వీడియో ఆపద్బాంధవి

13 Jul, 2018 00:01 IST

కెమెరాకు షూట్‌ చేసే శక్తి మాత్రమే ఉంటుంది.స్పందించే హృదయాలు మనుషులకే ఉంటాయి.ఈ మనుషుల్లో తడి మిగిలే ఉంది.ఆర్ద్రత మిగిలే ఉంది. మానవత్వం మిగిలే ఉంది. కావలసిందల్లా కదిలించే కన్ను.కేరళ అమ్మాయి జిన్షా బషీర్‌ కెమెరాతో లోకంలో ఉన్న కష్టాన్ని చెబుతుంది.వెంటనే దానికి లభిస్తున్న స్పందన  ఆమెను ఆపద్బాంధవిగా మారుస్తోంది.

కేరళలోని అలెప్పీకి చాలామంది బ్యాక్‌వాటర్స్‌లో హౌస్‌బోట్‌ విహారం కోసం వెళతారు.కానీ ఇప్పుడు ‘జిన్షా బషీర్‌’ను చూడటానికి వెళుతున్నారు.శిరస్సు మీద ఇస్లామీయ వస్త్రాన్ని చుట్టుకొని, జీన్స్‌ ప్యాంట్‌ ధరించి, క్లాసిక్‌ మోడల్‌ బుల్లెట్‌ను బటన్‌ స్టార్ట్‌ చేసి రివ్వున దూసుకుపోతూ కనిపించే జిన్షా బషీర్‌ను చూడటం, ఆమెకు కరచాలనం ఇవ్వడం చాలా తృప్తినిచ్చే పని. ఒక మంచి పనికి మద్దతు ఇచ్చే పని.ఎందుకంటే ఇవాళ కేరళలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వలే జిన్షా కూడా స్టార్‌.ఆ స్టార్‌డమ్‌ ఆమెకు సినిమాల నుంచి రాలేదు.కేవలం ఫేస్‌బుక్‌ నుంచి వచ్చింది.అందులో ఆమె పెట్టే వీడియోల ద్వారా వచ్చింది. ఆ వీడియోల నుంచి ఆశించే మంచి ద్వారా వచ్చింది.పెట్రోల్‌బంక్‌ మోసాన్ని చూసిదాదాపు సంవత్సరం క్రితం. జిన్షా ఆ సమయంలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఒక సగటు ఉద్యోగిగా పని చేస్తోందిదారిన పోతూ తన టూ వీలర్‌లో పెట్రోల్‌ పోయించుకోవడం కోసం ఆగింది. అందరూ పెట్రోలు పోయించుకుని పోతున్నారు. తన వంతు వచ్చింది. అయితే పెట్రోల్‌ పోసే వ్యక్తి మీటర్‌ను ట్యాంపర్‌ చేసి పెట్రోల్‌ పోస్తున్నట్టు జిన్షా గమనించింది.ఏమిటి నువ్వు చేస్తున్న పని’ అంది.ఇదిక్కడ రోజూ మామూలే. నోరు మూసుకొని పోయించుకుని పో’ అన్నాడా వ్యక్తి.

అందరిలా జిన్షా కూడా నోరు మూసుకొని పెట్రోలు పోయించుకుని పోయి ఉంటే ఇవాళ ఆమె గురించి రాయడానికి ఉండేది కాదు. కానీ జిన్షా ఊరుకోలేదు. టూ వీలర్‌ దిగి తన సెల్‌ఫోన్‌ ద్వారా అప్పటికప్పుడు జరుగుతున్నది రికార్డ్‌ చేసింది. అక్కడ పెట్రోల్‌ పోయించుకుంటున్న వాళ్లతో మాట్లాడి ‘మీరెందుకు ఈ అన్యాయాన్ని నిలదీయరు’ అని ఇంటర్వ్యూ చేసింది. అదంతా తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టింది. వెంటనే ఐదు వేల లైకులు వచ్చాయి.జిన్షా చాలా ఆశ్చర్యపోయింది. అన్యాయాలు అందరికీ తెలుసు. కానీ వాటిని నలుగురి దృష్టికి తెచ్చి ప్రశ్నించేవారే కావాలి అని అర్థం చేసుకుంది. సోషల్‌ మీడియాలో బ్లాగర్స్‌ చాలామందే ఉన్నారు. కానీ వీడియోల ద్వారా సమాజానికి సందేశాలిచ్చే ‘వ్లోగర్స్‌’ కూడా ఉన్నారని తెలుసుకుని తాను కూడా ‘వ్లోగర్‌’గా మారాలని నిశ్చయించుకుంది.ఉద్యోగాన్ని వదిలి సమాజ హితం కోరే వీడియోలను పోస్ట్‌ చేయడం మొదలుపెట్టింది.

