సౌరమానం: ఈ వారం రాశి ఫలితాలు

రాశి ఫలాలు – 2018  

జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (21 ఏప్రిల్‌ 2018 నుంచి ఏప్రిల్‌ 27 వరకు) మీ రాశి ఫలితాలు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

శుభమా! అని దశరథుడు తన నలుగురు పిల్లలకూ పెళ్లిళ్లకోసం సమావేశం ఏర్పాటు చేసి ఎందరో రాజుల్ని పిలిస్తే కబురూ కాకరకాయా లేకుండా ఆ సమావేశానికొచ్చిన విశ్వామిత్రుడు కాస్తా ఆ రామలక్ష్మణుల్ని పట్టుకుపోయాడు. ఇలాగే అతి ముఖ్యమైన కుటుంబ వ్యవహారంలో సమస్య తెగక మీరు తలపట్టుకుని కూచుంటే, అతి ప్రధానమైన మీ జీవిత భాగస్వామిని ఒక ముఖ్య విషయ పరిష్కారం కోసం తీసుకువెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. దీన్నే శాస్త్రం ‘అవాంతర యోగం’ అంటుంది. మరో విశేషమేమంటే, ఈ జటిలమైన విషయం దాదాపు 3 వారాల నుండి ఏదో ఒక కారణంగా అపరిష్కృతంగా ఉండిపోయింది. గట్టిగా తిరస్కరించి మీ పనికి ప్రాధాన్యమిచ్చుకోవడం అతి ముఖ్యం– తప్పనిసరి కూడా. వారం ప్రారంభంలోనే మీ జీవిత భాగస్వామినికి ఈ సమాచారాన్ని చెప్పి సిద్ధపరిచి ఉంచండి. 

ఎవరికి రుణం అడిగినా మీరు లోగడ ఇచ్చి ఉండలేదో, ఆ కారణంగా వారితో మాటలు మీకు పూర్తిగా ఆగిపోయాయో, ఆ రుణాన్ని తీసుకోదలచిన వారి చరిత్రకి సంబంధించిన ఓ సంఘటన బయటపడి– మీరెంతటి గోతిలో పడకుండా ముందుగా బయట పడ్డారో తెలిసి ఆనందమౌతుంది. ఎప్పుడో దాచుకున్న సొమ్ము పక్వానికి వచ్చి మరింత అయిన కారణంగా స్థిరమైన ఆస్తిని తీసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. మీకు నడుస్తున్న దశ ప్రకారం స్వతంత్ర గృహం కాని పొలాన్ని గాని తీసుకోవడం మంచిది తప్ప సామూహిక గృహాలలో ఒకదాన్ని (ఎపార్ట్‌మెంట్‌) ఎంచుకోవడం సరికాదు. ఇప్పుడు మీకు కొంత భారమే అనిపించవచ్చు కాని ముందునాటికి నేటి మీ నిర్ణయం పాడి గోవును కొన్న దానితో సమానం ఔతుంది. సంతానం ఆరోగ్యం విద్యావిషయాల్లో విశేషించి నడవడిక విషయంలో అనుకూలంగా ఉన్న కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయినప్పటికీ ఎవరితో స్నేహం చేస్తున్నదీ ఓ కంట కనిపెట్టడం మీకు తప్పనిసరి. 

లౌకిక పరిహారం: నేనూ– నా పనీ అన్నిటికంటే ముందు’ అనుకోండి. 
అలౌకిక పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రోజు మొత్తం మీద ముమ్మారు పఠించండి. 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)

వేసవి కాలంలో ఎండా, వర్షాకాలంలో వర్షం, చలికాలంలో చలీ ఉంటాయని మనకి ముందుకి ముందే ఎలా తెలుసో, అదే తీరుగా మీకు సంఘర్షణా వాదవివాదాలూ జరిగే సమయాలూ సందర్భాలూ ముందుకి ముందే తెలుస్తాయి. ఎందుకు మనకీ గొడవ? అనుకుంటూ ముఖం చాటేయవద్దు. సాహసం, మాటల్లో పరుషత్వం లేకుండా ధైర్యంగా నిలబడండి. మెత్తని మాటలతో సమాధానం వారికి గట్టిగా అర్థమయ్యేలా చెప్పండి. కేవలం దెబ్బలాడడమే తమ జీవిత ధ్యేయం గమ్యం అన్న రీతిలో కొందరు మనకి కన్పిస్తుంటారు. వాళ్లని సేవిస్తే (సమీపిస్తే) వాదించడంలో ఉండే మెళకువల్ని చెప్తారు. ఇది ఎగతాళికి చెప్పే మాట కాదు. బతక నేర్చినతనం మాత్రమే.  ‘మీ పనిని క్షణాల్లో చేయించి తీరుతాం కదా!’ అంటూ కొంత సొమ్ముని మీ నుండి ఆశించ దలచిన వాళ్లు ఈ వారంలో రావచ్చు. మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఆశ ఉండడం సహజం. అయితే పొరపాటున కూడా వాళ్లకి లోబడకండి. అలాగని మీకు నా పనిని చేయలేదంటూ ముఖమ్మీద కొట్టినట్లు మాట్లాడకండి. నాలుగు బీద అరుపుల్ని పలికి సొమ్ము లేదంటూ మాట్లాడి, వాళ్లకి నిరాశాజనకంగా అయ్యేలా చేసి పంపించెయ్యండి. ఇలాంటి వారితో విరోధం ఎంత తప్పో, స్నేహం కూడా అంతటి తప్పే!

