ఎందుకు అంత ఆవేశం.. అసెంబ్లీలో అచ్చైన్నాయుడు ఓవరాక్షన్
Breaking News
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
Published on Fri, 02/20/2026 - 11:29
ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ప్రతివారం తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తూనే ఉంటారు. అందుకు తగ్గట్లే ఆయా భాషల మూవీస్.. డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ యాక్షన్ కామెడీ సినిమా కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. 90స్ కిడ్స్‌కి ఎంతో ఇష్టమైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈకి లోకల్ టచ్ ఇచ్చిన తీసిన చిత్రమే 'చథా పచ్చ'. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
సావియో (అర్జున్ అశోకన్), వెట్రి(రోషన్ మ్యాథ్యూ), థామస్ (ఇషాన్ సౌకత్).. కొచ్చిలో పెరిగిన అన్నదమ్ములు. ఒకే తల్లి కడుపున పుట్టనప్పటికీ కలిసిమెలసి ఉంటారు. వీళ్లు ముగ్గురు.. చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ షో చూస్తూ పెరుగుతారు. వాల్టర్ దగ్గర కుస్తీ కూడా నేర్చుకుంటారు. కానీ థామస్ అలియాస్ లిటిల్.. తల్లితో కలిసి ఢిల్లీ వెళ్లిపోవాల్సి వస్తుంది. సావియో, వెట్రి మాత్రం కొచ్చిలోనే ఉండిపోతారు. కొన్నేళ్ల తర్వాత సోదరులని వెతుక్కుంటూ లిటిల్, సొంతూరికి వస్తాడు. కుస్తీ క్లబ్ మొదలుపెడదామని సావియోకు చెబుతాడు. దీంతో కొంతమందితో కలిసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైల్ ఫైటింగ్ క్లబ్ ప్రారంభిస్తారు. తర్వాత ఏమైంది? జైలు నుంచి వెట్రి బయటకొచ్చాడా? అసలు వాల్టర్ ఎవరు? చెరియన్(వైశాఖ్ నాయర్)తో సావియోకి శత్రుత్వం ఏంటనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ(WWE) షోకి ఇప్పుడు పెద్దగా క్రేజ్ లేదు గానీ 90స్ కిడ్స్‌ని అడిగితే దాని గురించి కథలు కథలుగా చెబుతారు. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు.. స్కూల్‌కి వెళ్లేముందు, వచ్చిన తర్వాత ఈ షోని తెగ చూసేవారు. ఇందులో చూపించిన స్టంట్స్‌ని నిజజీవితంలోనూ చేసి గాయాలపాలయ్యేవారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకుని తీసిన సినిమానే 'చథా పచ్చ'. ఈ టైటిల్‌కి తెలుగులో చావోరేవో(డూ ఆర్ డై) అని అర్థం.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పటివరకు మలయాళంలో కావొచ్చు తెలుగులో కావొచ్చు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో తీసుకున్న నేపథ్యం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కథ పరంగా చూస్తే మాత్రం చాలా సింపుల్. ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ల మధ్య పొరపొచ్చలు. చివరకు కలిసిపోవడం ఇంతే. కానీ దీనికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్ టచ్ ఇవ్వడం ఆసక్తికరంగా అనిపించింది. దాదాపు రెండు గంటల పాటు బాగానే ఎంటర్టైన్ చేసింది.
డబ్బింగ్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ప్రధాన పాత్రల పేర్లు.. తెలుగు ప్రేక్షకులకు సరిగా అర్థం కావు. దీన్ని వదిలిస్తే సినిమా మాత్రం వేరే లెవల్ ఎంటర్టైనింగ్గా ఉంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ టచ్ అని మొత్తం ఫైట్స్ పెట్టేయకుండా ఎమోషన్ కూడా ఎంత కావాలో అంత పెట్టారు. స్టోరీ కూడా చాలా ఆర్గానిక్‌గా వెళ్తుంది. ఎక్కడా కూడా కృత్రిమంగా అనిపించదు. కాకపోతే డబ్బింగ్ పాటలు అస్సలు సెట్ కాలేదు. వాటిని లైట్ తీసుకుని మూవీ చూస్తే మాత్రం బాగుంది.
ఎవరెలా చేశారంటే?
అన్నదమ్ములుగా చేసిన అర్జున్ అశోకన్, ఇషాన్ సౌకత్, రోషన్ మ్యాథ్యూ అద్భుతంగా చేశారు. కలర్‌ఫుల్ డ్రస్‌ల్లో భలే సెట్ అయ్యారు. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేసిన వైశాఖ్ నాయర్ కూడా తనదైన కామెడీ, సీరియస్ యాక్టింగ్‌తో మెప్పించాడు. మిగతా పాత్రలు చేసిన యాక్టర్స్ కూడా తమ వంతు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. అద్వైత్ నాయర్ డైరెక్షన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. యాక్షన్ టచ్ ఉన్న కామెడీ మూవీ చూద్దామనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీపై లుక్కేయండి. ఎలాంటి అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. మీరు 90స్ కిడ్స్ అయితే ఫైట్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
- చందు డొంకాన
Tags : 1