ఈక్విటీ హెచ్చుతగ్గులను ఎలా ఎదుర్కోవాలి?

25 Jun, 2018 02:19 IST

నేను మరో పదేళ్లలో రిటైరవుతున్నాను. రిటైర్మెంట్‌ తర్వాత జీవితం సాఫీగా ఉండటం కోసం ఇప్పటికే కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేశాను. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ)ల్లో కూడా ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ కోసం ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?     – శ్రీనివాస్, విజయవాడ  
రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ కోసం నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌(ఎన్‌సీడీ)ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇవి స్థిరమైన ఆదాయాన్ని ఇస్తాయి. అయితే మీకు డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు ఉండవు. మీరు కొనుగోలు చేసిన ఎన్‌సీడీలను జారీ చేసిన కంపెనీ బాగా ఉన్నంత కాలం మీ సొమ్ముకు ఎలాంటి ఢోకా ఉండదు. మీరు ఒకటి లేదా రెండు కంపెనీల్లో పెద్ద మొత్తాల్లోనే ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. అవి మెచ్యూరయ్యే సమయానికి ఆ కంపెనీల ఆర్థిక స్థితిగతులు బాగా లేకపోతే, మీకు ఇబ్బందులు తప్పవు. ఎన్‌సీడీలకు బదులుగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. పిల్లల పై చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అయితే ఎన్‌సీడీల్లో ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది. రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ కోసం జాగ్రత్తగా ఇన్వెస్ట్‌ చేయాలి. మొత్తం మీద రిటైర్మెంట్‌ కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం మూడో వంతు ఈక్విటీలో ఉండాలి.  

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చని మీరు తరచూ చెబుతుంటారు. కానీ, ఈక్విటీ మార్కెట్లో ఒడిదుడుకులు చాలా ఎక్కువ కదా ! మరి ఈ ఒడిదుడుకుల ప్రభావం మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఉండదా ? వాటిని ఎలా అధిగమించాలి.   – మణిమాల, హైదరాబాద్‌ 
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చనేది నిజం. అలాగే స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయన్న మాట కూడా నిజమే. ఈక్విటీ మార్కెట్‌తో సంబంధం ఉన్న ఏ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అయినా, చివరకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌పై కూడా స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకుల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు 2016లో సెన్సెక్స్‌ 2 శాతమే రాబడులనిచ్చింది. గత ఏడాది సెన్సెక్స్‌ రాబడి 28 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్‌ రాబడి 4 శాతం వరకూ ఉంటుంది. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు, మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌పై ఒడిదుడుకుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ ఒడిదుడుకుల సమస్యను రెండు రకాలుగా ఎదుర్కోవచ్చు. మొదటిది ఈక్విటీల్లో ఎప్పుడూ దీర్ఘకాలం దృష్ట్యానే ఇన్వెస్ట్‌ చేయాలి. స్వల్ప కాలిక రాబడుల కోసం ఎప్పుడూ ఈక్విటీలను ఎంచుకోకూడదు.  దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే, స్వల్పకాలిక ఒడిదుడుకులను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. కనీసం ఐదేళ్లకు పైగా ఇన్వెస్ట్‌ చేయగలిగితేనే ఈక్విటీని ఎంచుకోవాలి. ఇక రెండోది ఈక్విటీల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయాలి. ఈ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే, మార్కెట్‌ పెరిగినప్పుడు మీకు తక్కువ యూనిట్లు వచ్చినా, మార్కెట్‌ పతనమైనప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి.  

నా మిత్రుల్లో ఇద్దరు, ముగ్గురు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు ఉన్నారు. మొహమాటం కొద్దీ రెండు, మూడు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోవలసి వచ్చింది. ఇది కాకుండా మా ఆఫీస్‌వాళ్ల హెల్త్‌ పాలసీ కూడా ఉంది.   సింగిల్‌ క్లెయిమ్‌ కోసం వీటన్నింటిని ఉపయోగించుకోవచ్చా?  – వంశీధర్, విశాఖపట్టణం 
ఆర్థిక సంబంధిత అంశాల్లో ఎప్పుడూ మొహమాటానికి తావు ఇవ్వవద్దు. మొహమాటానికి పోతే అవసరం లేని పాలసీలు తీసుకోవలసి వస్తుంది. అనవసరంగా పాలసీ ప్రీమియంలు చెల్లించాల్సి వస్తుంది.  సింగిల్‌ క్లెయిమ్‌ కోసం రెండు పాలసీలను ఉపయోగించుకోవచ్చు. ఒక పాలసీ కవరేజ్‌ పూర్తయితేనే రెండో పాలసీని క్లెయిమ్‌ చేసుకునే అవకాశాలున్నాయి. సింగిల్‌ క్లెయిమ్‌ కోసం రెండు పాలసీలు ఉపయోగించుకోవాలని అనుకున్నారనుకోండి. ఒక్క పాలసీని మాత్రమే నగదు రహిత(క్యాష్‌లెస్‌) విధానంలో ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, మోకాలి చిప్ప రీప్లేస్‌మెంట్‌ కోసం మీకు రూ.2 లక్షలు అవసరమయ్యాయనుకుందాం. మీ ఆఫీస్‌ పాలసీ కవరేజ్‌ రూ. లక్షకు, మీరు తీసుకున్న ఒక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ రూ. 1 లక్ష ఉందనుకుందాం. మీరు ఈ రెండు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను వినియోగించుకోవచ్చు. మీరు హాస్పిటల్‌లో జాయిన్‌ అయినప్పుడు, హాస్పిటల్‌ సిబ్బంది  ఒక ఇన్సూరెన్స్‌ కంపెనీకి క్యాష్‌లెస్‌ అప్రూవల్‌ కోసం మీ డాక్యుమెంట్లను పంపిస్తుంది. సదరు సంస్థ ఆమోదం తెలపగానే, మిగిలిన రూ. లక్ష చెల్లించమని మిమ్మల్ని ఆ హాస్పిటల్‌ అడుగుతుంది. మీరు ఆ మొత్తాన్నిచెల్లించి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటారు. మీరు హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జీ అయ్యేటప్పుడు.. మొదటి బీమా సంస్థ రూ.లక్ష చెల్లించనట్లుగా సెటిల్మెంట్‌ లెటర్‌ను హాస్పిటల్‌కు పంపిస్తుంది. మీరు ఈ సెటిల్మెంట్‌ లెటర్‌ను హాస్పిటల్‌ నుంచి తీసుకొని మీరు చెల్లించిన రూ. లక్ష రికవరీ కోసం వేరే బీమా సంస్థకు పంపించాలి. ఈ సెటిల్మెంట్‌ లెటర్‌లో పాలసీ వివరాలు. మీరు ఏం ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ఎంత ఖర్చయింది, ఎప్పుడు హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. . ఇలా అన్ని వివరాలు ఉంటాయి. మీరు చెల్లించిన రూ. లక్ష మొత్తాన్ని రెండో బీమా సంస్థ నుంచి రీయింబర్స్‌ పొందడానికి సాధారణంగా ఈ సెటిల్మెంట్‌ లెటర్‌ సరిపోతుంది. మీరు ఒకే సంస్థ నుంచి రెండు, మూడు పాలసీలు తీసుకున్నట్లయితే, క్యాష్‌లెస్‌ సౌకర్యం పొందడం చాలా సులభమవుతుంది.
ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌  

Tags