ఉద్యోగం చేస్తున్న వారికి – మళ్లీ కొత్తగా నేర్చుకోవాల్సిన పనికి సంబంధించిన బాధ్యతలు అప్పగించబడవచ్చు. పై అధికారి మీ అనంగీకారానికి సమ్మతించకపోవచ్చు– చేయలేనని మొత్తుకున్నా వినే పరిస్థితి లేకపోవచ్చు. భయపడకండి. శని ఎప్పుడూ రాబోయే మంచి కాలానికి పునాదిని ఇప్పుడు వేస్తాడు. ఈ నేర్చుకోబోయే పని భావికాలంలో మీకు పాడికుండ వంటిది అవుతుంది. గమనించుకోండి. పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాలతో చేసిన అజ్ఞాతవాసమనేది విరాట రాజు కొలువులో అజ్ఞాతవాసం ఎలా చేయాలో అనేదానికి మార్గదర్శకమయింది. 

లౌకిక పరిహారం: లోపల భయపడుతున్నా పైకి ధైర్యంగా కన్పించాల్సిన కాలం అని గుర్తించండి. 
అలౌకిక పరిహారం: ఆంజనేయ అష్టోత్తర శతనామాలని పఠిస్తూ ఉండండి. 

మిధునం (మే 21 – జూన్‌ 20) 

పాండవులంతా ఇష్టకామ్యవనంలోకి ప్రవేశిస్తుంటే మహర్షి చెప్పాడు– ఏది కోరుకుంటే అది తప్పక ఫలించే వనం ఇది– అని. వెంటనే ధర్మరాజు అన్నాడు– ఈ వనంలోకి ప్రవేశించవద్దు– అని. ఇదేమిటనుకోవద్దు. శత్రునాశనాన్ని కదా సహజంగా మనం కోరుకుంటాం! దాని ద్వారా ఏ దుర్యోధనుడో దుశ్శాసనుడో పోవాలని కోరుకుంటే మిగిలిన వారంతా ఎంత ద్రోహాన్ని చేస్తారో కదా వీరు మరణించిన బాధతో. దైవం ఎలా నిర్ణయిస్తే అలా జరగాలని కోరుకుందాం అన్నాడు ధర్మరాజు. దాదాపు దశాబ్దకాలం విశేషంగా బాధలు పడి పడి ఉన్న మీరు మీ మానసిక దుఃఖంతో ప్రతీకార బుద్ధితో ఏదో కోరుకుంటూ ఉంటారు. దైవానికి ఆ నిర్ణయాన్ని విడిచేయాల్సిన గొప్ప ప్రయోజనాన్ని పొందగల అదృష్టకాలం మీకు ఇది. మీ నిర్ణయం వద్దే వద్దు.  ఇంటికి మామిడి తోరణాన్ని కట్టాల్సిన అవసరం రాబోతోంది. ఉల్లాసంగా ఆనందంగా ఉండండి. నిరాశాజనకంగానూ నిట్టూర్పుల్ని విడుస్తూనూ మాట్లాడేవారినీ వారి జీవిత చరిత్రలనీ విననే వినకండి. వారు చెప్పడం ప్రారంభిస్తే అడుగడుగునా అడ్డుపడుతూ సందర్భాన్ని మార్చి మార్చి మరో అంశాన్ని ప్రస్తావిస్తూ చెప్పడం అనవసరం, వీళ్లకి వినడం ఇష్టం లేదనే గట్టి అభిప్రాయం కలిగేలా ప్రవర్తించండి. 

తల్లి తుమ్మెద తన సంతానాన్ని పద్మంలో కూచోబెట్టి దాని చుట్టూ గిరగిరా ధ్వనిస్తూ తిరుగుతుంటే ఆ ధ్వని సంతానానికొస్తుంది. దీన్నే భ్రమర కీట న్యాయమంటారు. ఇలా నిరాశాజనకమైన మాటల్ని వింటూ వింటూ ఉంటే కొంతకాలానికి మీ శరీరం మొత్తం నిరుత్సాహ మయమైపోతుంది. దానికి ధన్వంతరి కూడా ఏ ఔషధాన్నీ ఇయ్యలేడు. ఇది కావాలని తెచ్చుకున్న జబ్బు కదా మరి! మీకున్న చిన్న పలుకుబడిని వినియోగించి తమకి ఓ పనిని చేయించి పెట్టవలసిందంటూ కొందరో ఏ ఒకరో మీ వద్దకి వచ్చి ఒత్తిడి తేవచ్చు. ఇప్పుడిప్పుడే మీరు సంకెలల నుండి బయట పడ్డారు కాబట్టి వారి కోరికని మన్నించకండి. చేయలేనని నిర్ద్వంద్వంగా ముందే చెప్పెయ్యండి తప్ప మభ్యపెట్టకండి. 

