మాటలు మార్చిన మనిషి

5 Aug, 2018 23:46 IST

ఒక్క మాట కూడా మాట్లాడటంలేని ఒక వృద్ధుడి కథ ఇది. 
ఆయనో చిన్న పట్టణంలో ఏ వీధి చివరో ఉంటుంటాడు. ఆయన్ని గురించి వర్ణించడానికి, మరొకరితో విడదీసి చూపేంత ప్రత్యేకమైన విశేషణాలేం లేవు. 
ఆయన గది, పై అంతస్తులో ఉంది. ఆయనకు ఒకప్పుడు పెళ్లయి ఉండొచ్చు, పిల్లలు కూడా ఉండిండొచ్చు, వాళ్లు వేరే పట్టణంలో ఉంటుండవచ్చు. 
ఆయన గదిలో రెండు కుర్చీలు, ఒక టేబుల్, ఒక కంబళి, ఒక మంచం, ఒక బీరువా ఉన్నాయి. చిన్న టేబుల్‌ మీద అలారం గడియారం, దాని పక్కన పాత న్యూస్‌పేపర్లు, ఒక ఫొటో ఆల్బమ్‌ ఉన్నాయి. గోడకు వేలాడుతూ ఒక అద్దం, ఒక పటం.
ముసలాయన ఉదయం, మధ్యాహ్నం నడకకు వెళ్తాడు, దారిలో ఇరుగుపొరుగుతో పొడిగా మాట్లాడుతాడు, సాయంత్రం టేబుల్‌ దగ్గర కూర్చుంటాడు. ఈ దినచర్యలో ఏ మార్పూ ఉండదు. ఆదివారాలు కూడా మారదు. ఆయన టేబుల్‌ దగ్గర కూర్చున్నప్పుడు గడియారపు టిక్‌టిక్‌ శబ్దం వినబడుతుంది. గడియారం ఎల్లప్పుడూ టిక్‌టిక్‌మంటూనే ఉంటుంది.
ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది. చక్కటి పొద్దుపొడుపు, పక్షుల కిలకిలారావాలు,  స్నేహపూరిత మనుషులు, ఆడుకునే పిల్లలు– ఉన్నట్టుండి ముసలాయన వీటన్నింటినీ ఇష్టపడటం మొదలుపెడతాడు.
ఆయన నవ్వుతాడు. ఇక అంతా మారిపోతుందని తలపోస్తాడు. 
చొక్కా పై గుండీ తీసి, టోపీ చేత పట్టుకుని, వేగం పెంచి ఉత్సాహంగా నడుస్తూ సంతోషంగా కనబడతాడు. ఆయనుండే వీధిలోకి మళ్లి, పిల్లలకు అభివాదం చేసి, ఇంటి ముందుకొచ్చి, మెట్లు ఎక్కి, జేబులోంచి తాళంచెవి తీసి, గది తలుపు తెరుస్తాడు.
కానీ గదిలో ఏమీ మారలేదు. అదే టేబుల్, అవే రెండు కుర్చీలు, అదే మంచం, కూర్చుంటే అదే టిక్‌టిక్‌ ధ్వని. ఆయన సంతోషం ఆవిరైపోతుంది. ఏమీ మారలేదు.
ఆయనకు కోపం వస్తుంది. అద్దంలో చూసుకుంటాడు, ముఖం ఎర్రబారి ఉంటుంది. పిడికిలి బిగించి టేబుల్‌ మీద గుద్దుతాడు. ముందొకటే గుద్దు, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకా ఇంకా గుద్దుతూ అరుస్తాడు, ‘ఇది మారి తీరాలి, ఇది మారి తీరాలి’.
ఆ కాసేపు మాత్రం గడియారం టిక్‌ టిక్‌ శబ్దం వినిపించదు. 
చేయి నొప్పెట్టి, గొంతు పోయి ఆగినప్పుడు, మళ్లీ గడియారం శబ్దం వినిపిస్తుంది. ఏమీ మారలేదు.
‘ఎప్పుడూ అదే టేబుల్, అవే కుర్చీలు, అదే మంచం, అదే పటం. నేను టేబుల్‌ను టేబుల్‌ అనే అంటాను, మంచాన్ని మంచం అనే అంటాను, కుర్చీని కుర్చీ. ఇలాగే ఎందుకు? ఫ్రెంచ్‌వాళ్లు టేబుల్‌ను తబ్లే అంటారు, కుర్చీని షెజ్‌ అంటారు, అయినా ఒకరిది ఒకరికి అర్థమవుతుంది.