సహాయాల పరంపర
జిన్షాకు ఒక వ్యక్తి గురించి తెలిసింది. అతని పేరు షాన్‌ షాహుల్‌. పేదవాడు. ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు. వెళ్లిన ఇరవై అయిదు రోజులకే దురదృష్టవశాత్తు మరణించాడు. జిన్షా వెంటనే అతడి కుటుంబాన్ని కలిసింది. అది ఎంత పేదరికంలో ఉందో షూట్‌ చేసి తన వ్యాఖ్యానంతో ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేసింది. ‘ఇంటి పెద్ద లేకుండాపోయే దురదృష్టం ఎవరికీ వద్దు. ఈ కుటుంబానికి మనమంతా ఉన్నాం అనే ధైర్యం చెబుదాం’ అని పిలుపు ఇచ్చింది. దీనికి వెంటనే సౌదీలోని ఒక స్వచ్ఛంద సంస్థ స్పందించింది. షాన్‌ షాహుల్‌ కుటుంబానికి 11 లక్షల రూపాయల సహాయాన్ని అందించింది. ఇది కేవలం జిన్షా వీడియో వల్లే సాధ్యమైంది. జిన్షా ఫేస్‌బుక్‌ పేజీకి లైకులు పెరుగుతున్నాయి. ఫాలోవర్స్‌ పెరుగుతున్నారు. అటువంటి సమయంలోనే ఆయేషా అనే ఒక సంవత్సరం పాప గురించి జిన్షా ఒక వీడియో పెట్టింది. ‘ఈ పాపను చూశారా? బంగారు భవిష్యత్తును చూడాల్సిన ఈ పాప బోన్‌ మేరోతో చావు బతుకుల మధ్య ఉంది. ఈమె పెదాల మీద చిరునవ్వును పూయించే శక్తి మీ సహాయానికి ఉంది. ఈమెను బతికించే శక్తి మీకే ఉంది’ అని అప్పీల్‌ చేసింది. ఆశ్చర్యం... ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల రూపాయలు ఆ పాప సహాయానికి అందాయి.

వ్యతిరేకత మొదలు
ఏ పనికైనా వ్యతిరేకత ఉంటుంది. జిన్షాకు కూడా వ్యతిరేకత మొదలైంది. ఆమె ఉద్దేశాలను తప్పు పట్టేవారు మెల్లగా గొంతు విప్పడం మొదలుపెట్టారు. ‘ఇది సంఘసేవ కాదు గాడిద గుడ్డూ కాదు. పేరు కోసమే ఆమె ఇలా చేస్తోంది’ అనే విమర్శలు వచ్చాయి. ‘ఇస్లాంలో పుట్టిన ఆడపిల్ల ఇలా రోడ్డున పడి తిరగడం బుల్లెట్‌ నడపడం ఏమిటి?’ అని సొంత బంధువులు కూడా నొసలు చిట్లించారు. ఇవన్నీ చీప్‌ట్రిక్స్‌ అని మరికొందరు కొట్టిపారేశారు. ఫేస్‌బుక్‌ పేజీలో బూతులు రాసి ఆమెను హేళన చేసినవారు కూడా ఉన్నారు. ఇదంతా చూసి జిన్షా తల్లి, సోదరి హడలిపోయారు. మనకెందుకు ఈ గోలంతా... ఇదంతా మానేయ్‌ అని ఆమెకు హితవు చెప్పారు. అయితే ఆమె తండ్రి, భర్త తోడు నిలిచారు. గతంలో మిలట్రీలో పని చేసిన జిన్షా తండ్రి ‘మరేం పర్లేదమ్మా... నీకు ఏది అనిపిస్తే అది చెయ్‌’ అని ధైర్యం చెప్పాడు. ‘నువ్వు ఏ దారిలో నడిచినా నా మద్దతు నీకే’ అని భర్త హామీ ఇచ్చాడు. ఇక జిన్షాకు లోకానికి వెరవాల్సిన అవసరం లేకపోయింది. తనను తిట్టే వాళ్ల కామెంట్స్‌ను స్క్రీన్‌ షాట్స్‌ తీసి తిరిగి ఫేస్‌బుక్‌లో పెట్టింది జిన్షా. చాలామంది వాటిని అసహ్యించుకున్నారు. మరోవైపు క్షణక్షణానికి ఆమె ఫేస్‌బుక్‌ పేజీ మీద లైక్‌ బటన్‌ నొక్కేవాళ్లు పెరిగారు. జిన్షా బుల్లెట్‌ మరింత స్పీడందుకుంది.

