గృహిణులూ! మీకూ కావాలివి!!

9 Apr, 2018 01:46 IST

దేశంలో ఎక్కువ మంది మహిళలు వివాహానంతరం ఇంటికి సంబంధించిన బాధ్యతలతో గృహిణి పాత్రలో కనిపిస్తుంటారు. భర్త కేవలం వృత్తి, లేదా ఉద్యోగ బాధ్యతలకు పరిమితమైతే ఆమె ఆ ఇంటిని అన్నీ తానై నడిపిస్తుంటుంది. మరి ఈ విధంగా కుటుంబ బాధ్యతలకు అంకితమైన ఆమె భవిష్యత్తు భద్రతను నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికమనే కాదు తనకు సంబంధించి మరెన్నో కీలక అంశాలపై ఆమె ముందు జాగ్రత్త పడాలి. అవేంటన్నది తెలియజేసే కథనమే ఇది.      –సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


నగదు పరిహారం
మీరు గృహిణి అయితే మీ జీవిత భాగస్వామి ప్రతి నెలా ఇంటి అవసరాల కోసం కొంత మొత్తం నగదును ఇస్తూ ఉండొచ్చు. ఇందులో మీ వ్యక్తిగత అవసరాలకు కావాల్సిన మొత్తం కూడా ఉందా, లేదా అన్నది గమనించండి. ఇంటికి సంబంధించి మీరు చేసే పనులకు కావాల్సిన మొత్తాన్ని తీసుకునే హక్కు మీకు ఉంది.

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ 2011 నాటి అధ్యయనం ప్రకారం సగటున మన దేశంలో ప్రతీ గృహిణి రోజులో ఆరు గంటలు ఇంటి కోసం ఎటువంటి నగదు ప్రయోజనం లేకుండా కష్టపడుతోంది. మరి ఈ ప్రకారం చూస్తే ప్రతీ గృహిణి ప్రతీ నెలా ఎంత మొత్తం పొందాల్సి ఉంటుందో ఆలోచించండి. తమ జీవిత భాగస్వామి ఆర్జన మేరకు ఈ మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు.

ఆరోగ్య బీమా తప్పనిసరి
కుటుంబం మొత్తానికి రక్షణ కల్పించే ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అవసరం నేడు ఎంతో ఉంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఉంటే అందులో తమ పేరు కూడా ఉండేలా చూసుకోవడం గృహిణి బాధ్యత. మెట్రో నగరంలో నివసిస్తుంటే, హెల్త్‌ కవరేజీ కనీసం రూ.5–10 లక్షలు ఉండాలి.

వయసు పెద్దది అవుతుంటే బేసిక్‌ వైద్య బీమాకు అదనంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ కూడా అవసరపడుతుంది. వైద్య పరమైన ద్రవ్యోల్బణం ఏటేటా పెరుగుతుండడం వల్ల ఆ మేరకు పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి, జీవన శైలి వ్యాధులు పెరిగిపోతుండడం వల్ల క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ ఆదుకుంటుంది. కవరేజీ కనీసం రూ.20–25 లక్షలు ఉండాలి. భార్యా, భర్తలు ఇద్దరికీ అవసరమే.

జీవిత బీమా...
గృహిణులకు వ్యక్తిగతంగా ఎటువంటి ఆదాయం లేకపోతే, పిల్లలు కూడా ఉండి ఉంటే, జీవిత భాగస్వామి పేరిట రుణాలు ఉంటే జీవిత బీమా తీసుకోవడం తప్పనిసరి. ఒకవేళ జీవిత భాగస్వామికి ఏదైనా జరిగి అతను దూరమైతే ఆ గృహిణి తనపై పడే ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు జీవిత బీమా అక్కరకు వస్తుంది.

తన జీవిత భాగస్వామి వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర తక్కువ కాకుండా, రుణాలు ఏవైనా తీసుకుని ఉంటే ఆ మొత్తాన్ని కూడా కలిపి అంత కవరేజీకి టర్మ్‌ ప్లాన్‌ తీసుకునేలా చూసుకోవడం ప్రతీ గృహిణి మర్చిపోని అంశం. సంప్రదాయ బీమా పాలసీలు, మనీబ్యాక్‌ పాలసీలు అక్కరకు రావు. భారీ మొత్తంలో కవరేజీకి టర్మ్‌ ప్లాన్‌ తక్కువ ప్రీమియానికే లభిస్తుంది.

నామినీగా మీ పేరు
కుటుంబ ఆర్థిక విషయాలు, పెట్టుబడుల్లో గృహిణుల పాత్ర కూడా అవసరం. తమకెందుకులేనన్న నిరాసక్తత, బిడియంతో ఉండొద్దు. కనీసం పెట్టుబడులు, బీమా పాలసీల్లో నామినీగా మీ పేరును నమోదు చేశారా, లేదా అని చూసుకోవాలి. అలాగే, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ తెలిసి ఉండాలి. అన్ని రకాల పెట్టుబడుల్లో జాయింట్‌ హోల్డర్‌ లేదా నామినీగా తమ పేరును ప్రతిపాదించేలా చూసుకోవాలి.

బ్యాంకు ఖాతా కొనసాగింపు
వివాహానంతరం ముందు నుంచీ ఉన్న బ్యాంకు ఖాతాను కొనసాగించుకోవడం మంచిది. అలాగే, పెట్టుబడులు కూడా. ముందు నుంచి ఉన్న బ్యాంకు ఖాతాను జాయింట్‌ అకౌంట్‌గా మారుద్దామని జీవిత భాగస్వామి ప్రతిపాదించినప్పటికీ దాన్ని మీ ఒక్కరి పేరు మీదే కొనసాగించుకోవాలి. అవసరమైతే జీవిత భాగస్వామితో విడిగా జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసుకోవాలి. తమ పేరిట ఉన్న ఖాతాను మాత్రం యథావిధిగా కొనసాగించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

రిటైర్మెంట్‌ అవసరాలు
ప్రతీ మహిళ పురుషులతో పోలిస్తే సగటున 5–7 ఏళ్లు అధికంగా జీవిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. కనుక జీవిత భాగస్వామి దూరమైనా ఆ తర్వాత తమ విశ్రాంత జీవన అవసరాలను తీర్చే నిధి కోసం ప్రణాళిక వేసుకోవాలి. కనుక ఆ మేరకు అవసరాలను తీర్చే విధంగా నిధి ప్రణాళిక అమల్లో పెట్టాలని జీవిత భాగస్వామిని కోరాలి. ఇక ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంటే ఆ మేరకు అదనపు నిధి అవసరం అవుతుంది.

ఆన్‌లైన్‌ ఆర్థిక లావాదేవీలు
గృహిణి అయినప్పటికీ డిజిటల్‌ అనుసంధానం నేడు అవసరం. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటున్న రోజులు. కనుక నెట్‌ బ్యాంకింగ్, ఆన్‌లైన్‌ లావాదేవీలు తెలిసే ఉంటాయి. లేకపోతే వెంటనే తెలుసుకోవాలి. ఆర్థిక లావాదేవీలపైనా అవగాహన కల్పించుకోవాలి. ఆన్‌లైన్‌లో పెట్టుబడులు, చెల్లింపులు, క్లెయిమ్‌లు, సమాచారం తదితర విషయాలను అవసరమైతే జీవిత భాగస్వామి సహకారంతో అయినా వెంటనే తెలుసుకుని ఉంటే మంచిది.

Tags