జారిపోని సోపు...

22 May, 2018 00:23 IST

ఇదో వింత ఆకారం. పేరు టెట్రాపాడ్‌. సముద్ర తీరాల్లో అక్కడక్కడా ఈ ఆకారంలో ఉండే దిమ్మెలు కనిపిస్తూంటాయిగానీ.. పొటోలో ఉన్నది మాత్రం ఓ సోపు. అవునా? అని నోరెళ్లబెట్టకండి. చేతిలోంచి జారిపోకుండా ఉండేందుకు, ఎక్కువ కాలం మన్నే లక్ష్యంతో తాము దీన్ని తయారు చేశామని చెప్పుకుంటోంది టెట్రాసోప్‌ అనే స్టార్టప్‌. దీని ఆకారం చూడగానే తెలిసిపోతుంది... ఇది అస్సలు జారిపోదని. సిలికాన్‌ అచ్చు ద్వారా ఈ ప్రత్యేకమైన ఆకారంలో సోపులు తయారు చేస్తున్నారు. ఆముదం మొదలుకొని పలు రకాల నూనెలు, కొవ్వులతో దీన్ని తయారు చేశారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటివల్ల పర్యావరణానికి ఏమైనా నష్టం జరిగిందా? లేదా? అన్న వివరాలు కూడా ముద్రించి మరీ ఈ సోపును అమ్ముతున్నారు.

ఈ రకమై సోపును తయారు చేసేందుకు డబ్బులు కావాలని టెట్రాసోపు కిక్‌స్టార్టర్‌లో అడిగిందే తడవు.. దాదాపు 30 వేల హాంకాంగ్‌ డాలర్లు వచ్చిపడ్డాయి. గత ఏడాది చివరలో ఈ డబ్బులతో ఉత్పత్తి ప్రారంభించిన టెట్రాసోపు ప్రస్తుతం తమ వెబ్‌సైట్‌ ద్వారా వాటిని అమ్ముతోంది. అంతాబాగానే ఉందిగానీ.. ఈ టెట్రాసోపుతో ఒంటికి సోపు రాసుకోవడం ఎలా? అన్న డౌట్‌ వస్తోందా? నిజమే. దీన్ని తాము చేతులు కడుక్కునేందుకు మాత్రమే తయారు చేశామని... కాకపోతే వందగ్రాముల సోపు 30 రోజులపాటు మన్నుతుంది కాబట్టి... ఇతర అవసరాలకూ వాడుకోవచ్చునని కంపెనీ అంటోంది. 

Tags