మంచాన్ని పటం అని ఎందుకు అనకూడదు?’ ఈ ఆలోచన రాగానే ముసలాయన చిన్నగా నవ్వుతాడు, తర్వాత బిగ్గరగా, ఇంకా పెద్దగా నవ్వుతూనే ఉన్నాడు, పక్కనున్నవాళ్లు తలుపు కొట్టి, ‘నిశ్శబ్దం’ అని చెప్పేదాకా.
‘ఇప్పుడు మారుతుంది, ఇప్పటినుంచీ మంచం, పటం అవుతుంది’ అని అరిచాడు.
‘నేను అలసిపోయాను, పటంలో పడుకోవాలి’ అనుకుంటాడు. ఉదయాలు ఆయన చాలాసేపు అలా పటంలో పడుకునివుండేవాడు. పేరు మార్చుకున్న కుర్చీలో ముఖం చూసుకునేవాడు. ఇక కుర్చీకి ఆయన గడియారం అని పేరుపెట్టాడు.
అతడు మంచంలోంచి లేచి, బట్టలు వేసుకుని, గడియారం మీద కూర్చుని, చేతుల్ని టేబుల్‌ మీద ఆన్చుతాడు. కానీ టేబుల్‌ను ఇప్పుడాయన టేబుల్‌ అనడం లేదు, కంబళి అంటున్నాడు.
అంటే, ఉదయాన్నే అతడు పటంమీంచి లేచి, బట్టలు వేసుకుని, కంబళి దగ్గర గడియారం మీద కూర్చుని, మార్చాల్సిన పేర్ల గురించి ఆలోచిస్తాడు.
అద్దానికి ఆయన కుర్చీ అని పెట్టాడు.
వార్తాపత్రికను ఆయన మంచం అన్నాడు.
గడియారాన్ని ఫొటో ఆల్బమ్‌ అంటున్నాడు.
బీరువాను వార్తాపత్రిక అంటున్నాడు. 
కంబళిని బీరువా అంటున్నాడు. 
పటాన్ని టేబుల్‌ అంటున్నాడు. 
ఫొటో ఆల్బమ్‌ను అద్దం అంటున్నాడు.
అంటే:
ఉదయం కాగానే ముసలాయన చాలాసేపు పటంలో పడుకునివుంటాడు, తొమ్మిదింటికి ఫొటో ఆల్బమ్‌ మోగుతుంది, ఈయన లేచి కాళ్లకు చలేయకుండా బీరువా మీద కాళ్లు ఆన్చుతాడు, తర్వాత వార్తాపత్రికలోంచి బట్టలు తీసి వేసుకుంటాడు, గోడ మీద ఉన్న కుర్చీలో ముఖాన్ని చూసుకుంటాడు, కంబళి దగ్గర గడియారం మీద కూర్చుని అద్దాన్ని తిరగేస్తూ వాళ్లమ్మ టేబుల్‌ దగ్గర ఆగుతాడు.
ముసలాయనకు ఇది సరదా అనిపించింది. ఈ మాటల్ని రోజంతా కంఠస్థం చేస్తాడు. ప్రతిదీ పేరు మార్చుకుంది. ఇంక ఆయన మనిషి కాదు, కాలు. కాలు అంటే ఉదయం. ఉదయం అంటే మనిషి.
ఇంక ఈ కథను మీకు మీరే రాసుకోవచ్చు. ముసలాయన లాగే మీరు కూడా పదాల్ని మార్చుకోవచ్చు.
మోగడం అంటే ఎక్కడం. 
చలేయడం అంటే చూడటం. 
పడుకోవడం అంటే మోగడం. 
నిల్చోవడం అంటే చలేయడం. 
ఎక్కడం అంటే తిరగేయడం.
అప్పుడు కథ ఇలా సాగుతుంది: 
మనిషి అయినా, ముసలి కాలు పటంలో చాలాసేపు మోగుతాడు. తొమ్మిదింటికి ఫొటో ఆల్బమ్‌ ఎక్కుతుంది. కాలు చల్లబడి, ఉదయం చూడకుండా ఉండటానికి బీరువాను తిరగేస్తాడు.
ముసలాయన తనకోసం కొన్ని నీలిరంగు స్కూలు నోటు పుస్తకాలు కొని, ఈ కొత్త పదాలన్నింటినీ రాస్తూపోయాడు. ఇదింక ఆయనకు తీరికనేది లేకుండా చేసింది. ఇప్పుడాయన వీధుల్లో ఎప్పుడోగానీ కనబడటం లేదు.
