‘విద్యాహక్కు’కు గండి

24 Jul, 2018 02:06 IST

విద్యారంగానికి అవసరమైన నిధులిచ్చి దాని ఎదుగుదలకు దోహదపడటం చేతగాని ప్రభుత్వాలు ప్రమాణాలు పడిపోవడానికి విద్యార్థుల్ని బాధ్యుల్ని చేయడంలో మాత్రం ఉత్సాహం చూపుతు న్నాయి. లోక్‌సభ గతవారం ఆమోదించిన విద్యా హక్కు చట్టం (రెండో సవరణ) బిల్లు గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. ఈ సవరణ ప్రకారం పిల్లలు ఇకపై ప్రతి తరగతిలోనూ నిర్దేశించిన మార్కులు పొందితేనే వారిని పై తరగతులకు పంపుతారు. ఫెయిలైన విద్యార్థులకు ఫలితాలు వెలువడిన రెండు నెలల్లో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ ఉత్తీర్ణులు కాలేని విద్యా ర్థులను ఆ తరగతిలోనే ఉంచేస్తారు.

ఒకపక్క బడి ఈడు పిల్లలందరికీ నిర్బంధ, ఉచిత విద్య అంది స్తామని ఎనిమిదేళ్ల క్రితం విద్యాహక్కు చట్టం అమల్లోకి తెచ్చారు. విద్యార్థులు ఎలా చదివినా వారిని ఎనిమిదో తరగతి వరకూ ఫెయిల్‌ చేయకూడదని ఈ చట్టం చెబుతోంది. 14 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరి విద్య అమలు కావాలన్నదే ఈ నిబంధన ముఖ్యోద్దేశం. ఇది కేవలం మన దేశంలో మాత్రమే అమలవుతున్న విధానం కాదు. బ్రిటన్‌లాంటి అభివృద్ధి చెందిన దేశం కూడా దీన్నే అనుసరిస్తోంది. అయితే అక్కడ చదువులో మెరుగ్గా లేని విద్యార్థుల్ని గుర్తించి, అందుకు గల కార ణాలను ఆరా తీసి వారిని మెరుగుపరుస్తారు. మన పాలకులకు అలాంటి అంశాలు పట్టవు. ఫెయి లయ్యే పిల్లల్ని చదువుకు దూరం చేయటమే సమస్యకు పరిష్కారమనుకుంటున్నారు.

విద్యాహక్కు చట్టం అమలు ఒక పెద్ద ప్రహసనం. ఇప్పటికీ ప్రాథమిక విద్యా రంగ సంస్థలు సౌకర్యాల లేమితో అల్లాడుతున్నాయి. మొండి గోడలు, చెట్లకింది చదువులు, పిల్లలకు సకాలంలో పుస్తకాలు అందించలేకపోవటం, అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయుల్ని నియమించలేకపోవటం ఇంకా కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉన్నాయి. వీటి సంగతలా ఉంచి బాలబాలికలకు కనీసం మరు గుదొడ్డు నిర్మించాలని, వారికి మంచినీటి సదుపాయం కల్పించాలని కూడా ప్రభుత్వాలకు తోచటం లేదు. దేశంలో పట్టుమని 10 శాతం పాఠశాలలు కూడా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా లేవు.  

తమ దగ్గర ఇన్ని లోపాలు పెట్టుకుని పిల్లలు మాత్రం మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సిందేనను కోవటం దుర్మార్గం. నిజానికి ఆరేళ్లక్రితం యూపీఏ సర్కారు హయాంలోనే ఈ సవరణ బిల్లుకు బీజాలు పడ్డాయి. చాలామంది విద్యార్థులు తొమ్మిదో తరగతిలో ఫెయిలవుతున్న తీరు గమనించి 2012లో కేంద్ర విద్యా విషయాల సలహా బోర్డు(సీఏబీఈ) అప్పటి హర్యానా విద్యామంత్రి గీతా భుక్కాల్‌ నేతృత్వంలో ఒక సబ్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ కొండను తవ్వి ఎలుకను పట్టి నట్టు  ఎనిమిదో తరగతి వరకూ అమల్లో ఉండే ‘నో డిటెన్షన్‌’ విధానం వల్లే ఈ సమస్యంతా వచ్చిం దంటూ నివేదిక ఇచ్చింది.

