సౌరమానం: ఈ వారం రాశి ఫలితాలు 

6 Nov, 2017 19:31 IST

జన్మనక్షత్రం తెలియదా?  నో ప్రాబ్లమ్‌!  మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం  (మార్చి 23 నుంచి 29 వరకు)  మీ రాశి ఫలితాలు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

వాహనాన్ని మనం నడుపుతుంటే– పిల్లలకి కేవలం వేగంగా పోవాలనే దృక్పథం ఉండే కారణంగా– ఇంకా ... ఇంకా... అంటూ మనని రెచ్చిపోయేలా చేస్తారు. వాళ్ల ఆనందాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మరింతగా వెళ్తుంటే... ఏమైనా అనూహ్యకర సంఘటన జరగచ్చు. నలుగురూ మననే అనచ్చు. ప్రస్తుతపు మీ పరిస్థితే ఇదే. అనుకూలంగా ఉంది కదాని మరింతగా దూసుకుపోతున్నారేమో గమనించుకోండి. ఒక్కసారిగా ఆగిపోవాల్సి రావచ్చేమో ఆలోచించుకోండి. నిదానమే ప్రధానం. కొన్ని పనుల్లో పట్టుదలలకి పోవడం అవసరం. అంతేగాక ఒక్కచోట సందర్భాన్ని బట్టి బెట్టు చేయడం కూడా ఆవశ్యకమే. అయితే ఆ పట్టుదల అనేది శ్రుతి మించినట్టయితే పని మొదటికే మోసం వస్తుందని గ్రహించండి. పట్టు మీదిగా చేసుకుంటూ విడుపుని మరొక వ్యక్తి ద్వారా చే(యి)స్తూ కార్యాన్ని సాధించుకోండి.

పట్టూ విడుపూ మీరే అయిన పక్షంలో ఇదొక చక్కని నాటకమని అర్థమైపోతుంది ఎదుటివారికి. అధికారుల గుర్తింపూ లభిస్తుంది. కళాకారులూ విద్వాంసులూ రచయితలూ అయిన వారికి మన్నన పెరుగుతుంది. పారిశ్రామికంగా మంచి ఆలోచనలని చేసి అమలుకోసం ప్రయత్నాలని సాగిస్తారు. ఇబ్బందికి గురి చేయాలనుకునే మిత్రుల్లా కనిపిస్తున్నా శత్రువులెవరో మీకు అర్థమైపోతారు. ఏ తీరుగానూ మీరనుకున్న పనికి విఘ్నం ఆలస్యం జరగదు. పూర్తవుతుంది కూడా. పనుల ఒత్తిడి కారణంగా ఒకరి మీద తొందరపాటుతో నోరు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఆవేశాన్ని ఏ తీరుగానైనా సరే అదుపు చేసుకోవడం తప్పనిసరి. ఇతరుల ముఖ్య కుటుంబ సమస్యని భుజం మీద వేసుకుని పరిష్కరించే ప్రయత్నాన్ని ప్రస్తుతానికి విరమించుకోండి. ముఖ్యంగా స్త్రీ సంబంధమున్న సమస్యలలో తలదూర్చనే దూర్చకండి. 

లౌకిక పరిహారం: నోటిని అదుపు చేసుకోండి. 
అలౌకిక పరిహారం: మీ కులదైవాన్ని ఆరాధించండి. 


వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)

బొటనవేలు బలంగానే ఉంది కదాని మిగిలిన నాలుగు వేళ్లనీ తక్కువ చేసి చూడకూడదు. కుడికాలు బలంగానే ఉంది కదాని ఎడమకాలి నొప్పిని అశ్రద్ధ చేయడం సరికాదు. నాకు బంధు సహకరాం ఎంతో బలంగా ఉంది కదాని మిత్రుల్ని విడిచెయ్యడం తూలనాడడం దూరంగా ఉంచడం గాని చేస్తే కొత్త ఇబ్బందిలో తలదూర్చినట్టే. ప్రమాదం నుండి బయటపడగలిగానని అర్థమయ్యేంత వరకూ మీరు శారీరకమైన లేదా మానసికమైన ప్రమాదానికి గురై ఉన్నట్టు తెలియనే తెలియదు. అంతటి శత్రుత్వాన్ని మీ మీద చూపవలసిన అవసరం ఏ మాత్రమూ లేకున్నా– వాళ్లకి ప్రమాదకరమైన ఓ వ్యక్తి మీద ఉన్న గురిలో మీరు పరోక్షంగా ఉన్న కారణంగా– అలాంటి ఉచ్చుని మీకూ బిగించారన్నమాట. నష్టం ఏమాత్రమూ లేదు– రాదు. అయితే తగిన జాగ్రత్తని ఆ వ్యక్తి విషయంలో పాటించి తీరాల్సిందే. ఇంటి ప్రధాన ద్వారం లేదా సింహద్వారానికుండే విలువా గౌరవమనేవి పేరుకి ద్వారమే అయినా స్నానాలగది ద్వారానికుండవు.