ఆయన ప్రతి కొత్త పదాన్ని కంఠస్తం చేస్తూ పోయాడు. ఈ కొత్త పదాలు నేర్చుకున్నకొద్దీ అసలు మాటలు మర్చిపోవడం మొదలైంది. దాంతో ఆయన ఒక్కడికే చెందిన ఒక ప్రత్యేకమైన భాష రూపొందింది.
కొన్నిసార్లు ఆయన ఈ కొత్త భాషలోనే తన కలలు కనేవాడు, తను విద్యార్థిగా చదువుకున్న ∙పాటలను ఈ కొత్తభాషలోకి అనువదించేవాడు, వాటిని తనకోసం తాను నెమ్మదిగా పాడుకునేవాడు.
కానీ త్వరలోనే ఈ అనువదించడం కూడా కష్టమైపోయింది. తన పాత భాషను దాదాపుగా మర్చిపోయాడు. ఒక్కోసారి సరైన మాట కోసం తన పాత నీలిరంగు నోటు పుస్తకాల్లో వెతకాల్సి వచ్చేది. ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినా ఇబ్బంది పడేవాడు. వాళ్ల మాటల్ని పోల్చుకోవడానికి చాలాసేపు ఆలోచించాల్సి వచ్చేది.
ఆయన పటాన్ని జనం మంచం అంటున్నారు.
ఆయన కంబళిని జనం టేబుల్‌ అంటున్నారు.
ఆయన అలారం గడియారాన్ని జనం కుర్చీ అంటున్నారు. 
ఆయన మంచాన్ని జనం వార్తాపత్రిక అంటున్నారు.
ఆయన కుర్చీని జనం అద్దం అంటున్నారు.
ఆయన ఫొటో ఆల్బమ్‌ను జనం అలారం గడియారం అంటున్నారు.
ఆయన వార్తాపత్రికను జనం బీరువా అంటున్నారు.
ఆయన బీరువాను జనం కంబళి అంటున్నారు.
ఆయన టేబుల్‌ను జనం పటం అంటున్నారు.
ఆయన అద్దాన్ని జనం ఫొటో ఆల్బమ్‌ అంటున్నారు.
దీంతో ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే, జనం మాట్లాడేది వింటే ఆయనకు నవ్వు రావడం మొదలైంది. ఎవరైనా, ‘నువ్వూ రేపు ఫుట్‌బాల్‌ చూడటానికి వస్తున్నావా?’ అంటే నవ్వొచ్చేది. ‘రెండు నెలలుగా వానలు పడుతూనే ఉన్నాయి’ అన్నా, ‘అమెరికాలో మా అంకుల్‌ ఉన్నాడు’    అన్నా ఆయనకు నవ్వాగేది కాదు.
వాళ్లు మాట్లాడేది ఏదీ అర్థం కాక ఆయనకు నవ్వు వచ్చేది.
కానీ ఇది సరదా కథ కాదు.
ఇది విషాదంగా మొదలై విషాదంగానే ముగుస్తుంది.
జనం మాట్లాడేది ముసలాయనకు ఏమీ అర్థమయ్యేది కాదు. ఇందులో అంత బాధపడవలసింది ఏమీలేదు, కానీ ఈయన మాట్లాడేది కూడా జనానికి అర్థమయ్యేది కాదు.
దాంతో ఆయన ఏమీ మాట్లాడేవాడు కాదు.
అతడు మౌని అయిపోయాడు,
తనతో తానే మాట్లాడుకుంటూ. 

పెద్దవాళ్లను ఉద్దేశించినట్టుగా కనబడే పిల్లల కథలు రాయడం పీటర్‌ బిక్సెల్‌ ప్రత్యేకత. ఈయన 1935లో స్విట్జర్లాండ్‌లో జన్మించారు. ఉపాధ్యాయుడిగానూ, పాత్రికేయుడిగానూ పనిచేశారు. ఆధునిక జర్మన్‌ సాహిత్యానికి ప్రతినిధి. పైది, ఆయన 1969లో రాసిన ‘ఎ టేబుల్‌ ఈజ్‌ ఎ టేబుల్‌’ కథాసారం.


పీటర్‌ బిక్సెల్‌

Tags