పెళ్లి చేసిన పుణ్యం
వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ జిన్షా ఒక వీడియో పెట్టి చాలా సులువుగా ఒక పెళ్లి చేయగలిగింది. మునీర్‌ అనే ఒక నిరుపేద ఆమె దృష్టిలో పడ్డాడు. అతనికి సొంత ఇల్లు లేదు. ఉపాధి లేదు. పెళ్లికెదిగిన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లకు అతను జన్మలో పెళ్లి చేయలేడు. జిన్షా అతని పరిస్థితిపై వీడియో చేసి పోస్ట్‌ చేసింది. స్పందన చెప్పాలా? ఒక అమ్మాయి పెళ్లి క్షణాల్లో జరిగిపోయింది. ఇంకో అమ్మాయి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అంతేకాదు దాతలు స్పందించి ఒక నాలుగు లక్షలు సహాయం చేశారు. మునీర్‌కు 
ఇప్పుడొక సొంత గూడు ఉంది. 

వాక్కే ఆకర్షణ
జిన్షాకు వాక్కే ఆకర్షణ. అనర్గళంగా మాట్లాడుతుంది. ఎదుటివారిని ఒప్పించే విధంగా విషయాన్ని విశదీకరిస్తుంది. ఆమె చేసిన తెలివైన పని ఏమిటిరా అంటే మతాన్ని, రాజకీయాలను దూరంగా పెట్టడం. ‘వాటి గురించి నా వీడియోలు ఉండవు’ అంటుందామె. జిన్షా చేసే ముఖ్యమైన పని తన పేజీలో ఉపాధి అవకాశాల ప్రకటనలు విరివిగా పోస్ట్‌ చేయడం. గల్ఫ్‌ దేశాలలో ఉన్న ఉపాధి అవకాశాలను ఆమె నలుగురి దృష్టిలోకి తెస్తుంది కనుక ఆ విషయంగా కూడా ఆమె పేజీని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య మూడున్నర లక్షలు. ఈ పాపులారిటీ చూసి సంస్థలే ఆమెకు తమ వద్ద ఉన్న ఉపాధి అవకాశాల ప్రకటనలు పంపిస్తుంటాయి. ఇవే కాదు జిన్షా తన పేజీలో ఆకర్షణీయమైన టూర్‌ ప్యాకేజీలను కూడా ఇస్తుంటుంది. తనలా మంచి పనులు చేసేవారి వివరాలు కూడా. జిన్షాను తమతో కలిసి పని చేయమని చాలా ఎన్‌జీఓలు కోరాయి. ‘అయితే అవన్నీ ఎంతోకొంత లాభాపేక్షతో పని చేస్తాయి. నేను వ్యక్తిగతంగా చేయగలిగింది చేస్తాను’ అంటుంది జిన్షా.జిన్షాకు ‘బెస్ట్‌ సోషల్‌ మీడియా బ్లాగర్‌ అవార్డ్‌ 2018’ వచ్చింది. ఆమె చేయాలనుకుంటున్న మంచి పనుల ముందు అదేమి పెద్ద విశేషం కాదు.ఇవాళ సమాజానికి జిన్షాల అవసరం చాలానే ఉంది.ఈ జిన్షా చాలామందికి స్ఫూర్తినివ్వాలని  కోరుకుందాం.

సామాన్యురాలిగా ఆగిపోవద్దు
స్త్రీలు చాలా శక్తిమంతులు. వారు తమ సంస్కృతిని గౌరవించాల్సిన మాట నిజమే కానీ అన్నిసార్లు పురుషులను వెంబడించాల్సిన పని లేదు. తాము స్వతంత్రంగా ఉండటం నేర్చుకోవాలి. నేను కూడా సామాన్యురాలినే. కానీ ఇవాళ చాలా సంతృప్తికరమైన పని చేస్తున్నాను. ఇలా వీలైన స్త్రీలందరూ చేయవచ్చు.
– జిన్షా బషీర్‌
 

Tags