25న ఉపరాష్ట్రపతి పర్యటన

23 Aug, 2018 13:17 IST
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భువనేశ్వర్‌ ఒరిస్సా : భారత ఉపరాష్ట్రపతి ఈ నెల 25న రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) తొలి కాన్వొకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. లోగడ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనివార్య కారణాలతో కార్యక్రమం వాయిదా పడడంతో ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి రాష్ట్ర పర్యటనను పురస్కరించుకుని బ్లూ బుక్‌ మార్గదర్శకాల మేరకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉప రాష్ట్రపతి నగరంలో సుమారు 4 నుంచి 5 గంటలు మాత్రమే పర్యటిస్తారు. ఈ వ్యవధిలో అవాంఛనీయ సంఘటనల నివారణ దృష్ట్యా 25 ప్లాటూన్ల పోలీసు దళాల్ని ప్రత్యేకంగా మోహరిస్తున్నారు. న్యూ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విచ్చేసే  ఉప రాష్ట్రపతి ప్రత్యక్షంగా రాజ్‌ భవన్‌కు వెళ్లి కార్యక్రమం వేదిక ప్రాంగణం ఎయిమ్స్‌కు చేరుకుంటారని జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ సత్యజిత్‌ మహంతి తెలిపారు. కార్యక్రమం ముగియడంతో స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి న్యూ ఢిల్లీ తిరిగి వెళ్తారని ఉపరాష్ట్రపతి కార్యక్రమం వివరాల్ని సంక్షిప్తంగా వివరించారు.  

Tags