్మాయిని పొట్టనపెట్టుకున్నారని అరుణాదేవి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. బీటెక్‌ చదివిన తన కుమార్తెను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచానని, చివరకు అదనపు కట్నం కోసం ఆత్యహత్య చేసుకునేలా ఆమె మెట్టింటి వారు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.

భర్త, అత్తమామలువిదేశం నుంచి వచ్చాకే..
మృతురాలి తండ్రి రావూరి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. భర్త పెరుమాళ్లతోపాటు అతడి తల్లిదండ్రులు, సోదరిపైనా కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అమలాపురం తహసీల్దార్‌ బేబీ జ్ఞానాంబ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శవ పంచనామా చేశారు.అయితే భర్త, అత్తమామలు విదేశం నుంచి వచ్చిన తర్వాతే మృత దేహానికి పోస్టుమార్టం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్‌ చేయడంతో ప్రస్తుతానికి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.

Tags