దేవుడే మౌనం వహిస్తే..?

19 Aug, 2018 01:00 IST

‘నిశ్శబ్దం’ కొంతసేపు బాగానే ఉంటుంది, ఆ తర్వాతే మనల్ని భయకంపితులను చేస్తుంది. ఒకవేళ దేవుడే నిశ్శబ్దం వహిస్తే?? అది మరీ భయం కలిగించే పరిణామం. ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో ఇశ్రాయేలు దేశంలో అదే జరిగింది. అహాబు రాజు, అతని భార్య యెజెబెలు ప్రతిష్టించిన ‘బయలు’ అనే కొత్త దేవుని మోహంలో పడి ఇశ్రాయేలీయులంతా జీవము కల్గిన దేవుణ్ణి విస్మరించిన ఆ ‘చీకటికాలం’లో తీవ్రమైన క్షామం, దేవుని మౌనం వారికి దుర్భరమయ్యాయి. దేవుడు నిశ్శబ్దం వహించాడంటే, ఆయనకిష్టం లేని ఏదో అంశం లేదా పరిణామం విశ్వాసుల జీవితాల్లో లేదా కుటుంబంలో ఉందని అర్ధం.

ఇశ్రాయేలీయులను కంటికి రెప్పలా కాపాడుతూ కనాను అనే వాగ్దాన దేశానికి తన బాహువుల మీద మోసుకొచ్చినట్టుగా వారిని తీసుకొని వస్తే నిజదేవుని ఆరాధనలతో ప్రతిధ్వనించవలసిన వారి ఇశ్రాయేలు దేశంలో, అహాబు భార్యయైన యెజెబెలు తన దేశమైన సీదోను నుండి తెచ్చి దేశమంతటా గుడులు కట్టి నిలబెట్టిన ‘బయలు’ దేవుని ప్రతిమల ఎదుట మోకరించడమే వారి క్షమార్హం కాని పాపమయ్యింది. ఈ లోకంలోని వాతావరణమంతా బయలు దేవుని ఆధీనంలోనే ఉంటుందన్నది సీదోనీయుల విశ్వాసం. అంతకాలం వర్షాలు క్రమం తప్పకుండా విరివిగా కురవడం కూడా ఆ ‘బయలు’ చలవేనన్న విశ్వాసం ఇశ్రాయేలీయులలో బలపడుతూండటంతో దేవుడు మూడున్నరేళ్ల పాటు వర్షం పడకుండా నిలిపివేశాడు.

దాంతో బయలు దేవునికి ప్రజల పూజలు ముమ్మరమయ్యాయి. ఐనా వర్షాలు పడలేదు సరికదా దేశమంతటా కరువు తాండవించింది. ఆ దశలో మూడున్నరేళ్ల తర్వాత కర్మెలు పర్వతం మీద ఏలీయాకు బయలు దేవుని ప్రవక్తలకు మధ్య జరిగిన ’ప్రార్ధనల పోటీ’లో, వర్షం కురిపించడానికి వందలాది మంది బయలు ప్రవక్తలు చేసిన ప్రార్ధనలు విఫలం కాగా, ఇశ్రాయేలీయుల దేవుని పక్షంగా ఏలియా ఒక్కడే ఒంటరిగా నిలిచి చేసిన ప్రార్థన ఫలించి విస్తారమైన వర్షం పడింది. ఫలితంగా కర్మెలు పర్వతం మీద ఇశ్రాయేలీయుల్లో ఆ రోజున గొప్ప పశ్చాత్తాప విప్లవం, పునరుజ్జీవం పెల్లుబుకగా, వాతావరణం ఎవరి అధీనంలో ఉందో, ఎవరు నిజమైన దేవుడో అక్కడికక్కడే తేలిపోయింది(1 రాజులు 17,18 ఆధ్యాయాలు).

ఆయన బిడ్డలమైన మనపట్ల దేవునిదెప్పుడూ తండ్రి మనస్సే!! చిన్నపుడు ఏదైనా తప్పు చేయాలంటే నాన్న కఠినంగా శిక్షిస్తాడన్న భయం కన్నా, రోజంతా గల గలా మాట్లాడుతూ అన్నీ తానే అయి ఎంతో ప్రేమతో చూసుకునే అమ్మకు తెలిస్తే ఆమె బాధపడి మౌనం వహిస్తుందేమోనన్న భావనే తప్పు జరగకుండా అడ్డుకునేది. తల్లిదండ్రులు శిక్షించినా, మౌనం దాల్చినా పిల్లల్ని బాధపెట్టేందుకు కాదు, వారిని సరిదిద్దేందుకే కదా? ఆనాడే కాదు, ఇప్పుడు కూడా విశ్వాసుల వ్యక్తిగత, కుటుంబ జీవితాల్లో దేవుడు మౌనం వహించాడన్న భావన కలిగితే వెంటనే స్వపరీక్ష చేసుకోవాలి.

మనలో ఎక్కడ పొరపాటు ఉంది, ఎక్కడ దారి తప్పాము అన్నది తెలిసికొని పశ్చాత్తాప పడితే, దేవుడు మౌనం వీడుతాడు, ఆశీర్వాదాల వరద మళ్ళీ ఆరంభమవుతుంది.ప్రపంచంలో ఒక పాపి పశ్చాత్తాపపడితే ఆ భావనకున్న శక్తి ఎంతటిదంటే, అది దేవుని మనసును పూర్తిగా  కరిగించేస్తుంది. ఆశీర్వాదాలు మనదాకా రాకుండా అడ్డుకొంటున్న పరిస్థితులను దేవుడే తొలగిస్తాడు. అయితే మనం పశ్చాత్తాపపడితేనే అది జరుగుతుంది.                                   

– రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్‌

Tags