అదే తీరుగా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఓ ప్రత్యేకమైన గుర్తింపుని పలచన చేసుకోకుండానూ మీ స్థాయి తగ్గకుండానూ తగ్గించుకోకుండానూ గట్టి ప్రయత్నంలో ఉండండి. స్వీయ నిర్ణయం మీదే నిలబడే మనస్తత్వం మీది కాబట్టి మీరు మీ నిర్ణయం కారణంగా రాబోయే  వ్యతిరేకతంటూ ఏమీ లేదు. ధైర్యంగా సాగిపొండి. మిమ్మల్ని ఓ సంఘానికి అధ్యక్షునిగా.. కార్యదర్శిగా... ఇలా ఏదో ఓ పదవిలోనికి రప్పించాలనే గట్టి ప్రయత్నాలు సాగుతూ ఉండచ్చు. మీ దాకా ఇంకా వచ్చి ఉండకపోవచ్చు. అలాంటి పదవుల వల్ల జరగబోయే నష్టమంటూ లేదుగాని– కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం శూన్యం కావచ్చు. ఆ కారణంగా దాంపత్యంలో మనఃస్పర్ధలకి తావు ఏర్పడవచ్చు. పైవాళ్లనెవరినో ఉద్ధరించడం కోసం మన సంసారాన్ని ఛిద్రం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఆలోచించుకోండి. 

లౌకిక పరిహారం: దాంపత్యంలో పొరపచ్చాలు మంచిది కాదు. 
అలౌకిక పరిహారం: ఆదిత్య హృదయస్తోత్రం ఉత్తమం. 

మిథునం(మే 21 –  జూన్‌ 20)

జీవితానికి సంబంధించిన ఓ ప్రధాన సమస్య పరిష్కరింపబడాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికి ఎంతో సమయాన్నీ ధనాన్నీ సహనాన్నీ కూడా వెచ్చించి ఉన్నారు మీరు. అదృష్టయోగం తలుపు తడుతున్న కారణంగా కారణంగా ఆ సమస్య సరైన తీరులో పరిష్కరింపబడుతూ మీకు సత్ఫలితాన్ని ఈయబోతోంది. ఆ సమస్య సంతానం లేదా ఎవరి కోరల్లోనో చిక్కుకున్న ఆస్తి లేదా నిష్కారణంగా మీద పడిన న్యాయస్థానపు (నేర) అభియోగం వంటివి కావచ్చు. ఏమైనా ధైర్యంగా ఉండవచ్చు. అయితే గుంభనని పాటించి తీరాలి. చేస్తున్న ఉద్యోగం వ్యాపారమనేవి మంచి ఆదాయాలనే మీకు అందిస్తున్నా వృత్తి సంతృప్తి మీకు లేకపోయే కారణంగా– పోనీ! ఉద్యోగ వ్యాపారాలు మారితేనో లేక మారిస్తేనో... అనే ఆలోచన అకస్మాత్తుగా మీకు కలగవచ్చు. ఓ మాటని గుర్తుంచుకోండి. వ్యాసుడు భవిష్యపురాణాన్ని రాస్తూ కలియుగ జనుల లక్షణాలని తెలియజేస్తూ అందరూ– నేతి బీరకాయలే (ఘృత కోశాతక్యః) అన్నాడు.

ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరూ ఆనందంగా లేరు– ఉండరు. ఇది మానేసి మరో ఉద్యోగ వ్యాపారాలకెళితే అది చాలా బాగుండబోతోందనే నమ్మకం ఏమైనా ఉందా? మధ్యతరగతి జనం ఆలోచించాల్సిందొకటే– ఎలాగోలా కాలం దొర్లిపోతోందా లేదా అనే. ‘సంస్థలకోసం పుట్టిన వాళ్లం కాదు’ అనే దృఢాభిప్రాయంతో ఉండాలంతే. ఇంత నమ్మకంగా చేస్తున్నా ఏ క్షణంలోనైనా తొలగించవచ్చుననే ఆలోచన మీకు అనుక్షణం లేదై? అందుకే జరిగినంత కాలం జరగనియ్యడమే! ఆత్మానం సర్వదా రక్షేత్‌ అని సంస్కృత సూక్తి. ‘ముందు నువ్వు, నీ తర్వాతే ప్రపంచం’ అని దీనర్థం కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఉండాల్సిందే! మీకు కలిసొచ్చిన అదృష్టమేమంటే– మీ సంపాదన మీద ఆధారపడే వాళ్లు లేకపోవడం. ఆ కారణంగా విచ్చలవిడిగా వ్యయం చేయడం కాకుండా నిల్వలో ఉండడం అవసరం. వారం మధ్యలో శుభవార్తని వినే అవకాశముంది! శుభమస్తు!

