‘సివిల్స్‌’కు వయో పరిమితి 32 ఏళ్లు

3 Aug, 2018 20:53 IST

న్యూఢిల్లీ : యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు వయోపరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం మేరకు ఆగస్టు 1, 2018నాటికి జనరల్‌ అభ్యర్థులు 32ఏళ్లకు మించని వారు అయి ఉండాలి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ వివరాలను రాజ్యసభలో తెలిపారు. సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చిన జితేంద్ర సింగ్‌.. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని.. అభ్యర్థులు సరైన సమాచారం ఇవ్వని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని పేర్కొన్నారు. దీంతో వయోపరిమితిపై అభ్యర్థుల అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లే.

డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ పర్సనల్, ట్రైనింగ్ ‌(డీఓపీ అండ్‌ టీ) తెలిపిన మార్గదర్శకాల ప్రకారం వయో పరిమితిని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ప్రతి ఏడాది యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ సర్వీస్‌లో అభ్యర్థుల ఎంపిక మొత్తం మూడు దశలల్లో జరుగుతుందన్న విషయం విదితమే. మొదట ప్రిలిమినరీ పరీక్ష, ఇందులో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్‌ నిర్వహిస్తారు. మెయిన్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తారు. 

సివిల్‌ సర్వీసెస్‌ రాసేందుకు అర్హతలు..

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి.
  • అభ్యర్థి భారత పౌరుడు/పౌరురాలై ఉండాలి
  • నేపాల్‌, భూటాన్‌, టిబెట్‌ నుంచి వచ్చిన శరణార్థులు, భారతీయ సంతతి ఇమిగ్రేట్లు, తమ అర్హతపత్రం చూపించి సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి.

పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు

  • జనరల్‌ అభ్యర్థులు- 4 సార్లు
  • ఓబీసీ అభ్యర్థులు- 7సార్లు
  • వికలాంగులు (జనరల్‌)- 7 సార్లు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు.
Tags