‘ఇండ్‌ భారత్‌’ దివాలా ప్రక్రియకు ఓకే 

30 Aug, 2018 01:55 IST

సాక్షి, హైదరాబాద్‌: ఇండ్‌ భారత్‌ ఇన్‌ఫ్రా పవర్‌ లిమిటెడ్‌ అనుబంధ కంపెనీ అయిన ఇండ్‌ భారత్‌ ఎనర్జీ (ఉత్కళ్‌) లిమిటెడ్‌ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్‌పీ) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి తీసుకున్న రూ.167 కోట్ల రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు ఎన్‌సీఎల్‌టీ ఈ మేర నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్‌పీ) ముంబాయికి చెందిన ఉదయ్‌రాజ్‌ పట్వర్థన్‌ను నియమించింది. ఇండ్‌ భారత్‌ ఎనర్జీ (ఉత్కల్‌) ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించింది. ఈ ఆస్తులపై న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయడం, కోర్టు తీర్పులను అమలు చేయడం తదితరాలను చేయరాదంది. అంతేకాక ఆస్తులను విక్రయించడానికి గానీ, తాకట్టు పెట్టడానికి వీల్లేదని ఇండ్‌ భారత్‌ ఎనర్జీ (ఉత్కల్‌) లిమిటెడ్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది. దివాలా ప్రక్రియకు సంబంధించి పత్రికా ప్రకటన జారీ చేయాలని ఐఆర్‌పీని ఆదేశించింది.

ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ జుడీషియల్‌ సభ్యులు బిక్కి రవీంద్రబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇండ్‌ భారత్‌ ఎనర్జీ (ఉత్కల్‌) లిమిటెడ్‌ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు సింగపూర్‌కు చెందిన ఎంఏఐఎఫ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. తమకు ఇండ్‌ భారత్‌ ఎనర్జీ (ఉత్కల్‌) లిమిటెడ్‌ రూ.134 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉందని, అయితే ఇది తిరిగి చెల్లించడం లేదని, అందువల్ల ఆ కంపెనీ సీఐఆర్‌పీకి అనుమతించాలంటూ ఎంఏఐఎఫ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ సభ్యులు రవీంద్రబాబు, ఇండ్‌ భారత్‌ ఎనర్జీలో 99 శాతం వాటాతో మొత్తం కంపెనీపై ఎంఏఐఎఫ్‌ అజమాయిషీ సంపాదించిందని, అందువల్ల ఆ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బకాయిల విషయంలో ఐఆర్‌పీ ముందు దరఖాస్తు చేసుకోవాలని ఎంఏఐఎఫ్‌కు స్పష్టం చేశారు.   

Tags