Breaking News

ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!

Published on Thu, 09/01/2022 - 11:12

మనుషుల మధ్య అంతరాలను పెంచుతున్నప్పుడు అందరం కలిసి మానవీయ సమాజాన్ని కాపాడు కోవాలి. ఏకమైతేనే నిలుస్తామన్న సత్యానికి అల్లుకుపోవాలి. విడి విడిగా విడిపోతే మనకు మనంగా కృంగిపోతాం. సామూహిక తత్వం నశించిపోయిన వ్యవస్థ గడ్డకట్టుకు పోతుంది. కరోనా కాలంలో మాస్క్‌నే భరించలేని వాళ్ళం మనుషుల మధ్య దూరాలను పెంచుకొని ఎట్లా బతుకుతాం! మనుషులుగా మనం ఎడం ఎడంగా, ఎడమొఖం పెడమొఖంగా, గోడకు కొట్టిన మేకుల్లాగా విడిపోయి ఎట్లా జీవించగలం!

వేష భాషలు ఎన్ని ఉన్నా, ఈ ప్రపంచానికి మహా బోధితత్వపు సంఘజీవన భాష ఉంది. మనిషిని మనిషి ద్వేషించుకునే విద్వేష భావజాలం చాలా ప్రమాద కరమైనది. విభిన్న తత్వాల కలయికగా ఉన్న దేశ ప్రజలు... ద్వేషరూపులుగా మారితే మిగిలేది బూడిదే కదా! నువ్వూ నేను, వాడు వీడు, అతను ఆమె ... అందరం పిల్లల మనసులపై కుల విభజన రేఖలు, మతం పచ్చ బొట్లు పొడిస్తే సమతుల్యత అల్ల కల్లోలమై సమాజం గందరంగోళం కాదా? 

దేన్నైనా భరిస్తాం. దేన్నైనా సహిస్తాం. మన ఇంటి వెనుక, ఇంటి ముందు ఎవరికి వాళ్లుగా కలువలేని గోడలను కట్టుకుంటే మనందరం బావిలో కప్పలుగా మారిపోతాం. ఇట్లే ఎవరి కులం వారిదనీ, ఎవరి మతం వారిదనీ; రంగు, రూపు, ఊరు, వాడ పేర్లతో విభజన రేఖలు గీసుకుంటూ పోతే ఆటవిక సమాజ మూలాల దగ్గరకు పోతాం. వేల సంవత్సరాల సాంస్కృతిక మానవ పరిణామ క్రమాన్నీ, మన ఐకమత్య సమాజ ఉన్నత తత్వాన్నీ... విభేదాల, విద్వేషాల పేరుతో మనకు మనమే కూల్చుకుంటూ పోతే చివరకు మిగిలేదేమిటి?

మానవ సంబంధాల వనంలో మానవీయ ప్రేమ మొక్కలు నాటటానికి మారుగా విద్వేషపు మొక్కలు నాటితే దేశమే విద్వేషాల కుంపటిగా మారుతుంది. సమస్త వృత్తుల, సకల కులాల, మతాల ఐక్యమత్య సమాజాన్ని విభజించి చూడగలమా? హుస్సేన్‌ సాగర్‌ కీవల ఆవల, గండిపేటకు అటువైపు ఇటువైపు, చార్మినార్‌కు ముందు వెనక బెర్రలు గీసి.. మసీదుకు, మందిరానికి భేదాలు పెట్టి; చర్చిలకు, గుళ్లకు పోటీలు పెట్టి చూసే దుస్థితిని ఊహల దరిదాపులకు సైతం రానివ్వలేం కదా! గుడి, మసీదు, చర్చి అన్నీ ఒకటే. నమ్మకాలు, విశ్వాసాలన్నీ ఎవరి మదిలో వాళ్ళం భద్రంగా గుండె గుండెల్లో దాచు కుందాం. ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. ఎవరి వేషధారణలు వారివి. ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి భాషలు వారివి. దేవుళ్ళందరూ ఒకటే. మనుషులందరూ సమానమేనన్న సర్వమత సమానత్వ లౌకికతత్వం మన దేశానికి ప్రాణవాయువు. దాన్ని రక్షించుకుందాం. పరిరక్షించుకుందాం. పరమత సహనం పవిత్ర జెండాగా, మనందరి సామూహిక లక్ష్యంగా, ధ్యేయంగా ముందుకు సాగుదాం.

కలలో కూడా మన మానవీయ సమాజ గూడుపై ఎవరు చెయ్యేసినా వదిలేది లేదు. ‘గంగా జమునా తెహాజీబ్‌’ అని గొప్పగా కీర్తించబడ్డ ఈ నేల మీద మత ముద్రల విభజనలను గీస్తే సహిస్తామా? ఐకమత్య దారులపైనే అభివృద్ధి సగర్వంగా నడుచుకుంటూ పోతుంది. మనందరం ఐకమత్య సమాజానికి చిహ్నాలుగా నిలవాలి. సోదరభావంతో ఎదగాలి. అందర్నీ ఆదరించి అక్కున చేర్చుకునే హైదరాబాద్‌ మహాసంస్కృతి ఇంకో వేయ్యేళ్లు వర్ధిల్లే విధంగా మనందరం మానవీయ మహా మొక్కల్ని ఎద ఎదలో నాటడాన్ని ఒక మహోద్యమంగా చేపడదాం. విభిన్న సంస్కృతుల సంగమ స్థలిని విష సంస్కృతుల కూడలిగా మార్చే కుట్రలను తిప్పికొడదాం. 

