వర్చువల్‌ ఐడీలతో ఇక మొబైల్‌ కనెక్షన్‌

14 Jun, 2018 00:38 IST

న్యూఢిల్లీ: కస్టమర్ల ఆధార్‌ నంబర్‌ స్థానంలో వర్చువల్‌ ఐడీల స్వీకరణకు వీలుగా తమ వ్యవస్థలను మెరుగుపరచుకోవాలని ప్రభుత్వం టెలికం కంపెనీలకు సూచించింది. అలాగే, పరిమిత కేవైసీ యంత్రాంగానికి మళ్లాలని కోరింది. జూలై 1 నుంచి నూతన వర్చువల్‌ ఐడీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. ఆధార్‌ నంబర్‌కు బదులు ఆధార్‌కు సంబంధించిన వర్చువల్‌ ఐడీలను కస్టమర్లు చెబితే సరిపోతుంది.

ఓ వ్యక్తి ఆధార్‌ నంబర్‌కు 16 అంకెల ర్యాండమ్‌ నంబర్‌ను కేటాయిస్తారు. ఆధార్‌ రూపంలో వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం దీన్ని ఆచరణలోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో టెల్కోలు ఆధార్‌ ఈకేవైసీ ధ్రువీకరణ స్థానంలో నూతన వర్చువల్‌ ఐడీ, పరిమిత ఈ–కేవైసీ ఆధారంగా కొత్త కనెక్షన్ల జారీ, చందాదారుల రీవెరిఫికేషన్‌కు అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. 

Tags