లౌకిక పరిహారం: నియమాలూ, ప్రమాణాలూ ఆదర్శాలూ.. అంటూ గోతిలో పడకండి. 
అలౌకిక పరిహారం: శ్రీ విష్ణు సహస్రనామ పఠనం మంచిది.  

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)

 శరీరంలో ఎప్పటినుండో కొద్దికొద్దిగా చొప్పున పేరుకున్న అనారోగ్యం మొత్తం ఒకచోటికి చేరి గూడు కట్టుకుని క్రిమి జ్వర రూపం (వైరల్‌ ఫీవర్‌) గా బయటపడి ఇబ్బందికి గురి చేయవచ్చు. జ్వరం తగ్గినా కూడా దానికి సంబంధించిన నీరసం ఏ పనినీ చేయడానికి మీకు ఉత్సాహాన్నీయలేకపోవచ్చు. దానికి సిద్ధపడే మీ దైనందిన ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. లేడి ఎలా తనకున్న నాలుగు కాళ్లలో ఏ ఒక్కటి సహకరించకున్నా (అనారోగ్యం గాయం..) పరుగెత్తడానికి శక్తి లేక పరిగెత్తలేదో, పక్షి ఎలా తనకున్న రెండు రెక్కల్లో ఏ ఒక్కటి సరిలేకున్నా ఎగరలేకపోతుందో, ఎగిరే ఆలోచనని కూడా చేయలేకపోతుందో, అలా మీరు చేయదలచుకున్న పనికి ఎంతో సమానంగా సహకరించగల శారీరక మానసిక శక్తి ఉన్న వ్యక్తులు లభించని కారణంగా పనిలో ముందుకు వెళ్లలేకపోవచ్చు.

అయినా ప్రయత్నించండి మరి. ఇటుపక్క అధికారులూ అటు పక్క ఆప్తులైన మీ మిత్రులూ అండదండలుగా నిలబడి మీకు నిరంతరం ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ఆ కారణంగా దిగులు పడాల్సిన అవసరం అనేది ఉండదు. అలాగని ఎల్లకాలమూ ఇదే తీరుగా ఉండబోతోందనే నమ్మకంతో ఉండడం సరికాదు కదా! తగిన హెచ్చరికతో ఉండక తప్పనిసరి. అవసరాలకి సరిపడినంత ఆదాయం అలా ఎటునుండో వచ్చేస్తూ ఉండే కారణంగా ఇబ్బంది ఆర్థికపరంగా ఉండదు. అయితే ఏదో స్థిరమైన ఆస్తిని కొనాలనుకున్న పక్షంలో మాత్రం తగినంత ధైర్యం సాహసం చేయలేకపోతారు. ఆప్తులైనవారినీ అనుభవజ్ఞుల్నీ సంప్రదించిన పక్షంలో అది సాధ్యమనిపిస్తుంది. అదృష్టయోగం ఉన్న కారణంగా ఒక్కడుగుని మీరు ముందుకు వేయగలిగితే చాలు తప్పక సర్వం అనుకూలంగానే ఉండి తీరుతుంది. చింతించాల్సిన పరిస్థితంటూ ఉండదు ఈ వారంలో. 

లౌకిక పరిహారం: కొద్ది సాహసాన్ని చేసి స్థిరమైన ఆస్తిని కొనే ప్రయత్నం చేయండి. 
అలౌకిక పరిహారం: గణపతి స్తోత్రం ఉత్తమం. 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)

ఒక్కసారి వెనుదిరిగి గనక చూసుకుంటే ఎన్నెన్ని ఊహాతీతమైన పనుల్ని మీరు చేసి ఉన్నారో, వాటి వల్ల రావలసిన ఎన్నెన్ని గట్టి ఆపదల నుండి ఆ భగవంతుడు మిమ్మల్ని బయట పడవేశాడో ఇప్పుడు స్పష్టంగా మీకు అర్థమౌతుంది. పొరపాటున కూడా ఆ పూర్వ జీవితపు ఛాయలని మనసుకి తెచ్చుకోకండి. అలాంటి ఆలోచనలకి ఎవరైనా ప్రోత్సాహాన్నీయదలిస్తే గట్టిగా వారించండి. సంతానపు చదువు ఒక కొంత మీ మీద ప్రభావాన్ని చూపించవచ్చు. ముఖ్యంగా మగ సంతానపు చదువూ దానితో పాటు ప్రవర్తనలలో మార్పూ మిమ్మల్ని కొద్దిగా కళవళ పెట్టచ్చు కాబట్టి. కోప్పడకుండా మందిలంచకుండా– నీది తప్పేనంటూ నిలదీయకుండా– మెత్తని మాటలతో లొంగదీసుకునే ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం. సమస్య పూర్తిగా తొలగిపోక పోవచ్చునేమోగాని ఎక్కువ భాగం పరిష్కరింపబడిపోతుంది. 

