వర్చువల్‌ ఐడీని కూడా ఆధార్‌గానే పరిగణించవచ్చు 

19 Jul, 2018 01:16 IST

న్యూఢిల్లీ:  వర్చువల్‌ ఐడీ, యూఐడీ టోకెన్లు కూడా ఆధార్‌ నంబరుకు సమానమైన ప్రత్యామ్నాయాలేనని, ధృవీకరణకు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రైవసీని పరిరక్షించే ఉద్దేశంతోనే ఈ రెండంచెల వ్యవస్థను టెలికం సంస్థలు వంటి ఆథెంటికేషన్‌ ఏజెన్సీల కోసం ప్రవేశపెట్టినట్లు వివరించింది. మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు వంటివి తీసుకునేటప్పుడు గుర్తింపు ధృవీకరణ కోసం 12 అంకెల బయోమెట్రిక్‌ ఐడీని ఇవ్వాల్సిన పని లేకుండా వర్చువల్‌ ఐడీ సదుపాయాన్ని యూఐడీఏఐ జూలై 1న అందుబాటులోకి తెచ్చింది.

16 అంకెల ఈ తాత్కాలిక ఐడీని యూఐడీఏఐ వెబ్‌సైట్‌ నుంచి జనరేట్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ డేటా దుర్వినియోగం అవుతున్న ఉదంతాల నేపథ్యంలో యూఐడీఏఐ ఈ వర్చువల్‌ ఐడీ, యూఐడీ టోకెన్లను ప్రవేశపెట్టింది. గుర్తింపు ధృవీకరణకు ఆధార్‌కి ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించేలా తగు మార్పులు చేసుకోవాలని టెల్కోలు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు, సాధారణ బీమా సంస్థలు మొదలైన స్థానిక ఆథెంటికేషన్‌ యూజర్‌ ఏజెన్సీలకు సూచించింది. దానికి సంబంధించే తాజా వివరణనిచ్చింది.    

Tags