కపుల్‌ బ్రాండ్‌!

31 Jul, 2018 00:08 IST

మనకిష్టమైన స్టార్‌ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటాం! ముఖ్యంగా వాళ్ల పర్సనల్‌ లైఫ్‌ గురించి. ఎవరితో ప్రేమలో ఉన్నారు? పెళ్లెప్పుడు? ఇలాంటివి. అలాగే మనకిష్టమైన స్టార్‌ మరొక స్టార్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలిస్తే, ఇంక వాళ్ల నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్‌ పండగే! గతేడాది స్టార్‌ కపుల్స్‌ విరాట్‌ కోహ్లి, అనుష్కశర్మ ప్రేమలో ఉన్నామని ప్రకటించుకున్నప్పట్నుంచీ ఆ కపుల్‌ కలిసి కనిపిస్తే, అలా కనిపించడమే ఒక బ్రాండ్‌. ఆ బ్రాండ్‌ను వాడుకునేందుకు పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు కూడా క్యూ కట్టడం మొదలుపెట్టాయి.

అలా వారు ప్రేమలో ఉన్నప్పట్నుంచీ, ఇప్పుడు పెళ్లయ్యాక కూడా ఈ కపుల్స్‌తో చాలా అడ్వర్టయిజ్‌మెంట్స్‌ పుట్టుకొస్తున్నాయి. అనుష్క, విరాట్‌ ఇంకా పెళ్లి చేసుకోక ముందే వచ్చిన ‘మాన్యవర్‌’ వెడ్డింగ్‌ వేర్‌ ప్రకటనైతే వాళ్లు పెళ్లి చేసుకుంటే ఇలా, ఇంత అందంగా ఉంటుందా అన్నట్టు అభిమానులకు కలర్‌ఫుల్‌గా కనిపించింది. తెలుగులో కూడా ‘కపుల్‌ బ్రాండ్‌’కు ఇప్పుడు పాపులారిటీ బాగా పెరిగింది. నాగచైతన్య, సమంతలకు ఇప్పుడు హాట్‌ కపుల్‌ అన్న పేరున్న విషయం తెలిసిందే. వీళ్లిందరి బ్రాండ్‌నూ వాడుకునేందుకు వరుసగా యాడ్స్‌ వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు రెక్సోనా సోప్‌ యాడ్‌తో ఈ కపుల్‌ బ్రాండ్, ఆ సోప్‌ బ్రాండ్‌కి ఒక కొత్త అందాన్ని తీసుకొస్తూ టీవీల్లో మెరిసిపోతోంది!!


 

Tags