Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
Breaking News
పేలుడు ఘటనల్లో సత్య శోధన
Published on Wed, 11/12/2025 - 11:50
ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో నవంబర్ 10న భారీ పేలుడు సంభవించింది. సిగ్నల్ వద్ద నిలిపిన ఐ20 కారు అకస్మాత్తుగా పేలింది. ఈ విస్ఫోటనంతో చుట్టుపక్కల ప్రజలు మరణించడంతోపాటు సమీపంలోని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇటువంటి సంఘటనల్లో అత్యాధునిక ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచ్ఛిన్నమైన సాక్ష్యాలను సేకరించి, వాటిని ఏకం చేయాలి. ఒక సంఘటన ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందో నిర్ణయించడమే కాకుండా కోర్టులో ఫలితాలు నిలబడేలా చూడాలి. ఈ పేలుడు ఘటనతో న్యూదిల్లీలోని అధికార యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఈ విషాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫొరెన్సిక్ ఎక్స్‌పర్ట్‌లు కొన్ని అనుమానిత ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నిజాన్ని వెలికితీసేందుకు ఎక్స్‌పర్ట్‌లు అనుసరించే అత్యాధునిక పద్ధతుల గురించి తెలుసుకుందాం.
ఈ ఘటన జరిగిన అరగంటలోపే ఢిల్లీ ఫోరెన్సిక్ లాబొరేటరీ పేలుడు పదార్థాల విభాగానికి చెందిన నిపుణులు పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమికంగా సంఘటన స్థలం నుంచి అనుమానిక సాక్ష్యాలను పరిశీలించి వాటిని విశ్లేషిస్తారు. సాంప్రదాయ నేరాల మాదిరిగా కాకుండా పేలుళ్లు ప్రత్యేకమైన సవాళ్లను కలిగి ఉంటాయి. తీవ్రమైన ఒత్తిడి, వేడి కారణంగా వస్తువులు బూడిదవుతాయి. దాంతో ఆధారాలు సేకరించడం కష్టమవుతుంది.
ఫోరెన్సిక్ సైన్స్‌లో ‘లోకార్డ్ మార్పిడి సూత్రం’ అని ఉంటుంది. ఇది ప్రతి నేరస్థుడు సంఘటనా స్థలంలో ఏదో ఆధారం వదిలివేసి లేదా ఏదో తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెబుతుంది. పేలుడు గందరగోళంలో ఒత్తిడికి గురికాకుండా నిపుణులు అనుమానితులను సంఘటన స్థలానికి అనుసంధానించే కోణంలో పరిశోధనలు చేస్తారు. వారు ఉపయోగించిన పేలుడు పదార్థాలు ఏ రకమైనవో, వాటి తీవ్రత ఎలా ఉంటుందో విశ్లేషిస్తారు.
కాలి బూడిదైనా...
అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో నిపుణులు ముఖ్యంగా పేలుడు పదార్థాల అవశేషాలు, అగ్ని ప్రమాదానికి కారణమైన పదార్థాల జాడలు, వేడి ప్రభావంతో మారిన వస్తువుల భౌతిక ఆధారాల కోసం వెతుకుతారు. కాలిన శిథిలాల నుంచి చిన్న చిన్న అవశేషాలను చాలా జాగ్రత్తగా కలుషితం కాకుండా ఉండేలా సేకరిస్తారు. సాధారణంగా మండే స్వభావం ఉన్న ద్రవాలు నేలలోకి లేదా ఇతర శోషక పదార్థాలలోకి ఇంకిపోతాయి. కాబట్టి కార్బన్ అవశేషాలు (Soot), కాలిన భాగాల అంచులు, మట్టి నమూనాలను సేకరిస్తారు.
