21వేల కిమీ, 14 దేశాల మీదుగా...

3 Oct, 2017 16:34 IST

సాక్షి,అహ్మదాబాద్‌: 14 దేశాల మీదుగా...21వేల కిలోమీటర్లు...ఒంటెలు, బస్సులు, ట్యాక్సీలు...ట్రైన్‌లు ఇది ఓ గుజరాతీ యువకుడి సాహస ప్రయాణం. లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ద్రుపద్‌ మిస్త్రీ వండర్‌ జర్నీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డిజైన్‌ కన్సల్టెంట్‌గా లండన్‌లో ఉన్న ద్రుపద్‌ భారత్‌లో సెటిలవ్వాలని భావించాడు. అయితే ఈ ప్రయాణం మరుపురానిదిగా, సాహసవంతంగా ఉంటేనే కిక్కిస్తుందని నిర్ణయించుకున్నారు. తన ప్రయాణం కోసం ప్రజారవాణానే ఆశ్రయించాలని తీర్మానించుకున్నారు. ఇద్దరు స్నేహితులు రౌల్‌, వనెటియాలతో కలిసి తన జర్నీ స్టార్ట్‌ చేశాడు. ఆరోగ్య కారణాలతో స్నేహితుల్లో ఒకరు మార్గమధ్యంలో తప్పుకున్నారు. ఇక మే 25న వీసాలు, రైలు టిక్కెట్లతో ఈ ముగ్గురు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి 14 దేశాల మీదుగా 21 వేల కిలోమీటర్లను కేవలం ప్రజా రవాణా ద్వారానే దాటి వచ్చారు.

డిజైనర్‌ తన ఆలోచనా దృక్పథాన్నివిస్తృతం చేసుకునేందుకు వివిధ దేశాల మీదుగా ప్రయాణించడం అవసరమని తన వినూత్న ప్రయాణాన్ని వివరిస్తూ మిస్ర్తీ చెబుతారు. ఏ దేశం మిమ్నల్ని ఎక్కువగా ఆకట్టుకుందని అంటే సెర్బియాలోని బైకాల్‌ సరస్స అందాలు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు.తమ ప్రయాణంలో భిన్నమైన వ్యక్తులు కలిసినా టిబెటన్లను తాను ఎక్కువగా ఇష్టపడ్డానన్నారు. తమ యాత్రలో భాగంగా స్ధానికులతో కలిసి పలు జుగల్‌బందీలో తాము పాలుపంచుకున్నామని, తామంతా సంగీత ప్రియులమని చెప్పారు. తాను శరద్‌ ప్లేయర్‌ను కాగా, రౌల్‌ ఫ్లూటిస్ట్‌ అని తమ అభిరుచులు పంచుకున్నారు మిస్త్రీ.

 తమ ప్రయాణమంతా సాఫీగా సాగలేదని మంగోలియా-చైనా సరిహద్దు దాటే క్రమంలో చైనా అధికారులు తమను అడ్డుకుని ప్రశ్నించారని గుర్తుచేసుకున్నారు. డోక్లాం అంశంపై భారత్‌,చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ఇది చోటుచేసుకుందని చెప్పారు.బోర్డర్‌ దాటే వారంతా స్ధానికులు కావడం, తాను భారత్‌ పాస్‌పోర్ట్‌ కలిగిఉండటంతో చైనా అధికారులు తనను ఓ గదిలోకి తీసుకెళ్లి 20 నిమిషాలు కూర్చోపెట్టారని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని, తన లగేజ్‌ను స్కాన్‌ చేశారని తెలిపారు. 30 నిమిషాల ఇంటరాగేషన్‌ అనంతరం వారు తమతో సెల్ఫీలు తీసుకుని ముందుకు వెళ్లేందుకు అనుమతించారని చెప్పారు.

ఇక భారత్‌లో అడుగుపెట్టే ముందు టిబెట్‌ మిస్త్రీ బృందం ఆఖరి మజిలీ. టిబెట్‌లో విదేశీ టూరిస్ట్‌లపై చైనా పలు ఆంక్షలు విధించింది. టూరిస్టులు స్ధానికులతో రాజకీయాలు మాట్లాడటానికి అనుమతించారు. ప్రజా రవాణాను ఉపయోగించడానికి వీల్లేదు.ప్రజా రవాణాకు వాడే వాహనాల్లో కెమెరాలు అమరుస్తారు. ఇక ఒకప్పుడు సుందర ప్రశాంత టిబెట్‌లో ఇప్పుడు ట్రాఫిక్‌ జామ్‌లు నెలకొన్నాయని తన అనుభవాలను మిస్త్రీ గుర్తుచేసుకున్నారు.ఇ‍క 40 రోజుల సాహస యాత్ర అనంతరం తన సొం‍త పట్టణం ఉదయ్‌పూర్‌కు చేరుకున్న మిస్త్రీకి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సాదర స్వాగతం పలికారు.

Tags