కలలకు రంగులు

Published on Fri, 11/14/2025 - 05:39

పిల్లలూ! ఇవాళ బాలల దినోత్సవం. అంటే చాచా నెహ్రూ పుట్టినరోజు. ఆయన మన దేశానికి మొదటి ప్రధాని. ఆయనకు చిన్నారులంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు ‘బాలల దినోత్సవం’ జరుపుకుంటాం. ‘చిల్డ్రన్స్‌ డే’ సందర్భంగా చాచా నెహ్రూ మెచ్చే పది రకాల థీమ్స్‌తో మీకు నచ్చిన బొమ్మలు గీసి ఇంట్లో, స్కూల్లో పెడితే ఎలా ఉంటుంది? వాటిని మీకు నచ్చిన వారికి బహుమతిగా ఇస్తే చాలా బాగుంటుంది కదా? మరెందుకు ఆలస్యం? వెంటనే బొమ్మలు గీయడం మొదలుపెట్టండి. ఈ 10 థీమ్స్‌ మీకోసమే. 

→ చిన్నారులు–చాచా నెహ్రూ: ఇవాళ్టి బాలల చేతుల్లోనే రేపటి దేశభవిత ఉంటుంది. అందుకే చాచా నెహ్రూ బాలల గురించి ఆలోచించేవారు. తన ప్రతి నిర్ణయం రాబోయే తరాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలుసుకునేవారు. అటువంటి చాచా నెహ్రూ ఇవాళ ఉంటే ఎలా ఉండేది? ఈ కాలం చిన్నారుల్ని చూసి ఆయన ఎలా మురిసిపోయేవారు? వారితో కలిసి ఎలా ఆడిపాడేవారు? ఇవన్నీ ఊహించుకొని ఓ చక్కని బొమ్మ గీయండి. మీరు గీసే ఆ బొమ్మ భవితకు మార్గదర్శకంగా మారి, అందరి మనసుల్లో నిలిచిపోతుంది. 

→ అందరికీ విద్య: మీరందరూ చక్కగా బడికెళ్లి చదువుకుంటారు. ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. మరి మీలాంటి చిన్నారులు చాలామంది బడికి దూరంగా ఉన్నారన్న విషయం తెలుసా? వారంతా రోజు కూలి చేసి పొట్టపోసుకుంటున్నారన్న సంగతి తెలుసా? అలాంటి వారి బాధల్ని మీరు  మీ చిత్రాల్లో చూపండి. వారిని చదువుకు చేరువ చేసే మార్గాలు ఆలోచించమనేలా మెసేజ్‌ ఇవ్వండి.

→ పర్యావరణం ముఖ్యం: పచ్చని చెట్లు, చెంగుచెంగున గెంతే సాధుజంతువులు, సెలయేళ్లు, జలపాతాలు... ఇవన్నీ మీకు ఇష్టం కదా? వాటిని రంగుల్లో చిత్రించడం మీకెంతో సరదా కదా? అయితే అనేక కారణాలతో పర్యావరణం ప్రమాదంలో ఉంది. కాలుష్యం కోరల్లో పడి నలిగిపోతోంది. దీనివల్ల జనం అనేక సమస్యలతో బాధపడుతున్నారు. రానురాను పరిస్థితులు మరింత దారుణమవుతాయి. వాటికి అడ్డుకట్ట వేయడం మీ బాధ్యత కూడా. పర్యావరణాన్ని కాపాడుకుందామనే సందేశంతో బొమ్మ గీసి పెట్టండి. 

→ టెక్నాలజీ– మంచీచెడూ: ప్రస్తుతం అందరికీ టెక్నాలజీ చేరువయ్యింది. ఏఐ రాకతో సరికొత్త టెక్నాలజీకి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి వాడకంపై అందరికీ అవగాహన కావాలి. ఆ టెక్నాలజీని చెడు కోసం కాకుండా మంచి పనుల కోసం వాడేలా మీరు చిత్రాల ద్వారా సందేశం ఇవ్వండి.