లౌకిక పరిహారాలు: నిరాశాజనకమైన మాటల వారిని  నిప్పుతో సమానంగా భావిస్తూ దూరంగా ఉండండి. 
అలౌకిక పరిహారం: గణపతి షోడశ నామాలనీ నిరంతరం పఠించుకుంటూ ఉండండి. 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)

‘ఏరువాక పున్నమి’ అనే పండగ ఒకటొస్తుంది. ఆ రోజు ఒక్కొక్క నాగలికీ రెండ్రెండు ఎద్దుల చొప్పున 16 ఎడ్ల జతలతో 16 నాగళ్లని ఒకటి వెంట ఒకటి ఉండేలా ఓ క్రమపద్ధతిలో ఏర్పాటు చేసి, అన్నిటినీ కలుపుతూ పెద్ద తాడుని కట్టి ఊరంతా తిప్పుతారు ఆ ఎడ్లజతలని నాగళ్లతో. దాంతో ఇష్టమున్నా లేకున్నా మొదటి జత కదలగానే తామూ కదలాల్సి ఉంది కాబట్టి తప్పక నడుస్తాయి అన్ని ఎడ్లూ. అలాగే మీకు మీరుగా కొద్ది వెనకాడుతూ ఉంటారు కాబట్టి, ప్రస్తుతం యోగించే కాలమే మిమ్మల్ని ముందుకు నెట్టడమో బలంగా లాగడమో చేస్తుంది. దాంతో అపరిష్కృతంగా ఉన్న సమస్యలవైపు దృష్టిని తప్పనిసరిగా ప్రసరింప జేస్తారు. విజయాన్ని సాధించుకోగలుగుతారు.  మీరు పదవినుండి విశ్రాంతి తీసుకున్నా (రిటైర్‌మెంట్‌ తీసుకున్నా), మళ్లీ ఉద్యోగానికి తక్కువ జీతం మీద రావలసిందనే ఆహ్వానం అధికారికంగానే వచ్చే అవకాశముంది. పువ్వులమ్మిన చోటనే ఏదో అమ్మవలసి వచ్చినట్లుగా, అదే కార్యాలయంలో అధికారిగా పని చేసిన మీరు మరొకరి కింది ఉద్యోగిగా చేరడం సబబు కాదు. ధనవంతుల ఇంట గొర్రెకి కడుపునిండా మేతని చుట్టాలొచ్చే వరకే పెడతారు.

అలాగే మీ స్థానంలో కొత్తవారొచ్చే వరకే మీకీ ఆహ్వానం. మరెవరైనా దొరికారా? మీకు అంతే సంగతులు. ధనం కాదు ప్రతిష్ఠ ముఖ్యం. వెళ్లద్దు. ఆ ఆదాయం మీకు తప్పక లభించే యోగం ఉంది.  వశిష్ఠుడు తన హోమాలూ యజ్ఞాలూ యాగాలూ చేసుకుంటుంటే తగుదునమ్మా! అంటూ విశ్వామిత్రుడు ఆయన పర్ణశాలకొచ్చి మరీ తగువు పెట్టుకున్నాడు. అలాగే మీతో కావాలని వాగ్వివాదానికి దిగవచ్చే జనం ఉండొచ్చు. ఏ విధమైన సంబంధ బాంధవ్యాలకీ వాళ్లతో అవకాశం లేకుండా ముందే తెంచేసుకోండి. చేతులు కాలతాయని ముందుగా తెలిసి ఆకుల్ని సిద్ధంగా ఉంచుకోండి. మీ మొహమాటమే మీకు శత్రువు. మీ పొదుపే మీ విరోధి. మీ అనుమానమే మీకు అవరోధం. మీ జాప్యమే మీకు పరాజయ కారణం. 

లౌకిక పరిహారం: కార్యరంగంలోకి ధైర్యంగా దూకండి. పరాజయం లేదు. ఉండదు. 
అలౌకిక పరిహారం: రుద్రసూక్తాన్ని పఠింపజేస్తూ చెరుకు రసంతో శివాభిషేకాన్ని చేయించండి. 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)

అటుగా వెళ్లండంటూ వారంతట వారే మీకు ఓ మార్గాన్ని చూపించి, వారి మాట విని మీరు కాస్తా ఊబిలో దిగాక, ఒడ్డున ఉండి– ఇలా రావాలి, అలా రావాలి... అంటూ సూచనలని ఇచ్చే వారున్నారు. సిద్ధంగా ఉండండి. ప్రతి వ్యక్తినీ అనుమానించాల్సిన సమయమేమో అన్పిస్తోంది దశాయోగం. ఫలాని వ్యాపారం మంచిదంటూ సూచన చేస్తే ‘సమానమైన పెట్టుబడిని పెట్టి ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామా?’ అనండి. ఫలాని వారికి ఎక్కువ వడ్డీకి రుణం ఇవ్వడం మంచిదని చెప్తే ‘ఇద్దరం చెరిసగం ఇద్దామా?’ అనండి. వసంత రుతువు వస్తే తెలుస్తుంది ఏది కాకో ఏది కోకిలో? ఇలా చెరిసగం అనే మాట మాట్లాడగానే అదృశ్యమైపోతారు గుర్తుంచుకోండి. నిజానికి మీరంతగా ఆర్జించనే లేదు. అయినా మీ మీద ఎందుకంత పగ ఉందో, అర్థం కాని విషయం.  లోగడ జరిగిన ఆర్థికమైన లావాదేవీల విషయంలో ఉన్న అస్పష్టతని ఓ వారం రోజులపాటు అదే పనిగా కూచుని పరిష్కరించెయ్యండి. ఆ అపరిష్కృతమైన లావాదేవీలే అవతలి వారికి బలమైన ఆయుధం అస్త్రం శస్త్రం కాబట్టి ఆ సమస్యని ధైర్యంగా పరిష్కరించెయ్యండి. ఇది అత్యవసరం. లోగడ వ్యవహారాలకి సంబంధించిన పరిష్కారాలని మౌఖికంగా పెద్ద మనుషుల ముందే చేసుకోండి తప్ప రాతకోతల రూపంలో వద్దే వద్దు. చీటికి ప్రాణంబు వ్రాలు (కాగితానికి ప్రాణం రావాలంటే అక్షరాలతోనైనా ఓ సంతకం చాలు). గుర్తుంచుకోండి. 