ప్యాకేజింగ్
సేకరించిన నమూనాలను తక్షణమే గాలి చొరబడని ప్రత్యేక డబ్బాల్లో (Airtight Containers) ప్యాక్ చేస్తారు. ప్లాస్టిక్ సంచులను నివారిస్తారు. ఎందుకంటే అవి మండే ద్రవాల ఆవిరులను (Vapors) పీల్చుకోవచ్చు లేదా కలుషితం చేయవచ్చు.
డాక్యుమెంటేషన్
సంఘటన స్థలాన్ని చాలా కోణాల నుంచి ఫోటోలు తీస్తారు. లేజర్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా 3డీ స్కెచ్‌లు వేయిస్తారు. ఇది అగ్ని వ్యాప్తి చెందిన విధానాన్ని (Fire Propagation), పేలుడు కేంద్ర బిందువును అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
సంఘటనకు లింక్ చేయడం
అగ్ని ఎంత వేగంగా, ఏ దిశలో వ్యాపించింది అనే నమూనా, అత్యంత ఎక్కువ నష్టం జరిగిన ప్రదేశం ఆధారంగా పేలుడు/ అగ్ని ప్రారంభ స్థానాన్ని గుర్తిస్తారు. కాలిపోయిన లోహపు శకలాల నమూనా, వాటి కదలికను బట్టి అది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదమా లేదా పేలుడు పదార్థాలను ఉపయోగించిన దాడినా అని నిర్ధారిస్తారు.
గ్యాస్ క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ
ఇది అత్యంత ముఖ్యమైన సాంకేతికత. నమూనాలోని మండే ద్రవాల ఆవిరులను (పెట్రోల్, కిరోసిన్ వంటివి) గుర్తించడానికి ఉపయోగిస్తారు. పేలుడు అవశేషాల రసాయన మిశ్రమాలను కూడా వేరు చేసి ఇందులో గుర్తిస్తారు.
ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ
కాలిన అవశేషాలు కాంతితో ఎలా చర్య చెందుతాయో విశ్లేషించి అందులోని రసాయన బంధాలను గుర్తిస్తుంది. ఇది పేలుడు పదార్థాల రసాయన కూర్పును తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ
పేలుడు శకలాల ఉపరితల స్వరూప శాస్త్రాన్ని (Morphology) పరిశీలిస్తుంది. ముఖ్యంగా పేలుడు తర్వాత మిగిలిపోయిన మూలకాల జాడలను (ఉదా: సల్ఫర్, నైట్రోజన్, లెడ్) గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది పేలుడు పదార్థం రకాన్ని నిర్ధారిస్తుంది.
అంతిమంగా దోషులను కనిపెట్టే మార్గాలు
దోషులను గుర్తించడానికి ఫోరెన్సిక్ అధికారులు కేవలం రసాయన ఆధారాలపైనే కాకుండా చాలా పద్ధతులను అనుసరిస్తారు. ప్రయోగశాలలో ఏదైనా ప్రత్యేకమైన లేదా వాణిజ్యపరమైన పేలుడు పదార్థాలను గుర్తిస్తే ఆ పదార్థాన్ని కొనుగోలు చేసిన, తయారు చేసిన లేదా నిల్వ చేసిన వ్యక్తులపై దర్యాప్తు చేస్తారు.
వాహనం పేలుడు ఘటనకు కేంద్ర బిందువు అయితే ట్యాంపరింగ్‌కు గురైన ఇంజిన్ లేదా ఛాసిస్ నంబర్లను థర్మోకెమికల్ ఎచింగ్ ద్వారా తెలుసుకుంటారు. దీని ద్వారా వాహనం యజమాని వివరాలు తెలుస్తుంది.
సంఘటన స్థలం చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరించి సంఘటనకు ముందు అనుమానాస్పద కదలికలను ట్రాక్ చేస్తారు. అనుమానితుల డిజిటల్ పరికరాలలో (ఫోన్లు, కంప్యూటర్లు) పేలుడు తయారీకి సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తారు.
ఇదీ చదవండి: అంతా కాకపోయినా కొంత ఊరట! తులం ఎంతంటే..
Tags : 1