అభివృద్ధిలో గజ్వేల్‌ నంబర్‌వన్‌

29 Aug, 2018 11:23 IST
అహ్మదీపూర్‌ గ్రామంలో విద్యార్థినులకు హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్లను అందజేస్తున్న ‘గడా’ ప్రత్యేకాధికారి హన్మంతరావు 
గజ్వేల్‌ మెదక్‌ : గజ్వేల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని... ఈ క్రమంలోనే గ్రామాల్లో అన్ని రకాల వసతులు సమకూరాయని ‘గడా’ ప్రత్యేకాధికారి హన్మంతరావు పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ‘ఆరోగ్య రక్ష’ పథకంలో భాగంగా హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ‘కంటి వెలుగు’ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు.
సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని తెలుసుకుంటూ తమకు ఆదేశాలిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం పథకం పనులు, అంగన్‌వాడీ కేంద్రంను పరిశీలించిన అనంతరం మినీ ట్యాంక్‌బండ్‌ పనులను కూడా చూశారు. బతుకమ్మ పండుగ వరకు మినీ ట్యాంక్‌బండ్‌ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి గజ్వేల్‌ మండలశాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌గౌడ్, పాఠశాల హెచ్‌ఎం కరీమొద్దీన్, పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శ్రీనివాస్, గ్రామ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రామాగౌడ్, నిజాం, ప్రభాకర్, అమర్, బుచ్చిరెడ్డి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags