ఫెడ్‌ చైర్మన్‌గా జెరోమ్‌ పావెల్‌

4 Nov, 2017 00:18 IST

వాషింగ్టన్‌: అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తదుపరి చైర్మన్‌గా జెరోమ్‌ పావెల్‌ (64) పేరును అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. తన సమర్ధవంతమైన నాయకత్వంతో పావెల్‌ గట్టెక్కించగలరని ట్రంప్‌ దీమా వ్యక్తం చేశారు. ‘ఆయన ఎంతో నిబద్ధత గలవారు. ఫెడరల్‌ రిజర్వ్‌కి రాబోయే సంవత్సరాల్లో అవసరమైన నాయకత్వాన్ని అందించగలరు‘ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

సెనేట్‌ కూడా ఆమోదముద్ర వేస్తే... అమెరికా ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసే ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌గా ఆయన కీలక బాధ్యతలు చేపడతారని, తన సామర్థ్యాలు, అనుభవంతో పదవికి వన్నె తేగలరని ట్రంప్‌ చెప్పారు. ప్రస్తుత చైర్మన్‌ జానెట్‌ యెలెన్‌ని తాను గౌరవిస్తానని ట్రంప్‌ పేర్కొన్నారు.  ఎకానమీకి, కోట్ల కొద్దీ అమెరికన్ల ఆర్థిక భవితకు దిశా నిర్దేశం చేసే ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ పదవిని.. అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యంత శక్తిమంతమైన హోదాగా పరిగణిస్తారు.

కోటీశ్వరుడు పావెల్‌...: రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పావెల్‌ కోటీశ్వరుడు. 2012 నుంచి ఫెడరల్‌ రిజర్వ్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. కీలక వడ్డీ రేట్లను క్రమంగా పెంచడం, 2008–2009 నాటి మాంద్యం సమయంలో ఫెడ్‌ కొనుగోలు చేసిన అసెట్స్‌ను విక్రయించడం తదితర అంశాల్లో ప్రస్తుత చైర్మన్‌ యెలెన్‌ విధానాలకు అనుగుణంగానే ఓటింగ్‌ చేస్తూ వచ్చారు.

దీంతో.. తన హయాంలోనూ ఆయన ఇదే ద్రవ్యపరపతి విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.   ప్రస్తుత ఫెడ్‌ చైర్మన్‌ జానెట్‌ యెలెన్‌ పదవీకాలం ఫిబ్రవరితో ముగియనుంది.  ఫెడ్‌ చైర్మన్‌గా ఉన్న వారిని రెండో దఫా కొనసాగనివ్వకపోవడం గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి కానుంది.

Tags