సర్వే సూపర్ సక్సెస్

ప్రజలు, రాజకీయవర్గాల్లో ఎంతో ఆసక్తి.. ఒకింత ఉత్కంఠ, వివాదాలను రేకెత్తించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. అధికారుల పొరపాట్లు, గ్రామస్తుల ఆందోళనల మధ్య విజయవంతంగా పూర్తయింది. సర్వేకు సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించడానికి వీలుగా సెర్ప్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఎన్యూమరేటర్ల రాక కోసం ప్రజలు వేచిచూడడం, వారు తమ ఇళ్ల వద్దకు రాగానే అవసరమైన పత్రాలు చూపి, నమోదు చేసుకోవడం కనిపించింది. చాలాచోట్ల అనుకున్న సమయానికి సర్వే ప్రారంభం కాలేదు. ఎన్యూమరేటర్ల కోసం ఎదురుచూసిన గ్రామస్తులు.. ఎంతకూ రాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ధర్నాలకు దిగారు. ఎన్యూమరేటర్లను, అధికారులను నిర్బంధించారు. మరికొన్ని చోట్ల సర్వేను బహిష్కరించారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. సర్వే కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో.. అంతటా కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపించింది. సర్వే వల్ల ఉదయం, సాయంత్రం మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. సర్వే కోసం వారం రోజులుగా ప్రత్యేక బస్సులు నడిపి రూ. 12 కోట్ల ఆదాయం ఆర్జించిన ఆర్టీసీకి, మంగళవారం దెబ్బకు రూ. 5 కోట్ల నష్టం వాటిల్లింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top