వివాహం కానివాళ్ల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశముంది. మొహమాటం మాని, వాళ్లనుండే అనుకూల వార్త వచ్చాక ముందుకెళదామనే ఆలోచనని మాని, మీకు మీరుగా వడి వడిగా ముందుకెళ్లిన పక్షంలో తప్పక శుభవార్తని వినగలుగుతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాయితీని తప్పకుండా వ్యవహరించడం అవసరం. శారీరకమైన అనారోగ్యం గాని ముఖ్యంగా చర్మవ్యాధి గాని కొంత ఇబ్బందికి గురి చేయవచ్చు. ఆ కారణంగా ముందు జాగ్రత్తలతో ఉండడం మంచిది. చదువుతున్న ఆడపిల్లకి మంచి సంబంధం వచ్చే అవకాశముంది. వివాహానికి సంబంధించిన ఆలోచన మీకున్నా ఆమె అంగీకరించకపోవచ్చు. గ్రహించుకోండి. ధనాశతో దూరభార ప్రయాణాలని చేయడం సత్ఫలితాన్నే ఈయవచ్చునేమోగాని, శారీరక ఆరోగ్యం గురించి ఆలోచించుకుని సాగండి. 

లౌకిక పరిహారం: కొత్త పొరపాట్లని చేయకండి. లోగడం చేసిన వాటిని మర్చిపోండి. 
అలౌకిక పరిహారం: దేవీస్తోత్రం ఉత్తమం. 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)

శ్రీమద్రామాయణంలో ఓ చిత్రమైన సంఘటన ఉంది. ‘సీతమ్మని లంకకి తేవడం వల్ల లంకానాశనం తప్పదు. కాబట్టి తేవద్దు’– విభీషణుని నిర్ణయం. ‘తెచ్చింతర్వాత పరిస్థితుల్ని బట్టి చూసుకోవచ్చు’– రావణుని ఆలోచన. ‘తేదలిస్తే తెచ్చెయ్‌. అయితే ఆమె భర్త మనమీదికి యుద్ధానికి రాకుండా అతని తల నరికి తీసుకురా!’– ఇది కుంభకర్ణుని సూచన. మీరు కూడా చేయబోతున్న మీ ఆలోచననని మరే కొందరి మధ్యన పెడితే ఇలాగే ఉంటుంది నిర్ణయం. మీకు మీకుగా తెలుసు– చేయబోతున్న పని తప్పే– అని. అందుకని అలాంటి పని జోలికి వెళ్లకండి. పాముని జాగ్రత్తగా పట్టుకుందామనుకోవడం సరైన ఆలోచనమే గాని, దానిలో ఒడుపూ నైపుణ్యం తెలిసినప్పుడు గదా అది సాధ్యం! అలాటి ఊహలని మానెయ్యండి. వ్యవసాయానికి సహాయపడుతుంది గదా! అనే ఆలోచనతో ఏదో ఓ యంత్ర పరికరాన్ని కొనడమో, కొనాలని అనుకోవడమో చేసే పరిస్థితి కనిపిస్తోంది.

దానివల్ల తాత్కాలికంగా ఇబ్బంది పడే అవసరం ఉంది కాబట్టి ఓ పదిరూపాయలు పోయినా రుణమే అయినా కొత్తదాన్నే కొనుక్కోండి తప్ప, మొహమాటానికో బంధుత్వానికో పోయి వాడుకలో ఉన్న వాహనాన్ని కొనుక్కోవద్దు.  ఇదే తీరుగా వాహనం విషయంలో కూడా కొత్త వాహనానికే ప్రాధాన్యాన్ని ఇయ్యండి. ఎవరో ఓ కొందరితో విదేశాలకి వెళ్లాల్సిన అవసరం మీకు లభించవచ్చు. మొహమాటం లేకుండా సొమ్ము గురించిన విషయాన్ని అడిగి మాత్రమే ఆ పనిలోకి దిగండి తప్ప, ముందుగా అనాలోచితంగా దిగి తడిసి మోపెడయ్యే ఖర్చుల మూటని భుజాన వేసుకోకండి. కీర్తి ప్రతిష్ఠలనేవి విదేశాలనుండి తెచ్చుకుంటేనే లభించేవి కావు. ఇక్కడ కూడా ఉన్నాయిగా! దగ్గరివారితో మాటా మాటా వచ్చే అవకాశముంది. రెండు చేతులూ కలిపితే కదా చప్పట్లు. మౌనంగా ఉండిపోండి. అది అసమర్థత కాదు– నేర్పరితనం మాత్రమే. 

లౌకిక పరిహారం: తేలికగా ఆదాయం వచ్చే ఆలోచనని చేయకండి. అందరితోనూ చర్చించకండి.
అలౌకిక పరిహారం: ఆంజ నేయస్తోత్రం మంచిది.  