ఇటు నుండీ అటు నుండీ వస్తూ పోతూ చాటుగా మీ కుటుంబ వ్యవహారాలని తెలుసుకుంటుండే కొందర్ని ఇంట్లోకి రానీయకుండా కొద్ది కఠినంగానే మాట్లాడండి. వారి రాకపోకలు, మానిపోయిన పుండుని మళ్లీ ఎర్రగా రక్తం చిందుతుండేలా చేసేందుకు ఉపయోగపడతాయి. మీకు ఎంత ఆశ్రయమిచ్చిన వారితోనైనా సరే, మీ ఆర్థికమైన లావాదేవీల విషయం ప్రస్తావనకొస్తే– దాటవెయ్యండి లేదా మీకు దేనికని ఎదురు ప్రశ్న వేయండి. ఇంకా తెగింపు మీకుంటే– చెప్పనని తెగేసి చెప్పండి. 

లౌకిక పరిహారం: ఎవరినీ నమ్మగల సమయం కాదిది. తగు జాగ్రత్తతో మాత్రమే విశ్వసించండి. 
అలౌకిక పరిహారం: శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం ఉత్తమం.

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)

ఆవుని చంపుకు తిందామనే అభిప్రాయంతో నలుగురు దొంగలు దాన్ని తరుముకొస్తుంటే, అది కాస్తా ఎక్కడో చెట్ల మధ్యలోకి కనపడకుండా పారిపోయింది. దాన్ని వెంబడిస్తున్న దొంగలకి ఓ సాధువు కన్పించాడు. ‘ఆవు ఎటుపోయింది?’ అని గద్దించి అడిగారు ఆయన్ని. ఆయన నిదానంగా – ‘నాయనలారా! చూసిన కళ్లు చెప్పలేవు; చెప్పే నోరు చూడలేదన్నాడు. ఏదో వేదాంతం మాట్లాడుతున్నాడని వాళ్లు వెళ్లిపోయారు. మీరు కూడా ఇలాగే సమయస్ఫూర్తితోనూ, లౌక్యంగానూ తెలిసినా తెలియనట్లుగానూ మాట్లాడ(లే)ని పక్షంలో మిమ్మల్ని కట్టడానిక్కావలసిన తాళ్లని మీరే తెచ్చుకుని ఇచ్చినట్లౌతుంది జాగ్రత్త!
వేతనం అధికం– పనిగంటలు కూడా తక్కువే– ప్రస్తుతం ఉన్నదానికంటె సౌకర్యాలు ఎక్కువ– అంటూ ఎవరైనా మీ వెంట పడితే నిర్ద్వంద్వంగా రానని చెప్పండి. నిజంగా ఇప్పటి ఉద్యోగం కంటె అన్ని గొప్పదనాలు ఆ ఉద్యోగంలో ఉన్నట్లైతే ఎక్కణ్ణించో వాళ్లకి వాళ్లుగా వచ్చి మిమ్మల్ని ప్రాధేయపడనవసరం లేదు. దాంట్లో ఓ మడతపేచీ ఉండడమే ఈ ప్రార్థనకి కారణం. స్థానచలనం వద్దు. 

తాత్కాలికమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది కాబట్టి, వీలయినంత విశ్రాంతితోపాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధని వహించండి. చేస్తున్న సంస్థలో కూడా ధర్మబద్ధంగానే వ్యవహరించండి. మీ నిజాయితీకి గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది.  మీరింకా పైకి చదవాలనే ప్రయత్నం బహుశః ఫలప్రదం కాకపోవచ్చు. ఇటు వత్తిడితో ఉన్న ఉద్యోగం, అటు ఏ మాత్రమూ అశ్రద్ధ చేయరాని చదువూ అనే రెంటి మధ్యా ఉన్నట్లయితే దేనికీ సరైన న్యాయాన్ని చేయలేక ఉద్యోగంలో మీకున్న ప్రతిష్ఠని కోల్పోవడంతోపాటు మాట పడతారు కూడ. వద్దు, చదువుని కొంతకాలంపాటు వాయిదా వెయ్యండి. 
పై చదువు చెయ్యనంత మాత్రాన ప్రస్తుతానికొచ్చే నష్టమేమీ లేదు. 

