జెన్‌ అందిస్తున్న స్ఫూర్తి

25 Aug, 2018 00:01 IST

ముంబైలోని పరేల్‌లో బహుళ అంతస్తుల భవంతికి నిప్పంటుకుని నలుగురు మరణించిన ఉదం తంలో పదేళ్ల బాలిక జెన్‌ సదావర్తి అప్రమత్తత అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. మొన్న బుధ వారం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఆమె వల్ల 16మంది ప్రాణాలతో బయటపడగలిగారు. ఆప త్సమయాల్లో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలపైనా... అసలు అలాంటి ప్రమాదాలు చోటు చేసు కోకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపైనా పౌరులందరికీ అవగాహన కలిగించాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం తెలియజెబుతోంది. అగ్ని ప్రమాదాల సమయంలో ఏం చేయాలో మూడో తరగతి చదువుతుండగా తన పాఠశాలలో నేర్చిన అంశాలను ఇప్పుడామె గుర్తుంచుకుని అందరి తోనూ ఆచరింపజేసింది. ప్రమాదాలు జరిగినప్పుడు నిబ్బరంగా ఉండటం అవసరమని, ముఖ్యంగా మంటలంటుకుని పొగ ఆవరించినప్పుడు తడి బట్టను ముఖంపై వేసుకుని దానిద్వారా మాత్రమే గాలి పీల్చాలని జెన్‌ తెలుసుకుంది.

ఒకపక్క మంటలు, పొగ వ్యాపించటం... మరోపక్క పేలుళ్ల శబ్దాలు వినబడుతుండటం పర్యవసానంగా తన తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు ఫ్లాట్లలో నివసించేవారూ ఆందోళన పడుతున్న వైనాన్ని గమనించి వారికి ధైర్యం చెప్పింది. అందుబాటులో ఉన్న వస్త్రాన్ని చించి ఆ ముక్కల్ని నీటిలో తడిపి అందరికీ అందజేసింది. తడి బట్ట ద్వారా గాలి పీల్చకపోతే కమ్ముకొస్తున్న పొగలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌తో కాసేపటికే స్పృహ కోల్పోతామని నచ్చ జెప్పింది. లిఫ్ట్‌ వాడకూడదని వివరించింది. వీరున్న 12వ అంతస్తు నుంచి వెంటనే మెట్ల ద్వారా దిగిరావాలని ఫోన్‌లో అగ్నిమాపక సిబ్బంది సూచించినప్పుడు అది సాధ్యం కాదని, గాభరాలో ఉన్న వారికి ఊపిరాడదని తెలిపింది. చివరకు క్రేన్‌ ద్వారా వీరందరినీ ఆ సిబ్బంది కిందకు దించారు. ప్రమాదాలు చెప్పి రావు. అవి వచ్చిపడినప్పుడు ఎలాంటివారైనా అయోమయంలో పడతారు. ఏం చేయాలో పాలుబోక పొరబాట్లు చేసి ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. మన పాఠ్య పుస్తకాల్లో ఏదో మొక్కుబడిగా తప్ప వీటిపై అవగాహన కలిగించే ప్రయత్నం కనబడదు. అలాగే నిర్ణీత వ్యవధిలో ఎప్పటికప్పుడు వివిధ రకాల ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు చేయిం చటం అసలే ఉండదు.

వాటి అవసరం ఎంత ఉందో జెన్‌ తెలియజెప్పింది. నదీ తీరాల్లో, జలా శయాల్లో, కొండల్లో, లోయల్లో పొంచి ఉండే ప్రమాదాలేమిటో చెప్పటం, ఆయా ప్రాంతాల్లో తీసు కోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలేమిటో వివరించటం అనే సంస్కృతి మన విద్యా సంస్థల్లో కన బడదు. ఎప్పుడో తప్పనిసరై మొక్కుబడిగా ఆ తరహా కార్యక్రమాలు నిర్వహించటం తప్ప దాన్నొక కీలకమైన అవసరంగా గుర్తించినట్టు కనబడదు. నాలుగేళ్లక్రితం హైదరాబాద్‌ శివార్లలోని విజ్ఞాన్‌ జ్యోతి ఇంజనీరింగ్‌ విద్యార్థులు హిమాచల్‌ ప్రదేశ్‌ సందర్శనకెళ్లి అక్కడి బియాస్‌ నదిలో మృత్యు వాత పడిన ఉదంతం ఎవరూ మరవలేరు. 24మంది యువ ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఆ విషాద ఉదంతం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఉంటే అసలు జరిగేదే కాదు. విద్యు దుత్పాదన కోసమని నిర్మించిన బరాజ్‌ వద్ద అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు గేట్లు తెరవటం, జలాశయంలోని నీరు పెద్దయెత్తున ఎగిసిపడుతూ బయటకు రావడం సంగతి ఆ పిల్లలకు తెలి యదు. విద్యుదుత్పాదన కేంద్రం వద్ద అలా నీరు వదులుతారని ఆ పిల్లలకు అవగాహన ఉంటే అసలు కిందికి దిగేవారు కాదు. ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చినవారికి అది తెలిసే అవకాశం లేదని స్థానిక ప్రభుత్వ యంత్రాంగమైనా గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టి ఉంటే బాగుండేది.