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)

ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ నిద్రలు చేసినా, ఎందరు దేవతలకి అర్చనలని ముగించినా, ఎన్నెన్ని అభిషేకాలని సశాస్త్రీయంగా పూర్తి చేసినా నిష్కారణంగా ఎదుటి వ్యక్తిని మానసికంగా గాయపడేలా చేస్తే, ఏ వైదిక కార్యక్రమమూ ఏ దైవమూ రక్షించనే లేడు. అనడానికి ఇప్పటివరకూ కన్పించి, కనిపిస్తున్న పరిణామాలే సాక్ష్యం. మానసికంగా ఇబ్బంది పెట్టడమనేది మీ వల్ల జరిగి ఉండకపోవచ్చు కాని, ఆ పాత్రధారుల్లో మీకూ కొంత భాగస్వామ్యం ఉందిగా! మానసిక ప్రశాంతత కలగాలంటే ఒక మెట్టు దిగి రాజీకి వచ్చేయడమే ఉత్తమ మార్గం. ఆ మీదట మీ ఇష్టం. తగిన ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ ఉద్యోగ లాభం ఉండకపోవచ్చు. తలిదండ్రుల దగ్గరో అన్నదమ్ముల దగ్గరో ఉండే కారణంగా మీ మీద గౌరవం కూడా అంతంత మాత్రంగా ఉండవచ్చు.

ఇంత వయసొచ్చాక కూడా పరాయి పంచన ఉండడం అవసరమా? అనిగాని అదే పరిస్థితిలో మీరున్నట్లయితే ఆలోచించుకోవడం సమంజసం. సంతానంలో ఒకరికి ద్యూతం ఇతరమైన వ్యసనాల్లో ఒకటి ప్రారంభం కావచ్చు. కనిపెట్టి ఉండడం అవసరం. మీరు మీ పనుల మీద తప్పనిసరిగా వెళ్లవలసి వస్తుంటేనూ, గృహంలో క్రమశిక్షణ కట్టుబాటూ అనేది అంతంత మాత్రంగా ఉండే కారణంగానూ పిల్లలు కొద్ది తప్పటడుగులు వేసే అవకాశం సహజం. శ్రద్ధ పెట్టండి. తోవలోకి తెచ్చేసుకోండి. భగవత్కృపవల్ల మీ పిల్లలు బుద్ధిమంతులు నిజానికి. తలిదండ్రుల్లో ఒకరి ప్రవర్తన పూర్తిగా వ్యతిరేక దిశలో ఉండే కారణంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీలో మెత్తబడే ధోరణి కనిపించినా అది అమలు కావడం లేదేమో ఆలోచించుకోండి. పెద్ద వయసు వాళ్ల ఆరోగ్యాలని పరీక్షించుకుంటూ ఉండండి. 

లౌకిక పరిహారం: మెట్టు దిగడమనేది అసమర్థతకి చిహ్నం కాదు. పనిని సాధించుకునే నైపుణ్యంలో భాగం మాత్రమే. 
అలౌకిక పరిహారం: శ్రీలలితా సహస్రనామ పఠనం శ్రేయస్కరం. 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)

వెనకటికొక గయ్యాళి పెళ్లాం తనకి కోపమొచ్చినప్పుడల్లా ఓ కుండతో మగడి తలమీద మోది పగలగొడుతూ ఉండేదట. ఓరోజున ఇలా పగలగొట్టి– ‘నేనేమైనా చెడ్డదాన్ననుకుంటున్నావా?’– అని అడిగిందట. ఆయనన్నాడు కదా!–నువ్వెందుకు చెడ్డదానివి? పక్కింకి దానిలా కుండ ఖరీదు అడగడం లేదుగా!’– అన్నాట్ట అమాయకంగా. ఇది నవ్వులాట కథ కాదు. న్యాయస్థానాల్లో వేధించి వేధించి మాన సికంగా గాయపరచి అపనిందల్ని ప్రచారం చేసి చేయించి తమ గురించి గొప్పగా చెప్పుకుంటూ  ఉ ంటారు. అలాంఇ పరిస్థితిలాంటి మీకుగాని వచ్చి ఉంటే ఎదుటివాళ్లని తక్కువ చేసి మాట్లాడద్దు. నాటకం చివరి రంగం సాగుతోంది. విజయం మీ పక్షానే ముమ్మూర్తులా ఉంది. మీ చేత నింద వేయించుకుని మళ్లీ కాలుదువ్వుదామనే వారి ప్రయత్నానికి అవకాశాన్నియ్యకండి. అనేకానుభవాలతో రాటు దేలిపోయిన మీకు ఏ కోశానా భయం లేదు.