లౌకిక పరిహారం: స్థానచలనం ఆలోచనలు వద్దు. 
అలౌకిక పరిహారం: నిత్యపూజని మానకండి. 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)

అభిమన్యుడు మహాపరాక్రమవంతుడే అయినా, ఇంద్రునికి మనుమడే అయినా, అర్జునునికి ఉన్న యుద్ధవిద్యలన్నీ తనకి తెలిసినా, ఆ కృష్ణుడు పద్మవ్యూహం నుండి వెనక్కి వెళ్లే (తిరిగొచ్చే) వ్యూహాన్ని చెప్పని కారణంగా హతుడయ్యాడు. విజయం దుర్యోధనునికే దక్కింది. నిజానికి విజయం లభించాల్సినంత సమాచారం మీ వద్ద లేకున్నా అదృష్టం (కనిపించని భగవంతుని లీల) కారణంగా మీకే విజయం లభిస్తుంది.  ఏదో స్థిరమైన ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కన్పిస్తోంది. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్నీ శైలినీ చూపించి ప్రశంసాపాత్రులౌతారు. అదృష్టయోగంలో ఉన్నారు కాబట్టీ, శనిబాధ తొలగిపోయింది కాబట్టీ– ఉద్యానవనంలో మబ్బులు కన్పించని– వాన తడిగాలి వీచిన సందర్భంలో నెమలిలా ఆనందపు పురివిప్పి సంతోషంగా ఉంటారు.  న్యాయస్థానంలో ఏవైనా అభియోగాలున్నట్లయితే వ్యతిరేక ఫలితం వస్తుందేమోనని దిగులు పడనవసరం లేదు. ఆరోగ్యం బాగుంటుంది.  ఏదైనా పై చదువు చదవాలనీ లేదా వ్యాపారం ప్రారంభించాలనీ– ఈ రెండూ కాని పక్షంలో సొంతంగా ఓ సంస్థని ఏర్పాటు చేయాలనీ భావిస్తారు. తగినంత పెట్టుబడి వెంటనే లభించకపోవచ్చు కానీ దొరికే అవకాశం పుష్కలంగా ఉంది. 

మాట వింటున్నాడు కదా! అని సంతానాన్ని ఒకటికి రెండుమార్లు అవసరం అనవసరం గమనించకుండా మందలించినట్లైతే ఎలా ఎదురు తిరగడం చేస్తాడో, అదే తీరుగా శరీరం సహకరిస్తోంది కదా అని మీ తల్లిదండ్రులు మరింత శారీరక మానసిక శ్రమని చేస్తే– ఔషధపు స్థాయిని పెంచుకుంటూ పోవలసి వస్తారు. మరి కొద్దికాలంలోనే ఆ ఔషధం పని చేయ(లే)ని స్థాయికి వచ్చేయవచ్చు కూడా. ఆ కారణంగా బలవంతాన వాళ్లకి సకాల నిద్రా సకాల భోజనం సరైన ప్రదేశంలో వసతీ (మరో చోటుకి వెళ్లినప్పుడు)ఉండేలా తప్పనిసరిగా జాగ్రత్తలని తీసుకోండి. 
లౌకిక పరిహారం: అదృష్టయోగముంది. అహంకరించకుండా సాగిపొండి. 
అలౌకిక పరిహారం: గణపతిధ్యానం ఉత్తమం

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)

పడవ నిండుగా బరువు, ఏటికి ఎదురు ప్రయాణం, మెల్లగా ఎదురుగాలి– దీనికి తోడుగా సన్నని వాన– చీకటి పడే సమయం... ఎలా ఉంటుందో ఆ స్థితిలో మీరుంటారు శని 2లో ఉన్న కారణంగా. భయపడకండి. శని మననేమీ చేయలేనిది– మనం సంపూర్ణంగా ధర్మబద్ధంగానే ఉంటూ, కష్టంలో ఉన్న వారికి నిస్వార్థంగానూ, హృదయ పూర్వకంగానూ సహాయపడినప్పుడే. అందుకే ధర్మరాజు అరణ్యాలకి (12+1 సంవత్సరాలు) వెళ్లాల్సి వచ్చిన మొదటి రోజున నిర్ణయించుకున్నాడు మరింత ధర్మబద్ధంగా ఉండి తీరాలని. మీ పరిస్థితీ అదే. కొన్ని కొన్ని ఉద్యోగాల్లో గోకర్ణ గజకర్ణ టక్కుటమార గారడీ ఆదాయాలు తప్పనిసరిగా ఉంటాయనేది బహిరంగ రహస్యం. ఆ జోలికి పోకండి.  అదే తీరుగా వైద్యం న్యాయశాల వంటి వాటిలో అవసరానికి మించి వ్యవహరించకండి. వ్యక్తి చేత వ్యయం చేయించకండి. విజయాన్ని ఎంత గొప్పగా సొంతం చేసుకోగలుగుతారో మీకు మీకే అర్థమౌతుంది! ఇది ఒట్టిమాట కాదు– గట్టిమాట– పెద్దలు శాస్త్రాల్లో చెప్పి మనకి అందించిన చద్దిమూట. సాధ్యపడదని భావించకండి. మనసుంటే మార్గముంటుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే– నల్లని మబ్బులన్నీ ఆకాశాన కప్పు కప్పినట్టు కప్పేసి– ఆకాశానికి చిల్లులు పడ్డాయా? అన్నట్లు వర్షించేస్తాయనే భయాన్ని కలిగించి, కాసేపటిలో ఎన్నెన్నో అశుభకరమైన ఆలోచనలన్నిటినీ మనచేత చేయించి– క్రమంగా మబ్బులన్నీ వీడిపోవడం– ఎలా ఉంటుందో అదే మీకు జరగబోయేది! ఇది నిజం. భయం సామాన్యంగా ఉండదు. ప్రతిష్ఠ పోతుందనే ఊహ యథార్థమనిపిస్తుంది. సంసారభాండం పగిలిపోయిందని అనిపిస్తుంది. చివరికి కథ అనుకున్నంత కాకున్నా ఉన్నంతలో కొంత సుఖాంతమే అవుతుంది. ఒక్కో ఇంట్లో ఒక్కో గృహిణి నెలకి సరిపడినన్ని తిట్లు తిట్టి, పదిమందికి ఓ రోజుకి సరిపడినంత అన్నాన్ని ఆ పని మనిషి వెళ్లేప్పుడిస్తుంది. ఓ ప్రసిద్ధ జ్యోతిష పండితుడు చెప్పిన మాట ఇది. 

