రవితేజకు 5 వికెట్లు

4 Nov, 2017 00:36 IST

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం శ్రమి స్తున్న హైదరాబాద్‌ జట్టు అందుకు తగ్గ వేదికను సిద్ధం చేసుకుంది. రైల్వేస్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో మూడో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన రైల్వేస్‌ 246 పరుగులకే ఆలౌటైంది. అనురీత్‌ సింగ్‌ (60) అర్ధ సెంచరీ మినహా మిగతావారంతా విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌తోనే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్‌ తెలుకుపల్లి రవితేజ 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. మెహదీ హసన్, ఆకాశ్‌ భండారి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్‌ కెప్టెన్‌ రాయుడు రైల్వేస్‌కు ఫాల్‌ఆన్‌ ఇచ్చాడు. దాంతో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్‌ ఆట ముగిసే సరికి వికెట్‌ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు మరో 215 పరుగులు వెనుకబడి ఉంది.   

Tags