ఆ నివేదికను సీఏబీఈ ఏకగ్రీవంగా ఆమోదించింది. చివరకు ‘నో డిటె న్షన్‌’కు వీలు కల్పిస్తున్న విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 16ను సవరించాలని నిరుడు ఆగస్టులో కేంద్ర కేబినెట్‌ తీర్మానించింది. 24 రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నాయని, కేవలం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఇప్పుడున్న విధానం కొనసాగాలంటున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవ్డేకర్‌ ఇటీవల చెప్పారు. రెండింటిలో ఏదో ఒక విధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు విడిచిపెట్టామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమ లవుతుందని కూడా ఆయన చెబుతున్నారు. 

ఫెయిలవుతామన్న భయం లేకపోవటం వల్ల విద్యార్థుల్లో అలసత్వం ఏర్పడుతున్నదని, బాగా చదివే పిల్లలూ, చదవని పిల్లలూ కూడా పైతరగతులకు వస్తుండటం వల్ల ఉపాధ్యాయులకు బోధన కష్టమవుతున్నదని ‘నో డిటెన్షన్‌’ నిబంధన రద్దును సమర్థించేవారి వాదన. చదువులో వెనకబడిన వారి కోసం బోధించాలో, చురుగ్గా అందుకోగలిగినవారికోసం బోధించాలో తెలియని స్థితి ఏర్పడుతు న్నదని ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదు వస్తున్నదట. తగినంతమంది ఉపాధ్యాయులను నియమించి చదువులో వెనకబడినవారి మెరుగుదలకు శ్రద్ధ పెడితే ఈ సమస్యను అవలీలగా అధిగమించవచ్చు.

తరగతి గదిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులుంటే ఎవరు మందకొడిగా ఉంటున్నారో, ఎవరు సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నారో ఉపాధ్యాయులకు అంచనా ఉంటుంది. సమస్యను సరిదిద్దేందుకు వారికి వీలుంటుంది. అనవసర ఆర్భాటాల కోసం, హంగామా కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తున్న ప్రభుత్వాలకు ఉపాధ్యాయులను నియమించటం వృథా ఖర్చుగా అనిపిస్తోంది. ఏళ్ల తరబడి వేలాది టీచర్‌ పోస్టులు ఖాళీగా పడి ఉంటున్నా, చదువు చెప్పేవారు లేక విద్యార్థులు సమస్య ఎదుర్కొంటున్నా పట్టనట్టుండే పాలకులు ఎన్నికలొచ్చేముందు టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించటం రివాజుగా మారింది. ఇలా సమస్య మూలాలు తమ దగ్గర పెట్టు కుని, నెపం విద్యార్థులపైకి నెట్టి వారిని మరింత అధోగతిపాలు చేయటం క్షమించరాని నేరం.

విద్యాహక్కు చట్టం తీసుకొచ్చిన ఉద్దేశాన్ని ప్రభుత్వాలు మరిచాయి. 2016–17 ఎకనామిక్‌ సర్వే లోని గణాంకాలు గమనిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలుస్తుంది. 2013–14లో మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి 4.57 శాతం కేటాయించిన కేంద్రం 2017–18కి వచ్చేసరికి దాన్ని 3.71 శాతానికి దిగజార్చింది. రాష్ట్రాల తీరుతెన్నులూ ఇలాగే ఉంటు న్నాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 2 లక్షల పాఠశాలలు మూతబడ్డాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో పలు పాఠ శాలలు విలీనం పేరుతో మూతబడ్డాయి. వీటిల్లో చాలాభాగం ఆదివాసీ ప్రాంతాల్లోనివి. బడిఈడు పిల్లలు తప్పనిసరిగా తరగతి గదిలో ఉండాలన్న సంకల్పానికి ఇలాంటి చర్యలు గండికొడుతున్నాయి. అట్టడుగు వర్గాల పిల్లలకు తీరని అన్యాయం చేసే విద్యాహక్కు చట్టం సవరణ బిల్లు కనీసం రాజ్య సభలో ప్రవేశించినప్పుడైనా అర్ధవంతమైన చర్చ జరిగి ప్రతిపాదన వీగుతుందని ఆశించాలి.

Tags