సీటు బెల్టు..చిన్నచూపు!

30 Aug, 2018 14:56 IST
ప్రతీకాత్మక చిత్రం

కార్లు.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారు సీటు బెల్టు పెట్టుకోవడం.. హెల్మెట్‌ వాడడం తప్పనిసరి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..ఇవి పోలీసు..రవాణాశాఖాధికారులు తరచూ చెబుతున్న మాటలు.. చేస్తున్న హెచ్చరికలు. కానీ ఇవేవీ వాహనదారుల చెవులకు ఎక్కడం లేదు. సీటు బెల్టు.. హెల్మెట్‌ అన్నా చాలామంది చిన్నచూపు చూస్తున్నారు. వీటిని పెట్టుకోవడమంటే ఏదోలా భావిస్తున్నారు.– లాల్‌జాన్‌ బాషా.. టీడీపీ సీనియర్‌ నాయకుడు. నందమూరి హరికృష్ణ.. సినీ నటుడు, స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు.

వీరిద్దరూ వారు ప్రయాణిస్తున్న కార్లు బోల్తాపడడంతోనే చనిపోయారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే వీరు మృత్యువు ఒడికి చేరారు. అదే సీటు బెల్టు వాడి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేదికాదనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరే కాదు చాలామంది పరిస్థితి ఇదే. సీటు బెల్టు పెట్టుకోకుండానే వాహనాలను డ్రైవ్‌ చేస్తుంటారు. అనుకోని రీతి లో ప్రమాదాలబారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

శ్రీకాకుళం సిటీ: రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు వంటి భారీ వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ప్రమాదాలు బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్‌ ధరించకపోవడం, కార్లు నడిపే సమయంలో సీటుబెల్ట్‌ పెట్టుకోకపోవడం వలన జరిగే ప్రమాదాలు పెను విషాదానికి కారణమవుతున్నాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ పెట్టుకోకపోవడం, కార్లు నడిపేవారు తమ సీటు బెల్ట్‌ ధరించకపోవడం వల్లే 10 శాతం వరకూ ప్రమాదాల బారిన పడుతూ మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెబు తున్నాయి.

ఇందుకు ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రమాదాల బారిన పడడం శోచనీ యం. దీనికి తోడు మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం, జాతీయ రహదారులపై పరిమితికి మిం చిన వేగంతో ప్రయాణించడం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు తోడవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులపై తీసుకోవా    ల్సిన చర్యల గురించి క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల యంత్రాంగం ప్రజలకు అప్రమత్తం, అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ అవి తూతూ మంత్రంగానే  సాగుతుండడంతో ప్రమాదాల శాతం ఏమాత్రం తగ్గడం లేదు సరికదా మరింతగా పెరుగుతూనే ఉన్నాయి.

జిల్లాలో ప్రతి ఏటా వేల సంఖ్యలో ప్రమాదాల బారిన పడుతూ క్షతగాత్రులుగా మారుతుండడం, పదుల సంఖ్యలో మృత్యువాత పడడం కూడా ఒకింత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో పోలీసులు, రవాణాశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు వలన కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఇంటి వద్దనుంచి బయలుదేరిన వాహనదారులు సక్రమంగా తిరిగి వచ్చే వరకూ వారి కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ కాకుండా గుండెలమీద చేయి వేసుకునేలా ఉండాలంటే వాహనదారుడు వేగనియంత్రణ, ట్రాఫిక్‌ నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించల్సిందేనని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. 

 ఒక్క క్షణం ఆలోచించండి:

ప్రతి వాహనదారుడు వారి వాహనం నడిపే సమయంలో ఒక్కక్షణం ఆలోచించాలి. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఒక కుటుంబం తనపై ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సెక్షన్‌ 177 ప్రకారం ప్రతి వాహనదారుడు నిబంధనలను కచ్చితంగా పాటించినట్‌లైతే ప్రమాదాల శాతం చాలా వరకూ అరికట్టవచ్చు. ద్విచక్రవాహనదారుడు హెల్మెట్‌ ధరించకపోతే రూ.100, కార్డు నడిపే సమయంలో సీటు బెల్ట్‌ ధరించకపోతే రూ.100 అపరాధ రుసుంగా అధికారులు ప్రస్తుతం వసూలు చేస్తున్నారు.

అయితే కొత్త నిబంధనల ప్రకారం వీటి రుసుం రూ. 1000 వరకూ పెంచారు. ఇవి ఇంకా అమలు కావాల్సి ఉంది. జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రతి వాహన దారుడు మితిమీరిన వేగంతో కాకుండా పరిమితికి లోబడి ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వలన కూడా ఎంతో ప్రమాదం ఉంది. తనకు జరిగే ప్రమాదంతోపాటు ఎదుటివ్యక్తులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ప్రయాణం చేస్తే వాహనదారునికి ఇన్సూరెన్స్‌ రాయితీలు కూడా వర్తించే అవకాశాలు ఉండవు. పలుమార్లు చలానాల రూపంలో వాహనదారుడు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైతే వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోల్పోవాల్సి వస్తుంది. వాహనాలను కూడా కొన్ని సందర్భాల్లో సీజ్‌ చేసే అవకాశం ఉంది.  

Tags