అలా చేసిన వాళ్లు మీ ప్రతిపక్షమే. ధర్మరాజు పట్టాభిషేకాన్ని పొందబోతున్న వేళ ‘కౌరవనాశనం మీద నీ అభిప్రాయమేమి?’టని అడిగితే కౌరవులే గనక మా మీదే దృష్టిని నిలపకుండా వాళ్ల పరిపాలనాన్ని వాళ్లు జాగ్రత్తగా చేసుకుని ఉంటే, మేం సోదిలోకి కూడా రాకుండా పోయేవాళ్లమే. అయితే వాళ్ల దృష్టి ప్రజలమీదగాక మమ్మల్ని సాధించడానికే అయిపోయిం’దన్నాట్ట. ఆలోచించండి. నేటి ఆయుష్య కాలం ప్రకారం 65–70 మధ్యకాలం వ్యక్తికి గడ్డుకాలమౌతుంటే అనవసరమైన ఆస్తి– భార్యాభర్తలూ– సంతాన సమస్యలూ వంటి వాటి విషయాలతో దాదాపు జీవితం మొత్తం స్వపక్షం ప్రతిపక్షం– వాదం ఉపవాదం– న్యాయస్థానం– పై న్యాయస్థానమనుకుంటూ తిరిగితే జీవితాన్ని ఏం ఆనందంతో గడిపినట్లు? ఆలోచించుకోగలగాలి. కొందరు బాధపెట్టే బాధకులైతే కొందరు బాధితులు. అయితే ఇద్దరూ నలిగిపోతూనే ఉన్నారుగా!

లౌకిక పరిహారం: నిదానంగా ఆలోచించుకుని పరిష్కరించుకునే దిశలోనే ఉండండి. 
అలౌకిక పరిహారం: శనిశ్లోకాన్ని రోజుకి 361 మార్లూ పఠిస్తూ ఉండాల్సిందే! 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)

ఓ ఇంటికి సంబంధించిన ప్రణాళిక ప్రకారమే స్తంభాలని నాటుతారు. ఒకసారంటూ స్తంభాలని నిర్మించేశాక వాటికి అనుగుణంగానే ఇంటి నిర్మాణం జరపవలసి వస్తుంది తప్ప– మళ్లీ ప్రణాళికని మారుద్దామనుకుంటే అది సాధ్యం కాకపోవచ్చు– కష్టసాధ్యం కావర్చు. శ్రమతోపాటు వ్యయం కూడా ఎక్కువ కావచ్చు. సరిగ్గా ఇలాగే మీరు బాగా బాగా ఆలోచించి మాత్రమే ఓ చేయబోయే పనికి సంబంధించిన ఆలోచనని చేసి దాని ప్రకారమే ముందుకు సాగండి తప్ప క్షణానికో ఆలోచన ప్రకారం సాగదలిస్తే పని పూర్తీ కాదు– పూర్తయినా కూడా అంత అందంగానూ ఉండదు. దంపతులైన మీ సౌఖ్యం కంటె సంతానపు అవసరాల కోసం విశేషంగా శ్రమిస్తారు. అది ఆహ్వానించదగ్గ విషయం. అదృష్టం కొద్దీ చక్కటి విద్యా ప్రాభవంతోనూ చురుగ్గానూ సంతానం ఎదుగుతూ ఉండడం ఆనందదాయకం. తరచూ వచ్చే తలనొప్పిని తేలికగా తీసేయడం సరికాదు. సరైన వైద్యుని వద్దకి వెళ్లి చికిత్సని చేయించుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించండి.

మీ మీద ఎవరైనా న్యాయపరమైన అంశాల్లో అభియోగాన్ని గాని చేసి ఉండినట్లయితే దిగులు పడకండి. వాళ్లు మీకంటూ చేయగల వ్యతిరేకత ఏమీ ఉండనే ఉండదు. కేవలం బెదిరింపు కోసం చేస్తున్న పనే అని ఆలోచించండి. అదృష్టవశాత్తూ వృత్తి ఉద్యోగాల్లో మీకు పని ఒత్తిడులు తగ్గిన కారణంగా ఆనందంగా సమయాన్ని గడపగలుగుతారు. అవకాశముంటే పుణ్యక్షేత్రాలక్కూడా వెళ్లి రాగలుగుతారు కూడా. ధనం విషయంలో చిన్న పేచీ ఏర్పడి మిత్రుల మధ్య ఓ మాటా మాటా రావచ్చు. నిర్భయంగానూ ధర్మబద్ధంగానూ ఆ విషయాన్ని వివరించి పరిష్కరించుకోండి తప్ప విషయాన్ని నాన్చకండి. అన్నిటికీ మించి మరో వ్యక్తి వద్దకి ఈ అంశాన్ని వెళ్లనీయకండి. మధ్యవర్తి వ్యవహారానికి సుతరామూ అంగీకరించకండి. మీరుగాని ధర్మబద్ధంగానే ఉంటే విషయం తేలికగా ముడి వీడిపోతుంది. 

