Viral Video: సగం తిన్న యాపిల్ ను జనాల్లోకి విసరిన డీకే శివకుమార్
Breaking News
యుద్ధభూమిలో... జెండర్ పోరాటం
Published on Tue, 06/09/2026 - 06:23
భారత సైన్యంలో తొలి మహిళా యుద్ధ హెలికాప్టర్ పైలట్‌గా చరిత్ర సృష్టించిన అభిలాష బరాక్ తాజాగా... ప్రతిష్ఠాత్మకమైన ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డ్ అందుకున్నారు. లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి దళంలో ఫిమేల్ ఎంగేజ్‌మెంట్ టీమ్ కమాండర్‌గా భారత బెటాలియన్‌లో పనిచేస్తున్నారు అభిలాష. లెబనాన్‌లో సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో లింగసమానత్వాన్ని పెంపొందించడానికి, మహిళలకు అండగా నిలవడంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
యునైటెడ్ నేషన్స్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్‌లో పనిచేస్తున్న మేజర్ బరాక్, దక్షిణ లెబనాన్‌లోని భారతీయ బెటాలియన్‌లో ఎంగేజ్‌మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్‌గా సేవలందిస్తున్నారు. గత సంవత్సరం జూన్‌లో ఈ మిషన్‌లో చేరినప్పటి నుంచి స్థానిక ప్రజలతో సన్నిహితంగా ఉంటూ మహిళలు, బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. వేలాది మంది మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.
ఐరాస ప్రశంసలు
ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో మహిళలతో కూడిన గస్తీ బృందాలకు నాయకత్వం వహించారు అభిలాష. ‘లెబనాన్ జెండర్ ఇనిషియేటివ్’ ఆమె విజయాలలో ఒకటి.‘లెబనాన్ జెండర్ ఇనిషియేటివ్’ అనేది ఏఐ–బేస్డ్ ప్లాట్‌ఫామ్. లింగ–ఆధారిత హింసను గోప్యంగా నివేదించడానికి, సహాయసేవలు, ఆత్మరక్షణ సమాచారాన్ని పొందడానికి పిల్లలకు సాయపడే వేదిక.
శాశ్వత శాంతి వైపుగా...
ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ) కార్యక్రమం కింద దక్షిణ లెబనానుకు చెందిన 75 మంది మహిళలకు స్కాలర్‌షిప్‌లు ఇప్పించడంలో సహాయపడ్డారు అభిలాష. ‘ఐటీఈసీ’ అనేది పునరుత్పాదక శక్తి, ఫైనాన్స్ వంటి రంగాలలో శిక్షణ అందించడంలో మహిళలకు సహాయపడుతుంది. శాంతి పరిరక్షకులకు, స్థానిక సమాజాలకు మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయడానికి, మహిళలకు సహాయ సహకారాలు అందించే వ్యవస్థలను మెరుగుపరచడానికి అభిలాష చేసిన కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.
‘శాంతి పరిరక్షక మిషన్‌లను లింగ సమానత్వం అనేది ఎలా బలోపేతం చేయగలదో, శాశ్వత శాంతికి ఎలా దోహద పడగలదో బరాక్ నిరూపించారు’ అని అభిలాషను ప్రశంసించారు ఐక్యరాజ్య సమితి శాంతి కార్యకలాపాల అధిపతి జీన్–పియర్ లాక్రోయిన్స్. శాంతిభద్రతలలో మహిళల భాగస్వామ్యాన్నిప్రోత్సహించే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లే సైనిక శాంతి పరిరక్షకులకు 2016 నుండి యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డ్ ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డ్ అందుకున్న మూడో మహిళా అధికారి మేజర్ అభిలాష.
బాల్యం నుంచే సైనిక క్రమశిక్షణ
హరియాణా రోహ్‌తక్ జిల్లా బాలంద్ గ్రామంలోని సైనిక కుటుంబంలో అభిలాష బరాక్ జన్మించారు. ఆమె తండ్రి కల్నల్ ఎస్.ఓమ్ సింగ్ జమ్మూ అండ్ కశ్మీర్ లైట్ ఇన్‌్రపాంటీలో సేవలందించగా, సోదరుడు ప్రస్తుతం భారతసైన్యంలో పనిచేస్తున్నారు. సైనిక కంటోన్మెంట్‌లో పెరగడం వల్ల అభిలాషలో క్రమశిక్షణ, సేవాభావం, దృఢసంకల్పం లాంటి విలువలు బాల్యంలోనే పాదుకున్నాయి.
దిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో చదువుకున్న అభిలాష బీటెక్ (ఈసీయీ) చేశారు. చదువు పూర్తయిన తరువాత అమెరికాలోని డెలాయిట్‌లో బిజినెస్ టెక్నాలజీ అనలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించారు అభిలాష.
దేశానికి సేవ చేయాలనే సంకల్పం అభిలాషను భారత సాయుధ దళాల పరీక్షలకు సిద్ధమయ్యేలా చేసింది. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బి) ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (వోటీఏ)లో శిక్షణ పొంది సెప్టెంబర్ 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్పస్‌లో కమిషన్ పొందారు.
కఠిన పరీక్షలు జయించి...
భారత సైన్యం 2021లో మహిళా అధికారులకు యుద్ధవిమానయాన రంగం (కంబాట్ ఏవియేషన్)లో ద్వారాలు తెరిచింది. సాయుధ దళాలలో లింగ సమాన్వతం కోసం చేపట్టిన విస్తృత కార్యక్రమాలకు అనుగుణంగా ఈ విధాన మార్పు జరిగింది. కంబాట్ ఏవియేషన్‌లో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మహిళా అధికారులలో అభిలాష బరాక్ ఒకరు.
పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ ఎవల్యుయేషన్స్‌తో సహా... రకరకాల కఠినమైన ఎంపిక ప్రక్రియల తర్వాత కేవలం ఇద్దరు మాత్రమే ఎంపికయ్యారు. అందులో బరాక్ ఒకరు. ప్రీ–ఆర్మీ పైలట్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తన బ్యాచ్‌లో ప్రథమస్థానంలో నిలిచినందుకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఫ్లెడ్జింగ్’ ట్రోఫీని అందుకున్నారు.
Tags : 1