తెలంగాణ అంటే కలిసి జీవించే ఆత్మీయతల అలయ్‌   బలాయ్‌ సంస్కృతి. సబ్బండ వర్ణాల ఐక్య సంస్కృతే తెలంగాణ అసలు అస్తిత్వం. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని చెదరగొట్టే కుట్రలు ఎవరు చేసినా వారిని తెలంగాణ సమాజం విడిచిపెట్టదని గుర్తుపెట్టుకోవాలి.

తెగించి తెలంగాణను బెర్రగీసి తెచ్చుకున్నోళ్లం సమాజాన్ని ఛిద్రంచేసే మత దురహంకారాన్ని తిప్పికొట్టి తీరాలి. విచ్ఛిన్నకర మత, కుల ఆధిపత్య కుట్రలను చూసి తెలంగాణ విలపిస్తోంది. సమూహాల, గుంపుల తలలు లెక్కలు కట్టుకొని; పోటీపెట్టి, విద్వేషాల్ని రెచ్చగొడుతున్న విచ్ఛిన్నకర శక్తుల్ని చూసి తెలంగాణ తల్లడిల్లుతోంది. సబ్బండ వర్ణాల సంస్కృతిని పరిరక్షించుకోవటానికి తెలంగాణలో జరగాల్సిందేమిటో అభ్యుదయ తెలంగాణ సమాజమే నిర్ణయించుకుని ముందుకు సాగుతది. 

అలసత్వం వద్దు. చూద్దాంలే చూసుకుంటూ కాసేపా గుదాం అనుకోవద్దు. నాకెందుకులే, మనకెందుకులే, నాదాకా వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే అందరూ అయిపోయినాక ఆ మతభూతం చివరివానిగా నిన్ను కూడా వదిలిపెట్టదు. విషవాయువులు వ్యాపించిన ప్రాంతమంతా విషకోరల బారిన పడకతప్పదు. అందులో ఎవరికీ మినహాయింపు ఉండదని గుర్తు పెట్టుకోవాలి. కన్నీళ్లను తుడుచుకుని, ఇప్పటిదాకా పడ్డ కష్టాల పట్టె నుంచి బైట పడుతూ, నెర్రలు బాసిన నేలల్లో పచ్చటి పంటలను చూసి పరవశిస్తూ ముందుకు సాగుతోంది తెలంగాణ. కలహాల చిచ్చులు పెడ్తున్న  కుట్రపూరిత రాజకీయ మత పిచ్చిగాళ్ల నుంచి తక్షణం ఈ నేలను రక్షించుకోవాలి. తెలంగాణను కలహాల రణస్థలంగా మార్చే వారిని గుర్తుపట్టాలి. ఆదర్శాలకు అగ్గి పెట్టేవాళ్ల నుంచి తెలంగాణను కాపాడుకోవాలే! (క్లిక్‌: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!)

‘మనిషిని ద్వేషించడానికి సరిపడా మతం వుంది మనకు. ప్రేమించడానికి కావలసినంత మతం లేదు’ అన్నాడు జోనాథన్‌ స్విఫ్ట్‌. అంటే మనుషులు మను షులుగా బతకడానికి ఇప్పుడున్న మతం సరిపోదు. కాస్త ప్రేమను అరువు తెచ్చుకోవాలి. మనిషిని మనిషితో కలిపి కుట్టే కన్నీటి దారం పేరు ప్రేమ. మనిషిని మనిషితో కలిపి బంధించే ఆనంద ఉద్వేగం పేరు ప్రేమ. ఇప్పుడు మరింత ప్రేమ కావాలి! మరింత సహనం కావాలి!! (క్లిక్‌: ఇంగ్లిష్‌ వెలుగులు చెదరనివ్వొద్దు)


- జూలూరు గౌరీశంకర్‌ 
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు

Videos

విచారణ పేరుతో గోవిందప్ప కుటుంబంపై సిట్ వేధింపులు

అబద్ధపు వాంగ్మూలాలతో లేని మద్యం కేసు.. బాబు కుట్ర రాజకీయాలు

మద్యం కేసులో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబు భేతాళ కథలు

మురళి నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని హర్షం

PM Modi: వచ్చేది వినాశనమే పాక్ కు నిద్ర పట్టనివ్వను

YSRCP మహిళా విభాగం రాష్ట్రస్థాయి సమావేశం

పాక్ కు కోలుకోలేని దెబ్బ, బలోచిస్తాన్‌కు భారత్ సపోర్ట్ ?

Ambati: అర్ధరాత్రి ఒక మహిళపై పోలీసులే దాడి.. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?

Photos

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?

+5

విజయవాడ : అన్నమాచార్యులు జయంతి సందర్భంగా.. నృత్య సమ్మోహనం (ఫొటోలు)

+5

Miss World 2025: నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)