పే...ద్ద ఇళ్లూ చవకే!

30 Jun, 2018 01:07 IST

సాక్షి, హైదరాబాద్‌: ‘అందుబాటు గృహాలు’ అనగానే విస్తీర్ణం తక్కువగా ఉండే చిన్న ఫ్లాట్లనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. కానీ తాజా గా కేంద్రం అందుబాటు గృహాల విస్తీర్ణాన్ని పెంచింది. మిడిల్‌ ఇన్‌కం గ్రూప్‌ (ఎం ఐజీ)–1 కింద 160 చ.మీ., ఎంఐజీ–2 కింద 200 చ.మీ. కార్పెట్‌ ఏరియా ఫ్లాట్లకూ వడ్డీ రాయితీ వర్తింపజేసింది. దీంతో 2,150 చ.అ. విస్తీర్ణంలోని పే...ద్ద గృహాలకు కూడా క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ స్కీమ్‌ (సీఎల్‌ఎస్‌ఎస్‌) కింద రూ.2.35 లక్షల వరకూ వడ్డీ రాయితీ అందుతుంది.

గతంలో 30, 60 చ.మీ. కార్పెట్‌ ఏరియా ఉండే ఫ్లాట్లను మాత్రమే అందుబాటు గృహాలుగా పరిగణించి.. వాటికి మాత్రమే ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద వడ్డీ రాయితీలు అందించేవారు. ఫ్లాట్ల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో పెద్దగా సక్సెస్‌ కాలేకపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తాజాగా ఎంఐజీ గృహాల కార్పెట్‌ ఏరియాలను 33% పెంచింది.

గతంలో 120 చ.మీ.లుగా ఉన్న ఎంఐజీ–1 కార్పెట్‌ ఏరియాని ప్రస్తుతం 160 చ.మీ.లుగా, అలాగే గతంలో 150 చ.మీ.లుగా ఉన్న ఎంఐజీ–2 కార్పెట్‌ ఏరియాను ప్రస్తుతం 200 చ.మీ.లకు విస్తరించింది. వాస్తవానికి కేంద్రం ఎంఐజీ గృహాల విస్తీర్ణాలను పెంచడం ఇది రెండోసారి. పీఎంఏఐవై పథకం ప్రారంభంలో ఎంఐజీ–1 గృహాల కార్పెట్‌ ఏరియా 90 చ.మీ., ఎంఐజీ–2 గృహాలకు 110 చ.మీ. కార్పెట్‌ ఏరియాలుండేవి.

నగరాల్లో ఈ విస్తీర్ణాల్లోని గృహాలకు పెద్దగా ఆదరణ లేకపోవటంతో ఎంఐజీ–1 గృహాల కార్పెట్‌ ఏరియాను 120 చ.మీ.లకు, ఎంఐజీ–2ని 150 చ.మీ.లకు పెంచింది. రెండు సందర్భాల్లోనూ ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ గృహాల కార్పెట్‌ ఏరియాల్లో, ఆదాయ పరిమితి, వడ్డీ రాయితీల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

నెల జీతం లక్ష, లక్షన్నరైనా సరే..
లింగభేదంతో సంబంధం లేకుండా ఎంఐజీ గృహాలను ఎవరైనా సరే కొనుగోలు చేయవచ్చు. కాకపోతే తొలిసారి గృహ కొనుగోలుదారులై ఉండాలి. ఏడాది వేతనం రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల లోపు అంటే నెలకు లక్ష వేతనం ఉన్నవారు రూ.30 లక్షల దాకా గృహ రుణం తీసుకొని రూ.2.35 లక్షల వడ్డీ రాయితీని పొందవచ్చు. మిగిలిన మొత్తంపై మార్కెట్లో ఉండే వడ్డీ రేటు ఉంటుంది. కాకపోతే వీళ్లు కేవలం ఎంఐజీ–1 కింద 160 చ.మీ. కార్పెట్‌ ఏరియా ఉండే గృహాలను మాత్రమే ఎంచుకోవాలి. అంటే 1,721 చ.అ. ఫ్లాట్లన్నమాట.