తరచు భూకంపాలతో సతమతమయ్యే జపాన్‌... వాటిపై పౌరుల్లో అప్రమత్తత పెంచటం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అలారం మోగగానే ఏం చేయాలో అక్కడి పాఠశాలల పిల్లలకు తెలుసు. ప్రతి నెలా ఇందుకు సంబంధించిన కసరత్తులు వారితో చేయిస్తుంటారు. భద్రతా చర్యల గురించి పాఠ్యాంశాలుంటాయి. భూకంపం వస్తున్నదని గుర్తించిన వెంటనే హెల్మెట్‌ ధరించటం, ఏమాత్రం ఆందోళనపడకుండా ప్రశాంతంగా తరగతి గదుల్ని విడిచి బయటకు రావటం వారికి ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉండదు. భవంతుల నిర్మాణంలో తీసుకునే ముందస్తు జాగ్రత్తలు సరేసరి. అవి భూకంపాలను తట్టుకునే విధంగా ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు చోటు చేసు కున్నప్పుడు తక్షణం అంబులెన్స్‌కు కబురు చేయాలని ఎవరికీ తోచకపోవటం వల్ల సకాలంలో వైద్యం అందక అనేకమంది మరణిస్తున్నారు. కేరళలో వచ్చిన వరదలు ఆనకట్టల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని వెల్లడించాయి. ఆనకట్టలకు సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వమూ కార్యాచరణ ప్రణాళికలనుగానీ, ముంపు ప్రాంతాల మ్యాప్‌లను గానీ రూపొందించుకోలేదని నిరుడు కాగ్‌ నివేదిక తెలిపింది.

జలాశయాల నీటి మట్టం పెరిగింది గనుక నీరు బయటకు వదులుతామని హెచ్చరించటం తప్ప ఏ స్థాయిలో నీరు వదిలితే ఎంత మేర ప్రాంతం ముంపునకు గురవుతుందో అంచనా వేసుకునే ఉపకరణాలు ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఉండటం లేదు. దేశం మొత్తం మీద 4,862 పెద్ద ఆనకట్టలుండగా కేవలం 349 ఆనకట్టలకు(7 శాతం) మాత్రమే ఇటువంటి అత్యవసర ప్రణాళికలున్నాయని కాగ్‌ తెలిపింది. ఆకస్మికంగా నీరు వచ్చిపడితే, దాన్ని పెద్ద మొత్తంలో విడుదల చేయక తప్పని స్థితి ఏర్పడితే... అనుకోకుండా ఆనకట్టలు బద్దలైతే ఎంత విస్తీర్ణంలోని ప్రాంతం ముంపు బారిన పడుతుందో, అటువంటి సమయాల్లో తీసుకునే చర్యల క్రమం ఎలా ఉండాలో ఎవరి దగ్గరా ప్రణాళికలు లేవు. కేరళలో 61 ఆనకట్టలుంటే ఒక్కదానికీ అత్యవసర ప్రణాళిక లేదు. ఈ విషయంలో దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితీ ఇంచుమించు అలాగే ఉంది.  సాధారణ పౌరుల మొదలు ప్రభుత్వాల వరకూ అన్ని స్థాయిల్లోనూ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు, ముందస్తు చర్యలు నష్టాలను నివారిస్తాయి. భద్రతకు భరోసానిస్తాయి. పదేళ్ల జెన్‌ నుంచి అందరూ నేర్చు కోవాల్సింది ఇదే. 

Tags