లౌకిక పరిహారం: చంచల నిర్ణయాలు వద్దు. స్థిరాభిప్రాయాల మీదే ఉండండి. 
అలౌకిక పరిహారం: శివాభిషేకం చేయించుకోండి. 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)

భారతంలో ధర్మరాజు తనకేదైనా ఓ సమస్య ఎదురైనప్పుడు కేవలం తనలోనే ఆలోచించేసుకుని అమలు చేసేసి ఆ మీదట తన తమ్ముళ్లకీ ద్రౌపదికీ చెప్పేవాడు కాదు. ముందుకి ముందే అందరి మధ్యా ఆ సమస్యని ఉంచేవాడు. వాళ్లు తన అభిప్రాయానికి పూర్తి విరుద్ధాభిప్రాయాన్నిస్తున్నా మౌనంగా వింటూండేవాడే తప్ప వెంటనే ప్రతిస్పందిస్తూ ఖండిస్తూండేవాడు కాడు. ఇదంతా ఎందుకంటే ఈ వారంలో ఓ ముఖ్యమైన సందర్భం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మీ సోదర (సోదరీలు కూడా) గణంతో రావలసి ఉంది. ఆ సందర్భంలో మీ అభిప్రాయాన్నే అందరూ ఆమోదించేలా ఒత్తిడి చేసెయ్యకండి. సంతానం నిమిత్తం తగిన చికిత్సలని మీరు చేయించుకోవడం గాని మీ దంపతి పుణ్యక్షేత్ర పర్యటన చేయడం గాని జరగవచ్చు. అయినా అనుకూల కాలం కాబట్టి ధైర్యంగా ఉండండి.

వివాహం సంతానం వంటివన్నీ వాటికంటూ నిర్ణయింపబడిన కాలాల్లో (సకాలం అంటే అదే) జరిగిన పక్షంలో చిక్కులుండవు గాని చదువులూ ఉద్యోగాలూ హోదాలూ పెళ్లికి ముందే అన్ని సౌకర్యాల ఏర్పాట్లూ అనుకుంటూ ఉండడం వల్ల కలిగిన చిక్కులే ఇవన్నీ. ఈ సమస్య మీ ఒక్కరిదే కాదని గమనించి ఊరడిల్లండి. లోకంలో అందరికీ అన్నీ నచ్చి తీరాలనే నియమమేమీ లేదు. అలాంటి వ్యతిరేక భావం ఏదైనా మీ మనసులో మెదిలితే, దాన్ని వ్యక్తీకరించవలసి వస్తే తీవ్రమైన కఠినమైన భావప్రదర్శనం పదప్రయోగం లేకుండా చెప్పడం– ముఖ్యంగా మీకు మరింత అవసరం. కొంతమంది నలుగురిలో కూర్చున్నప్పుడు పరోక్షంగా మీ గురించే మాట్లాడుతూ వ్యంగ్యంగా మిమ్మల్ని దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉండవచ్చు. మీ పేరు వాచ్యంగా ప్రస్తావించనంత వరకూ మీరు పట్టించుకోకండి. మీ పేరెత్తే ధైర్యం వాళ్లకి లేదని అందరికీ తెలుసుగా!

లౌకిక పరిహారం: అనుకూల కాలమే. ప్రశాంతతకి ప్రాధాన్యాన్నియ్యండి. 
అలౌకిక పరిహారం: సుబ్రహ్మణ్య స్తుతి ఉత్తమం. 

కుంభం(జనవరి 20 – ఫిబ్రవరి 18) మీరు చూపిన కృషీ పట్టుదలా అనేవే మీకు విజయాన్ని ఇచ్చి తీరుతాయి. ఆ కారణంగానే మీరనుకున్న ఉద్యోగం మీకు సొంతం కాగలుగుతుంది. అంతేగాక మీ సంతానానికి కూడా మంచి కళాశాలలో మంచి చదువులో ప్రవేశం లభిస్తుంది. మంచీ చెడూ అనేది మీకనవసరం. ఎవరితోనూ ఏ తీరుగానూ విభేదించకండి. అజాతశత్రువులా వ్యవహరించడం అవసరం తాత్కాలికంగా. ‘భవంతి పుణ్యాని పురాకృతాని’ అని సంస్కృతంలో ఓ సూక్తి. మనం ఏ పూజలనీ పురస్కారాలనీ అర్చనలనీ హోమాలనీ అభిషేకాలనీ.. ఇలా వేటినీ చేయలేదు కదా ఎందుకు ఈ మంచి జరిగిందనే ఆలోచన మనకొస్తుంది. ఎప్పుడో మనం ఒకరికి హృదయపూర్వకంగా చేసిన ఆ సహాయమే ఈ రోజు మన పాలిట పుణ్యంగా మారి ఆ పుణ్యఫలమే మనకీ సహాయాన్ని చేసిందని చెప్పడం పై సూక్తికర్థం.

