గోదావరిలో ముంచుతారా? సూదితో చంపిస్తారా?

ఓటుకు కోట్లుపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందో చెప్పాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ' ఓటుకు కోట్లు మీద ప్రపంచం అంతా ప్రచారం జరిగింది. అన్ని పత్రికల్లో ఆ వార్తలు వచ్చాయి. దొంగతనం బయటపడింది. అయినా తెలుగుదేశం పార్టీ మంత్రులకు ఉలుకు ఎందుకో అర్థం కావటం లేదు. ఏదైనా అడగండి కానీ ఓటుకు కోట్లు అంశంపై మాత్రం చర్చ వద్దు అంటున్నారు. నిజంగా ఆ కేసులో దొంగలు కాకుంటే చర్చకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు.

ఏదైనా అడిగితే...ప్రతిపక్షాన్ని మీ కథ తేలుస్తాం...జాగ్రత్తగా ఉండండి అని బెదిరిస్తున్నారు. పెద్ద పెద్ద చూపులు చూస్తున్నారు. ఏం చేస్తారండి. గోదావరికి తీసుకు వెళ్లి నీళ్లలో ముంచేస్తారా? గుంటూరు ఆస్పత్రిలో చేర్చి ఎలుకలతో కరిపిస్తారా? లేదంటే నారాయణ కాలేజీలో చేర్పించి ర్యాగింగ్ చేయిస్తారా? ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినట్లు రౌడీలతో మమ్మల్ని కొట్టిస్తారా? పోనీ ఏలూరు తీసుకువెళ్లి ఇంజక్షన్ చేయించి చంపిస్తారా? ఎలా మా అంతు తేలుస్తారో చెప్పండి. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు... ఇది అసెంబ్లీ. మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం సాగిస్తాం. సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీ స్థాయిని దిగజార్చుకోవటం సరికాదు' అని హితవు పలికారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top