→ భిన్నత్వంలో ఏకత్వం: మన దేశం అనేక సంస్కృతులకు, సంప్రదాయాలకు ఆలవాలం. ఒక్కోచోట ఒక్కో భాష, ఒక్కో పద్ధతి... అయినా అందరం ఒకే దేశంగా కలిసి ఉంటున్నాం. దీన్నే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిత్రాలు గీయండి. అన్నీ కలిసిన భారతదేశాన్ని చూపించండి. 

→ కలలు కనండి..సాధించండి: ‘కలలు కనండి.. సాధించండి’ అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం. మీకూ ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి. పెద్దయ్యాక మీరేం అవ్వాలనుకుంటున్నారో ఆలోచించి, ఇప్పుడే ఓ చిత్రం గీయండి. అందులో మీరెలా ఉండబోతున్నారో ఊహించుకోండి. అది మీకు స్ఫూర్తిని ఇస్తుంది.

→ ఆనందాల హరివిల్లు: చిన్నారుల ఆనందమే కుటుంబం ఆనందం కదా? మీరు ఆనందంగా ఉండేందుకు చేసే పనులేమిటి? ఆడుకోవడం, సైకిల్‌ తొక్కడం, టీవీ చూడటం, పాటలు వినడం.. ఇలా అనేక పనులు ఉంటాయి. వాటన్నింటినీ కలిపి బొమ్మలుగా గీయండి. వాటిని చూసినప్పుడల్లా మీకు ఆనందాన్ని అందిస్తాయి. 

→ బాలల హక్కులు: మీది ఈ దేశం. అందరికీ ఉన్నట్టే, ఈ దేశంలో మీకూ హక్కులు ఉన్నాయి. ఆ హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదు. విద్య, వైద్యం, చదువు, ఆహ్లాదకర వాతావరణం.. ఇవన్నీ మీకు దక్కాల్సిన హక్కులు. వాటి గురించి తెలుసుకొని, అవే బొమ్మలుగా గీయండి. వాటి గురించి ఇతరులకు తెలియజెప్పండి. 

→ అంతరిక్ష వికాసం: మన దేశం అంతరిక్ష ప్రయోగాల్లో ముందంజలో ఉంది. మంగళయాన్, చంద్రయాన్‌... అలాగే బాహుబలి శాటిలైట్‌... ఇలా మనం గొప్పగా ప్రగతి సాధిస్తున్నాం. ఇస్రోలో మన సైంటిస్ట్‌లు ఎన్నో ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలో మన దేశ వికాసం ఎలా ఉందో బొమ్మల్లో చూపి క్లాస్‌రూమ్‌లో డిస్‌ప్లే చేయండి.

→ భావిభారత్‌: మరో 20 ఏళ్లలో భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? భారత్‌లో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు ఊహిస్తున్నారు? ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇవన్నీ ఆలోచించి బొమ్మలు గీయండి. వాటిని అందరికీ చూపించండి. భావిభారత్‌ను మీ చిత్రాల్లో చూడటం అందరికీ ముచ్చటగా ఉంటుంది.
 

 

Videos

Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి

Ambati: ధర్మారెడ్డి విచారణపై ABN, TV5 పిచ్చి వార్తలు...

Global Silence: 8 లక్షల మంది బలి

Nidadavolu: టీడీపీ బెల్ట్ షాపుల దందా.. బాటిల్‌పై అదనంగా రూ.30 వసూలు

ReNew సంస్థను రాష్ట్రం నుంచి పంపేసారంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు

విజయవాడలో నడిరోడ్డుపై దారుణహత్య

అంకాలమ్మ గూడూరు గ్రామ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: వైఎస్ అవినాష్

Sudha Madhavi: నన్ను బెదిరించి వీడియో రికార్డు చేశారు..!

తిరుపతిలో ప్రజా ఉద్యమం చూసి బిత్తరపోయిన పోలీసులు

పవన్ కల్యాణ్‌కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్‌.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)

+5

ఫ్రెషర్స్‌ డే పార్టీ.. అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)

+5

భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

SSMB29 లోకేషన్‌కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిథిగా విజయ్‌ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)