లౌకిక పరిహారం: బయం, నిర్భయం, ఆశ నిరాశల మధ్య ఊగిసలాట ఉంటుందని మనసుని సిద్ధపరచుకోండి. 
అలౌకిక పరిహారం: శనిశ్లోకాన్ని రోజుకి 361 మార్లు రోజు మొత్తం మీద పఠిస్తూ ఉండాల్సిందే.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)

బ్రహ్మర్షిగా కావాలనుకున్న విశ్వామిత్రుడు నాలుగు దిక్కులా క్రమంగా తపస్సు చేస్తూ నాలుగుసార్లూ ఓడిపోయాడు. చివరికి కఠోర తపస్సుతో బ్రహ్మర్షి పదవిని సాధించాడు. దేవతలంతా వచ్చి ‘బ్రహ్మర్షి’గా నిన్ను ఆమోదిస్తున్నాం గాని తపస్సునుండి లే!’ అన్నారు. విశ్వామిత్రుడు ఆ వచ్చిన దేవతలందర్నీ పరీక్షగా చూసి– మీరు కాదు– వశిష్ఠుడనాలి నన్ను ‘బ్రహ్మర్షి’ అని. అప్పుడు గాని లేవనన్నాడు. వశిష్ఠుణ్ణి రప్పించారు. అనిపించారు. కథ సుఖాంతమైంది. మీ పరిస్థితి ఇలా ఉండకూడదు. పట్టుదల ముఖ్యంగా మాట పట్టుదలకి పోయినట్లయితే తప్పక ఇబ్బందికి గురి కావడమే కాక, చేస్తున్న ఉద్యోగంలో పెద్ద చిక్కులో కూడా పడే అవకాశముంది. జన్మశనిలో ఉన్న కారణంగా మీకు మీరే ఆశ్చర్యపడేలా (తర్వాతికాలంలో) కొన్ని కొన్ని పనుల్ని చేస్తారు మీరు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు పని చేస్తున్న సంస్థ వాళ్లు– కొన్ని నియమాల మార్పులనీ సూచనలనీ ఉత్తర్వులనీ కూడా ఇచ్చే అవకాశముంది. ఏమైనా శ్రుతిమించకుండా ఉండేలా చూసుకోండి. 

శనిప్రభావం మరికొంత ఉండే కారణంగా స్త్రీ– పురుష భేదం లేకుండా వ్యసనాల జోలికి వెళ్లి వ్యసన పరులుగా మారే అవకాశముంది. పూర్వ శాస్త్రాలని బట్టి వ్యసనాలు (సప్త) 7 మాత్రమే అయినా, వాటిలో నూతన స్త్రీ పురుష సంబంధం జూదం నోరు పారేసుకోవడం (వాక్పౌరుష్యం) మద్యం అర్థం లేకుండా వ్యయం చేయడమనేవి (తప్పక ఏ ఒకటో రెండో) మీకు తగులుకోవచ్చు. ఊబిలోకి దిగడమంటూ జరిగితే, అతణ్ణి రక్షించబోయే వ్యక్తి కూడా చిక్కులో పడతాడు కాబట్టి ఎవరూ సహకరించరు సరికదా, కార్యాలయంలో మీ వ్యసన విధానాన్ని పై అధికారులకి వివరించి చెప్పి ఉద్యోగానికి ముప్పుదాకా పరిస్థితిని లాక్కొస్తారు.  ఈ కారణంగా మీ తలిదండ్రులూ భాగస్వామీ తీవ్ర మధన పడే అవకాశముంది కాబట్టి వ్యసనపరులతో సహవాసం చేయకండి. 

