కందకాల ద్వారా పరిశ్రమకు, తోటకు నీటి భద్రత!

14 Aug, 2018 04:41 IST

ఈ ఏడాది చెప్పుకోదగ్గ వర్షం కురవకపోయినా.. సంగారెడ్డి జిల్లా పసలవాది గ్రామ పరిధిలో ఒక పరిశ్రమకు, దాని పక్కనే ఉన్న మామిడి తోట, వరి పొలానికి నీటి కొరత లేదు! ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇది నిజం. ఇందులో మాయ మంత్రాలేమీ లేవు. ఇది కేవలం కందకాల మహత్మ్యం! అది 13.5 ఎకరాల భూమి. అందులో రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించిన పెద్ద ఇండస్ట్రియల్‌ షెడ్‌ ఉంది. కొద్ది సంవత్సరాల క్రితం దీన్ని వత్సవాయి కేశవరాజు కొనుగోలు చేశారు. అప్పటికి ఒకటే బోరు ఉంది. మరో 4, 5 చోట్ల బోరు వేశారు. చుక్క నీరు పడలేదు.

ఇక ఉన్న బోరే దిక్కయింది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పైపుల తయారీ పరిశ్రమ అది. పరిశ్రమకు నీరు అవసరం ఉంటుంది. ఆరు ఎకరాల్లో మామిడి మొక్కలు నాటారు. మిగతా భూమిలో కంది తదితర పంటలు పండించే వారు. ఎండాకాలంలో బోరుకు నీరు తగినంత అందేది కాదు. ఆగి, ఆగి పోసేది. అటువంటి పరిస్థితుల్లో మిత్రుడు ప్రకాశ్‌రెడ్డి సూచన మేరకు వాన నీటి సంరక్షణ చేపట్టి నీటి భద్రత పొందాలన్న ఆలోచన కలిగింది. కందకాలతో స్వల్ప ఖర్చుతోనే నీటి భద్రత పొందవచ్చని ‘సాక్షి’ దినపత్రిక ద్వారా తెలుసుకొని.. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(984 956 6009)ని సంప్రదించి, ఆయన పర్యవేక్షణలో 2015లో కందకాలు తవ్వించారు. ఇండస్ట్రియల్‌ షెడ్‌పై నుంచి పడే వర్షపు నీరు మొత్తం అంతకు ముందు వృథాగా బయటకు వెళ్లిపోయేది.

ఆ నీటిని మొత్తాన్నీ భూమిలోకి ఇంకేలా చంద్రమౌళి దగ్గరుండి మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. కందకాలు నిండినా నీరు బయటకు పోకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఎంత వర్షం పడినా నీరంతా భూమిలోకి ఇంకుతూ ఉన్నది. ఫలితంగా నీటికి వెతుక్కోవాల్సిన పని లేకుండాపోయిందని కేశవరాజు ‘సాగుబడి’కి తెలిపారు.పరిశ్రమకు, డ్రిప్‌తో పెరుగుతున్న మామిడి తోటకు ఈ మూడేళ్లలో ఎటువంటి నీటి కొరతా రాలేదన్నారు. మామిడితోపాటు జామ, బత్తాయి మొక్కలు సైతం నాటామని, సేంద్రియ పద్ధతుల్లో జీవామృతం తదితరాలతోనే సాగు చేస్తున్నామన్నారు. కందకాలు తవ్వి చుక్క నీరు వృథాగా పోకుండా ఇంకింపజేయడం వల్ల నీటికి కొరత లేకుండా పనులు సాఫీగా జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఇంతవరకు చెప్పుకోదగ్గ వర్షం పడకపోయినప్పటికీ.. నీటి కొరత లేని కారణంగా.. రెండెకరాల్లో తెలంగాణ సోనా వరి సాగు చేస్తున్నామని కేశవరాజు (98489 90129) సంతోషంగా చెప్పారు. 

Tags