ఇక, ఏడాది వేతనం రూ.18 లక్షలు అంటే నెలకు లక్షన్నర వేతనం తీసుకునేవాళ్లు రూ.60 లక్షల దాకా రుణం తీసుకొని.. రూ.2.30 లక్షల వడ్డీ రాయితీని పొందవచ్చు. వీళ్లు 200 చ.మీ. అంటే 2,152 చ.అ. ఫ్లాట్ల కొనుగోలుకు మాత్రమే అర్హులు. ఎంఐజీ గృహ కొనుగోలుదారులకు వడ్డీ రాయితీ అవకాశం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఏపీ, తెలంగాణల్లో 25 వేల గృహాలు..
కేంద్రం తాజా నిర్ణయంతో ముంబై, ఢిల్లీ, గుర్గావ్‌ వంటి ప్రధాన నగరాల కంటే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కోచి, చండీగఢ్‌వంటి నగరాలకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయా నగరాల్లో 80 శాతం నిర్మాణాలు 200 చ.మీ. లోపే ఉంటాయని.. దీంతో ఈ గృహాలకు డిమాండ్‌ పెరుగుతుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్‌ రెడ్డి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధికి తెలిపారు.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ, పాత స్టాక్‌ను తొలగించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) సౌత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌ చలపతి రావు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 18 వేల ఫ్లాట్లు ఇన్వెంటరీ ఉంటుంది. ఏపీలో సుమారు 6 వేల యూనిట్లుంటాయి. ఏపీ, తెలంగాణల్లో సుమారు 25 వేల యూనిట్లు ఉంటాయని
తెలిపారు.    


వ్యక్తిగత ఇళ్లకు, పై అంతస్తుకైనా..
వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకున్నా లేక అప్పటికే ఉన్న ఇంటి పైన మరో అంతస్తు వేసుకున్నా సరే రూ.1.50 వరకూ వడ్డీ రాయితీ లభిస్తుంది. కాకపోతే ఆయా గృహాలు అందుబాటు గృహాల కార్పెట్‌ ఏరియా నిబంధనలకు లోబడి ఉండాలి. 30, 60 చ.మీ. కార్పెట్‌ ఏరియాలోని ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ ఫ్లాట్లకు కూడా వడ్డీ రాయితీ ఉంటుంది. అయితే ఈ గృహాల కొనుగోలుకు కేవలం మహిళలే అర్హులు.

కనీసం జాయింట్‌ ఓనర్‌గానైనా ఉండాలి. ఏడాది వేతనం రూ.6 లక్షలు లోపుండే మహిళలకు రూ.6 లక్షల రుణంపై 6.5% వడ్డీ రాయితీ ఉంటుంది. అంటే రూ.2.67 లక్షల మినహాయింపు లభిస్తుంది. అలాగే 30, 60 చ.మీ. ఫ్లాట్ల నిర్మాణానికి కేంద్రం జీఎస్‌టీ, ఆదాయ పన్ను రాయితీలను అందిస్తుంది. ప్రతి యూనిట్‌ మీద రూ.1.5 లక్షల వరకు వడ్డీ రాయితీతో పాటూ 80 ఐబీఏ సెక్షన్‌ కింద ఆదాయ పన్ను రాయితీ కూడా ఉంటుంది.

సాధారణ ప్రాజెక్ట్‌లకు ఎఫెక్టివ్‌ జీఎస్‌టీ 12 శాతం ఉండగా.. ఈ ప్రాజెక్ట్‌లకు 8 శాతం జీఎస్‌టీ ఉంటుంది. పైగా అందుబాటు గృహాలకు మౌలిక హోదా గుర్తింపు కారణంగా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు అవుతాయి. అయితే ఇక్కడొక మెలిక ఉందండోయ్‌.. ఈ తరహా ప్రాజెక్ట్‌ల్లో కనీసం 250 గృహాలుండాలి. వీటిల్లో కనీసం 35 శాతం ఫ్లాట్లు 60 చ.మీ. కార్పెట్‌ ఏరియా ఉండాలి.

Tags