లౌకిక పరిహారం: ఏ ఒక్క వ్యసనమున్న వానితోనైనా, ఏ తీరు పరిచయం కూడా లేకుండా ఉండండి. 
అలౌకిక పరిహారం: శుక్రగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)

మండుతున్న నిప్పులో ఉప్పు వేస్తే చిటపట ధ్వనితో పేలి ఆ వేడిగా ఉన్న ఉప్పుముక్కలు మన శరీరానికి తగిలి చెప్పలేని బాధకి గురి చేస్తాయి మనని. అలాగే మంటలో ఎండు మిరపకాయలని వేస్తే కళ్లూ ముక్కులూ మండిపోతూ తీవ్ర బాధని కలిగిస్తాయి. ఇదే తీరుగా సహజంగానే కొద్ది ఆవేశం, సాహసం, దూకుడుతనం ఉన్న మిమ్మల్ని కొందరు స్వప్రయోజన పరులు రెచ్చగొడతారు. ఆవేశాన్ని బుద్ధిలోకి ఎక్కిస్తారు. బుద్ధిని పని చేయనీయకుండా చేసేస్తారు జాగ్రత్త! కొండ కొమ్మునెక్కి ఒక్కసారిగా జారిపడినట్లు ఇంత ప్రతిష్ఠనీ క్షణికావేశంలో కోల్పోయేలా చేసుకునే అవకాశముంది. మరింత మరింత జాగ్రత్త! ప్రతిదీ తప్పనిసరి ఖర్చేనంటూ మీ జీవిత భాగస్వామినీ ఎక్కువ వ్యయం చేయించవచ్చు మీతో.  ఒకసారి వ్యయం చేసి, అది సరికాదని అన్పిస్తే అలా వ్యయాన్ని చేయడం ఎంత నష్టదాయకమో జీవిత భాగస్వామికి వివరించి చెప్పండి. అర్థం చేసుకోగలుగుతారు. జీతంగా ఎంతకి ఒప్పుకున్నారో అంత మాత్రమే సేవకులకీ లేదా ఇతరులైన సిబ్బందికీ పంచేలా చేయండి తప్ప, మీరు రంగంలోనికి దిగద్దు– తగ్గించీ లేదా హెచ్చించీ లేదా బహుమతిగా ఎవరికీ ఇయ్యద్దు. 

తిరిగి వసూలు చేసుకోగలననే ధీమాతోనే తగిన కాగితాలని (చెక్కులు) ఇచ్చారు గదా అనే ధైర్యంతోనో, మైత్రి ఉంది కదా! అనే విశ్వాసంతోనో ఎవరికీ సొమ్ముని రుణంగా ఇయ్యవద్దు. మీరూ ఎవరి వద్దా తీసుకోకండి. ముందు మీకు మీరు అప్పు తీసుకోకూడదనే నిర్ణయానికొచ్చి ఆ మీదట ఎవరికీ ఇయ్యనంటూ బహిరంగ ప్రకటనని చెయ్యండి. సంతానానిక్కూడ వయసు వచ్చిన కారణంగా, మీ మాటకి ప్రతి వ్యాఖ్యానం చేస్తూ– దానికంటె ఇలా, ఒకదానికంటె ఇలా చేయడం బాగుంటుంది కదా! అనచ్చు. సంతానపు ఆలోచనని అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులుంటాయో నిదానంగా వివరించి చెప్పండి. 

లౌకిక పరిహారం: మీకూ మీ జీవిత భాగస్వామికీ మధ్య వార్తలు చేరవేసేందుకు ఎవరినీ ఏర్పాటు చేయకండి. 
అలౌకిక పరిహారం: సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శీఘ్రంగా చేయడం ఉత్తమం.

కుంభం  (జనవరి 20 – ఫిబ్రవరి 18)

వయసులో ఉన్న సింహపు పిల్ల సాహసంతో పరాక్రమంతో గుహ లోపలి భాగాన ఉన్న మెట్లని చరచరా ఎక్కేసి పర్వతం పైభాగంలో గంభీరంగా జూలు విదుల్చుకుంటూ పచ్చని కళ్లతో పరికిస్తున్నట్లుగా, మీ సంతానం విద్యలో, వాణిజ్యంలో సంస్థ నిర్వహణలో... ఇలా దేంట్లోనైనా సరే ఎత్తులో ఉండి మీకు విశేషానందాన్ని కల్గించే అత్యంత అదృష్టకాలం ఇది మీకు. \ఏ గృహ భూ వాహన స్వర్ణాభరణం... ఇలా ఏం కొన్నా అది సరిసమానంగా కొనండి. ఎప్పటికప్పుడు లెక్కల్ని వెంటవెంటనే సరి చేసుకుని ఆర్థికమైన చిక్కులు ముందునాటికి రాకుండా పరిష్కరించేసుకోండి. ఈ సూచన అతి ముఖ్యం. ఒకవేళ మీకు సంతానమే లేక మీరే సంపాదన పరులై ఉంటే కూడా సొమ్ముని సొమ్ముగా భద్రపరచడం కాకుండా భూమి లేదా బంగారం రూపంలోనే నిల్వ చేయండి. దీనికెంత లాభం? దానివల్ల ఎంత నష్టమనే తీరు ఆలోచనలు వద్దు.

