పురుగులు పట్రా...

4 Oct, 2017 08:58 IST

ప్లేట్లో బొద్దింకను వేసి బిల్లెగ్గొట్టే సినిమాలు మనం చాలా చూశాం. హీరోలు, కమెడియన్లు చాలామంది ఈ ట్రిక్‌ ప్లే చేసినవాళ్లే. అసలు ప్లేట్‌లో పురుగు కనిపించగానే దానిని ఫొటో తీసి వాట్సప్‌ చేసి నానా హంగామాతో ఆ రెస్టారెంట్‌ని మూయించే దాకా ఊరుకోం.

ధాయ్‌లాండ్‌లో  మీ పురుగులు వేగవు
ఇక్కడ ప్లేట్‌లో పురుగులు ఉండటమే వంటకాలుగా స్టార్‌ హోటల్స్‌లో ప్రత్యేకమైన ఫుడ్‌ వింగ్స్‌ ఏర్పడుతున్నాయి. జనం ఫోర్కులతో గుచ్చి వాటిని తింటున్నారు. పంటి కింద పటక్కున కొరుకుతున్నారు. కరకరలాడిస్తున్నారు.మన దగ్గర ‘ఉసుళ్లు’ వంటి వాటిని తినే అలవాటు అప్పుడూ ఉంది ఇప్పుడూ ఉంది. చత్తిస్‌గడ్‌ వంటి ప్రాంతాల్లో కొన్ని రకాల చీమలను, చిమటలను కూడా తింటారు. అలాగే ధాయ్‌లాండ్‌ గ్రామ సీమల్లో కొన్ని రకాల పురుగులను ముఖ్యంగా నీటి పురుగులను తినడం ఆనవాయితీగా ఉంది. అయితే ఇంత కాలం ఇవి స్టార్‌ హోటల్స్‌ మెనూలలో చేరలేదు. తాజాగా ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్‌లలో పురుగులను సర్వ్‌ చేయడానికి పరుగులు మొదలయ్యాయి. ఈ పురుగుల్లో మన శరీరానికి కావలసిన ప్రొటీన్‌ సమృద్ధిగా ఉండటమే ఇందుకు కారణం.

‘రాబోయే వందేళ్లలో మానవజాతికి కావలసినంత ప్రొటీన్‌ ప్రస్తుతం ఉన్న ఆహార మాధ్యమాలు ఇవ్వలేవు. మనం ప్రత్యామ్నాయ ఆహారం వైపు తినదగ్గ పురుగూ పుట్రా వైపు చూపు సారించాల్సి ఉంటుంది’ అని థాయ్‌కి చెందిన ఒక స్టార్‌ చెఫ్‌ వాఖ్యానించాడు. భవిష్యత్‌ రోజులలో సముద్ర నాచుతో చేసే వంటకాలు స్టార్‌ హోటళ్లలో దర్శనమియ్యక తప్పని పరిస్థితి వస్తుందని కూడా అతడు జోస్యం చెప్పాడు.ఇప్పటికే జపాన్‌ వంటి దేశాలలో సముద్రనాచుతో చేసే గంజి వంటి పదార్థాన్ని బాగా తీసుకుంటూ ఉంటారు. మన దగ్గర కూడా ఇది త్వరలో ప్రవేశించవచ్చు. కొత్త రకం కూరగాయలు, కొత్తరకం మాంస ఉత్పత్తులు మనిషి కనిపెట్టలేకపోయినప్పుడు ఇంతవరకూ తినడానికి ప్రయత్నించని జీవాంశలపై చూపు సారించాల్సి ఉంటుంది.

కాకపోతే తేడా అల్లా ఇంత వరకూ ఈ మార్కెట్‌ గ్రామ సీమల్లో రోడ్డు పక్కన స్టాల్స్‌ నడిపే పల్లీయుల చేతుల్లో ఉంటే రాను రాను అదంతా కార్పొరెట్‌ రంగాల చేతుల్లోకి వెళ్లబోనుండటం. ఇంతకు మునుపు ఎడ్ల బండ్ల మీద దొరికే ఉప్పు ఇప్పుడు టాటా వాళ్ల పాలిథిన్‌ కవర్లలో దొరికినట్టే ఉసుళ్లు, పుట్టగొడుగులు, మెత్తాళ్లు, రొయ్యపొట్టు వంటివి కూడా భవిష్యత్తులో కార్పొరెట్‌వాళ్లు కవర్‌లో పెట్టి ఇస్తే తప్ప దొరకని రోజులు వస్తాయనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు.

Tags