సౌర విద్యుత్‌ను విస్తరిద్దాం!

26 May, 2018 00:32 IST

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సౌర విద్యుత్‌.. పేరు వినడానికి సింపుల్‌గానే అనిపిస్తుంది. ప్రాక్టికల్‌గానే కాసింత కష్టం. కారణం.. ఇన్‌స్టలేషన్, నిర్వహణ, పనిచేసే విధానం అంత సులువుగా అర్థం కావు! ఈ రంగంలోని బడా కంపెనీలేమో మెట్రోలకే పరిమితమయ్యాయి. గ్రామీణ, ఎంఎస్‌ఎంఈలకు సౌర వెలుగులు అందటంలేదు. దీనికి పరిష్కారం కనుగొంది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ఫ్రెయర్‌ ఎనర్జీ.

‘సన్‌ ప్రో’ యాప్‌ ఆధారంగా కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా సౌర ఏర్పాట్లు చేస్తోంది. దీంతో కంపెనీలకు ఎలాంటి పెట్టుబడి లేకుండానే గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించినట్టవుతుంది. పైగా బ్యాంక్‌లతో ఒప్పందం చేసుకొని కస్టమర్లకు రుణాలనూ అందిస్తుంది. మరిన్ని వివరాలను ‘ఫ్రెయర్‌’ కో–ఫౌండర్‌ రాధిక చౌదరి ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

‘‘మాది హైదరాబాద్‌. ఉస్మానియాలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక.. అమెరికాలో న్యూక్లియర్‌ ఎనర్జీలో మాస్టర్స్‌ చేశా. తర్వాత జీఈ కంపెనీలో పవన విద్యుత్‌ విభాగంలో చేరా. అక్కడి నుంచి ఎస్‌కేఎఫ్‌ బేరింగ్స్‌లో చేరా. పెళ్లయి, పిల్లలు పుట్టడంతో 2008లో ఇండియాకు తిరిగి వచ్చేశా. హైదరాబాద్‌లో ల్యాంకో ఇన్‌ఫ్రాలో సోలార్‌ విభాగ డీజీఎంగా చేరా. ఆర్థిక సంక్షోభంతో కంపెనీ ఢిల్లీకి మారింది. ఢిల్లీకి వెళ్లటం ఇష్టం లేక నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. అప్పుడే మరో మిత్రుడు సౌరభ్‌ మర్ధాతో కలిసి రూ.కోటి పెట్టుబడితో 2014లో ఫ్రెయర్‌ ఎనర్జీని ఆరంభించాం.

నెలకు రూ.5 కోట్ల ఆర్డర్లు..
రూఫ్‌ టాప్స్, బోర్‌వెల్స్, పెంట్రోల్‌ బంక్‌లు, మైక్రో గ్రిడ్‌ నాలుగు విభాగాల్లో సౌర విద్యుత్‌ను అందిస్తున్నాం. రూ.5 కోట్ల విలువైన ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి ఆర్డర్‌పై మాకు 10 శాతం లాభం ఉంటుంది. ఎస్‌పీడీసీఎల్, ఈపీడీసీఎల్‌ వంటి విద్యుత్‌ విభాగాలతో పాటు యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి పలు కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లనూ నిర్వహిస్తున్నాం. త్వరలోనే తెలంగాణలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో సౌర విద్యుత్‌ ఏర్పాట్లకు ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. మా మొత్తం సౌర విద్యుత్‌ నిర్వహణలో ఎంఎస్‌ఎంఈ 40 శాతం, రూఫ్‌ టాప్‌ 20 శాతం వరకూ ఉంది.

14 రాష్ట్రాలు, విదేశాల్లోనూ సేవలు..
ప్రస్తుతం ఫ్రెయర్‌ ఎనర్జీతో 10 వేల మంది చానల్‌ పార్టనర్స్‌ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో 500 మంది యాక్టివ్‌గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, చంఢీగఢ్, ఢిల్లీ వంటి 14 రాష్ట్రాల్లో 900 పైగా సోలార్‌ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 6 మెగావాట్ల సౌర విద్యుత్‌ను నిర్వహిస్తున్నాం. మన దేశంతో పాటూ ఆఫ్రికా దేశాల్లోనూ చానల్‌ పార్టనర్స్‌ ఉన్నారు. వచ్చే రెండేళ్లలో 15 దేశాలకు విస్తరణ, 8 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ నిర్వహణకు చేరాలని లకి‡్ష్యంచాం.

2 నెలల్లో రూ.20 కోట్ల సమీకరణ..
గత ఆర్ధిక సంవత్సరంలో రూ.12 కోట్లు ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.80 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే టెక్నాలజీ విభాగంలో మరో 15 మందిని తీసుకోనున్నాం. గత 18 నెలల్లో పలువురు సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్లు మా సంస్థలో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు. రాబోయే 2 నెలల్లో 3 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించనున్నాం. యూరప్, సింగపూర్‌లకు చెందిన ఇన్వెస్టర్లతో చర్చలు ముగిశాయి’’ అని రాధిక వివరించారు.

Tags