నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక 3 గంటలకు వాయిదా

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నిక మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. ప్రలోభాలకు గురైన జడ్పీటిసి సభ్యులు 8 మందికి ఎన్నికలు నిర్వహించే జిల్లా పరిషత్ హాలులో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. అందుకు వైఎస్ఆర్ సిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతో ఉత్కంఠగా సాగుతున్న ