Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
Breaking News
నష్టాల్లోంచి లాభాల్లోకి..
Published on Wed, 11/12/2025 - 02:23
ముంబై: ట్రేడింగ్ ఆరంభ నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం లాభపడ్డాయి. అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 336 పాయింట్లు పెరిగి 83,871 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్లు బలపడి 25,695 వద్ద నిలిచింది. ఢిల్లీలో పేలుడు ఘటన ఆందోళనలతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి.
వీక్లీ ఎక్స్‌పైరీ రోజు కావడంతో మరింత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 411 పాయింట్లు కోల్పోయి 83,124 వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు పతనమై 25,449 వద్ద కనిష్టాన్ని తాకాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు, దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో కనిష్ట స్థాయిల వద్ద కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకోవడమే కాకుండా.. అరశాతం లాభంతో ట్రేడింగ్‌ను ముగించాయి. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ముగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలపడంతో ఆసియాలో కొరియా, హాంగ్‌కాంగ్, జపాన్ సూచీ లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1% పెరిగాయి. లాభాల స్వీకరణతో అమెరికా స్టాక్ సూచీలు అరశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.
⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలపడి 88.50 వద్ద స్థిరపడింది. అమెరికా–భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు, యూఎస్ ప్రభుత్వం షట్‌డౌన్ ముగింపు అంశాలు దేశీయ కరెన్సీ ర్యాలీకి దన్నుగా నిలిచాయి.
⇒ బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో సర్విసెస్ 1.6%, టెలికం 1.59%, ఐటీ 1.21% రాణించాయి.
Tags : 1