అవకాశమున్నంతలో మరొకరి ప్రమేయం లేకుండా చేయగలిగినంతలో యథాశక్తి అలా సహాయపడడం ఎంతైనా పుణ్యప్రదం. అలాగని మీ సమయాన్ని వ్యర్థపరచుకుంటూ చేయకూడదు. తన్ను మాలిన ధర్మం సరికాదని సూక్తి. ఎప్పటినుండో కొందాం కొందామనుకుంటున్న స్థిరమైన ఆస్తికి ఉన్న అన్ని చిక్కులూ ఇబ్బందులూ క్రమంగా తొలగిపోవడమే కాక, అది మీకు మాత్రమే అమ్మదలచడం, మీరు కాదన్న పక్షంలో మరొకరికి చూపించడం జరుగుతుంది కాబట్టి కాళ్ల దగ్గరకొచ్చిన బేరాన్ని ఓ వంద అటో ఇటో తేల్చేసుకుని కొనేసుకోండి. సంతానం ఇప్పుడే ఆదాయాలలో పడుతూ కన్పించవచ్చు. ఆదాయం వ్యయం అనేది ఏ తీరుగా ఏ వయసులో ఉండాలో ఆ మార్గదర్శక సూత్రాల్ని తెలియజేయండి. బలవంతపెట్టకండి. సంతానం అనుకూలురే కాబట్టి మీకు ఆ దిగుల్లేదు. 

లౌకిక పరిహారం: ఎవరితోనూ ఏ తీరుగానూ విభేదించడం సరికాదు. 
అలౌకిక పరిహారం: శ్రీ రామరక్షాస్తోత్ర పఠనం ఉత్తమం. 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)

ఏ సమయంలో ఏ తీరు ఆలోచనని చేయాల్సి ఉంటుందో అలాంటి ఉపాయం ఆలోచనగా మీకు తడుతూ హృదయం సంతోషకరంగా ఉంటుంది. వ్యాధి సోకిన భాగాన్ని వైద్యుడెలా శస్త్రచికిత్స చేసి తొలగించి మిగిలిన శరీరాన్ని రక్షిస్తాడో అదే తీరుగా అనవసరమైన మెలికలతో వ్యాజ్యాలతో అభిప్రాయ భేదాలతో చిక్కులతో ఉన్న ఆస్తిని మీకు మీరే విడిచేసిన కారణంగా జీవితమంతా ఆనందంగానూ ఆందోళన లేకుండానూ గడపగలుగుతారు. వీలైతే మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఓ మంచి వినోద విహార విలాస యాత్రకి వెళ్లి వస్తే అందరికీ ప్రశాంతమనిపించవచ్చు. ఎన్నో రోజులు కానక్కర్లేదు. ఓ చిన్న ఆటవిడుపు అయితే చాలు. అందరికీ సంతోషమే అవుతుంది. పెద్దల్ని తీర్థయాత్రకి పంపడమనేది మంచి ఆలోచనయే కావచ్చునేమో కాని వాళ్లతో పాటు మరొక వ్యక్తి తప్పక అనుసరించి వెళ్లవలసిందేననే నియమాన్ని దృఢంగా పాటించండి.

ఈ ఒక్కరి వ్యయాన్నీ గురించి ఆలోచిస్తే అనవసరమైన ఇబ్బందులు ఎదురుకావచ్చు. పెద్దలైన ఎవరు ఎవరికి దేన్ని ఈయదలిచినా అది సరి సమానంగానే ఈయబడుతోందా? అని ఆలోచించండి గాని, ఒకప్పటి రోజుల్లోలాగా ఒకరి మీద అభిమానాతిశయం కారణంగా ఏ చిన్నమంత బంగారాన్ని ఎక్కువిచ్చినా, దాన్ని తీసుకున్న అతను/ ఆమె శాశ్వతంగా అందరికీ పగ అయ్యే అవకాశముంది. ఇది కలియుగ ధర్మశాస్త్ర నీతి. మీరు గనుక ఉద్యోగస్థులై ఉండి ఉంటే, మీ పైఅధికారి మీతో విభేదిస్తూ ఉంటే మీరూ విరోధానికి దిగకండి. ఏది నియమాల ప్రకారం సరి అయిన తీరో దాని ప్రకారమే చేయడం సరైనదనే విషయాన్ని చెప్పండి. అధర్మ–అన్యాయ విధానాలకి ఏ పరిస్థితుల్లోనూ కొమ్ము కాయకండి. మీ గట్టిదనం కారణంగానే అతడు తోవలోకి వస్తాడు. అయితే దీన్ని ప్రచారం చేయకండి.

లౌకిక పరిహారం: స్థిరమైన ఆస్తిని చేజార్చుకోకండి.
అలౌకిక పరిహారం: నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయండి. 

డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు
జ్యోతిష్య పండితులు

Tags