బ్యాచ్‌లర్స్‌కు వ్యక్తిగత రుణాలు..!

28 Jul, 2018 01:04 IST

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యాచ్‌లర్స్, విద్యార్థులను టార్గెట్‌గా చేసే ఏ వ్యాపారమైనా సరే హిట్‌ అవుతుంది. కారణం.. ఈ సెగ్మెంట్‌లో జనాభా ఎక్కువగా ఉండటమే! ఇదే లక్ష్యంతో ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ క్యుబెరా ముందుకు సాగింది. పెద్ద మొత్తంలో కాకుండా రూ.15 వేల నుంచి రూ.75 వేలను పర్సనల్‌ లోన్స్‌గా అందించాలని నిర్ణయించింది. ఆర్‌బీఎల్, కొటక్, ఇండస్‌ ఇండ్‌ వంటి బ్యాంక్‌లతో ఒప్పందం కూడా చేసేసుకుంది. మరిన్ని వివరాలు క్యుబెరా ఫౌండర్‌ అండ్‌ సీఈఓ ఆదిత్య కుమార్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. మా స్వస్థలం ఉత్తర్‌ ప్రదేశ్‌. నాన్న బిజినెస్‌ కావటంతో జర్మనీలోనే 18 ఏళ్లు ఉన్నాం. లండన్‌లో ఏడేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌లో పనిచేశా. ఆ తర్వాత ఇండియాకొచ్చి ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్తాన్‌లోని ఫైస్టార్‌ హోటల్స్‌  క్లార్క్స్‌ గ్రూప్స్‌లో చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేశా. 2016 జనవరిలో రూ.1.5 కోట్ల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా క్యుబెరాను ప్రారంభించా. పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు, ఎక్కువ వేతనం ఉన్నవాళ్లకు, సిబిల్‌ స్కోర్‌ బాగున్నవాళ్లకు మాత్రమే బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) రుణాలు అందిస్తాయి. మరి, సిబిల్‌ స్కోర్‌ లేనివాళ్లకు, వేతనం తక్కువున్న వాళ్ల పరిస్థితి ఏంటి? వీళ్లకు రుణం తిరిగి చెల్లించే స్థోమత ఉంటుంది కానీ, లోన్లే అందవు. వీళ్లను లక్ష్యంగా చేసుకొనే క్యుబెరాను ప్రారంభించాం. 

హైదరాబాద్‌లో రూ.10 కోట్లు.. 
ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే అహ్మదాబాద్, జైపూర్‌ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఉద్యోగులు, నిరుద్యోగులు రెండు కేటగిరీలకూ వ్యక్తిగత రుణాలు అందిస్తాం. రుణ పరిమితి రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు. రుణ గ్రహీత కేవైసీ, అడ్రస్‌ ప్రూఫ్, పాన్, బ్యాంక్‌ చెక్స్, అకౌంట్‌ వివరాలను సమర్పించాలి. దరఖాస్తును పూర్తి చేసిన 24 గంటల్లో రుణం అందిస్తాం. ఆర్‌బీఎల్, ఇండిస్‌ ఇండ్, కొటక్‌ బ్యాంక్‌లతో పాటూ ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌బీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటివరకు 2 లక్షల రుణ దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో 2,500 మందికి రూ.50 కోట్ల వ్యక్తిగత రుణాలు అందించాం. ఇందులో రూ.10 కోట్లు హైదరాబాద్‌లోనే అందించాం. 

ఏటా వడ్డీ రేటు 10.99 శాతం.. 
మా కస్టమర్లలో 23 శాతం వాటా బ్యాచ్‌లర్స్‌ ఉంటారు. వచ్చే 6 నెలల్లో మరో 4 బ్యాంక్‌లు, 3 ఎన్‌బీఎఫ్‌సీలతో ఒప్పందం చేసుకోనున్నాం. రుణ చెల్లింపు కాల పరిమితి మూడేళ్లు. ఏటా 10.99 శాతం నుంచి 28 శాతం వడ్డీ రేటు ఉంటుంది. గతేడాది కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.6 కోట్ల రెవెన్యూ లక్ష్యించాం. ఎన్‌పీఏ 1 శాతంగా ఉంది. వచ్చే ఏడాది నాటికి రూ.100 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యించాం.

ముంబై ఇన్వెస్టర్‌ నుంచి రూ.20 కోట్ల నిధులు 
ఈ ఏడాది ముగింపు నాటికి కోయంబత్తూరు, ఇండోర్, భూపాల్, చండీగఢ్, కోల్‌కతా, లక్నో ప్రాంతాలకు విస్తరించనున్నాం. ఆ తర్వాతే విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు చేరుకుంటాం. ప్రస్తుతం మా సంస్థలో 80 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది పూర్తి ఈ సంఖ్యను 150కి చేర్చుతాం. ప్రస్తుతం ముంబైకు చెందిన ఇన్వెస్టర్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు పూర్తి కావచ్చాయి. 2 నెలల్లో రూ.20 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ అని ఆదిత్య వివరించారు.  

Tags