ఏ పనీ చేయకుండా కుటుంబ సభ్యులందరినీ సమావేశ పరచి నిర్ణయాన్ని తీసుకోవడం, మీ అభిప్రాయాన్ని బలంగా రుద్దడం కాకుండా అందరినీ సంప్రదించడం వల్ల పాండవుల్లో ఉన్న ఐకమత్యం మీకు లాభించి, మీరు ఒంటరివారు కారనే గట్టిదనం మీకు గుండె నిండుగా వస్తుంది. నేను ఇంత సంపాదించాక నా సొమ్ము పంపకంలో నిర్ణయం గురించి కూడా వాళ్లతో చర్చించాలా? అనుకోవద్దు. ఐశ్వర్యమనేది ఐకమత్యం లేనప్పుడు నిలవదు. పెద్ద చెరువైనా సరే,  చిన్న గండి పడ్డ పక్షంలో వేసవికాలపు జలాశయంలా చూస్తుండగా ఖాళీ అయిపోతుంది. కుటుంబంలో ఏ ఒక్కరి వ్యతిరేకత ఉన్నా– చుక్క చుక్క చొప్పున పాత్రనుండి నీరు కారుతున్న పరిస్థితి అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆర్జన ని అమ్మి మరేదో అద్భుతాన్ని సృష్టించే ఆలోచనకి రానే వద్దు– రానీయవద్దు. కోడళ్లతో మనఃస్పర్థలు లేకుండా కూతుళ్లతో సమానంగా చూసుకుంటూ ఉండండి. వియ్యాలవారిని ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనియ్యకండి. ఆ పరిస్థితే వస్తే స్పష్టంగా– జోక్యం చేసుకోవద్దని చెప్పండి. తిరుగులేని విజయాలున్నాయి. అహంకరించకండి. 

లౌకిక పరిహారం: ఐశ్వర్యమనేది ఎప్పుడూ ఐకమత్యం కంటె చిన్నదే అనే దృష్టితో ఉండాలి. 
అలౌకిక పరిహారం: గణపతి సహస్రనామాలతో స్వామికి నవనీతాభిషేకం చేయించుకోండి.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)

విత్తనాలని వేయించినా, లేక విత్తనాలని అదునులో చల్లకపోయినా, అదునులోనే చల్లినప్పటికీ సకాల వర్షం పరిమితంగా కురవకపోయినా ఆ సంవత్సరం పంటని గురించిన ఆశని విడుచుకోవలసిందే. అయితే, మీకు ప్రతి పనినీ వెంటపడి పడి చేసుకునే అలవాటుండడం, సకాలంలో పని పూర్తయ్యేలా తగిన శ్రద్ధతో ఉండటమనేది కొత్తకాదు కాబట్టి మీ పనులన్నీ విజయవంతమౌతాయి. దైవబలం తోడుగా ఉన్న కారణంగా విఘ్నాలు రావు. పెద్ద పెద్ద పెట్టుబడులతో పెట్టిన పారిశ్రామిక సంస్థల్లో పని చేసే అట్టుడుగు స్థాయి కార్మికుల కారణంగా కొంత అలజడులు తాత్కాలికంగా ఉండే అవకాశముంది కాబట్టి– ఉన్న కార్మికుల్ని రెండుగా చేర్చి పనిని సాధించుకోవడం కంటె– అవకాశమున్న పక్షంలో కొంత ఆర్థికలాభాన్ని వారికి కలిగేలా (వేతనం పెంచడం వైద్యసహాయం...) చేసి దగ్గరికి తెచ్చుకోవడం సరైన పని. మీకూ కార్మికులకీ మధ్య సమన్వయానికి మరొకర్ని రానిచ్చుకోకండి. 

ఉద్యోగులకి పని ఒత్తిడి ఉంటుంది. శారీరకంగా శ్రమని చేయక తప్పదు. మానసికంగా కూడా అలసటకి గురయ్యే పరిస్థితులున్నాయి కాబట్టి, ఎక్కువదూరం ప్రయాణిస్తున్న వాహనాన్ని మధ్య మధ్యలో కొంతసేపు ఆపినట్టుగా విశ్రాంతిని ఇచ్చినట్టుగా, మీరూ మీ శరీరానికి సెలవు రూపంగా కొంత విశ్రాంతిని తీసుకోండి. 
ఆరోగ్యం ప్రస్తుతానికి సహకరిస్తున్నప్పటికీ, బెణికిన కాలితో వ్యక్తి నడుస్తున్నట్లుగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టుగా పరిమళించే వీల్లేదు. శరీర మాధ్యం ఖలు ధర్మసాధనమ్‌.. మీ శరీరం ఆరోగ్యవంతంగా ఉన్న పక్షంలోనే కదా కుటుంబం మొత్తం సుఖశాంతులతో ఉండగల్గేది! మీ కుటుంబానికి ఆధారం మీ ఆరోగ్యమే కదా! ఈ భావనని మరింతగా కలిగి ఉండండి. నీచజనులు కొందరు మిమ్మల్ని వ్యసనానికి ప్రోత్సహించవచ్చు. వారిని మీ ఇంటికి సాదరంగా పిలిచి కుటుంబ సభ్యులందరి మధ్యా– వారు వ్యసనానికై ప్రోత్సహిస్తున్న తీరుని– అమాయకంగానూ మళ్లీ వారు మిమ్మల్ని అడగకుండా ఉండే తీరులోనూ నవ్వుతూనే వివరించండి. 

లౌకిక పరిహారం: శారీరక విశ్రాంతి అవసరం. 
అలౌకిక పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రం పఠిస్తూ ఉండండి. 

డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు
జ్యోతిష్య పండితులు

Advertisement
Advertisement

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top