సిరులతల్లి అమృతవల్లి

19 Aug, 2018 01:05 IST

లక్ష్మి అనే పదం వినగానే పద్మంపై కూర్చుని తామరపుష్పాలు చేతపట్టుకొని అభయ, వరద ముద్రలతో భక్తులను అనుగ్రహిస్తున్నట్లుగా ఉండే రూపం మనసులో మెదులుతుంది. అలాగే ఆమె వెనుక వైపు రెండు ఏనుగులు కుంభాలతో ఆమెను అభిషేకించే సన్నివేశం కూడా గుర్తుకు వస్తుంది. లక్ష్మీదేవి స్వరూపాలను ఆగమ, శిల్పశాస్త్రాలు ఎన్నో రకాలుగా వివరించాయి. ముఖ్యంగా శ్రీదేవి మూడు రూపాలు వీరలక్ష్మి, యోగలక్ష్మి , భోగలక్ష్మి అని చెబుతారు. వీరిలో యోగశక్తి మహావిష్ణువు హృదయంపై శ్రీవత్స రూపంలో హృదయలక్ష్మి గా నిలిచి ఉంటుంది.

భోగలక్ష్మి స్వామివారి సరసన ఉంటుంది. ఇక వీరలక్ష్మీదేవికి స్వతంత్రంగా ఆలయం నిర్మించి పూజించాలి. ఈ అమ్మవారికి పరివారంగా తుష్టి, పుష్టి, సావిత్రి, వాగ్దేవిలని స్థాపించాలి. వీరలక్ష్మీదేవి ఆలయానికి మధ్యలో బ్రహ్మభాగంలో పద్మాసనంపై కూర్చొని నిజహస్తాలలో అభయ వరద ముద్రలను, పరహస్తాలలో తామరపూవులను ధరించి ఉంటుంది. లక్ష్మీదేవి కొన్ని విగ్రహాలలో రెండు చేతులతో మరికొన్ని చోట్ల నాలుగు చేతులతో కనిపిస్తుంది.

ఆమె నాలుగు చేతులు ధర్మార్థ కామ మోక్షాలను ప్రతిబింబిస్తాయి. ఆమె చేతిలోని ఫలం అనుగ్రహఫలం. అమె చేతులలో కమలం, శ్రీ ఫలం, శంఖం, అమృత ఫలం, మాతులుంగఫలం, ఖేటకం, గదా వంటి విశిష్ట ఆయుధాలు కనిపిస్తాయి. తమిళనాడులోని వేలూరు జిల్లాలో షోలింగర్‌ అనే ఊరిలో ప్రాచీన యోగనరసింహస్వామి ఆలయం కొండపై ఉంది. ఆ ఆలయంలో మహాలక్ష్మి దేవి అమృత ఫలవల్లితాయారుగా దర్శనమిస్తోంది. ఈమె రూపం ఆగమాలు వర్ణించిన వీరలక్ష్మీదేవిగా ప్రసిద్ధి.

– డా. ఛాయా కామాక్షీదేవి

Tags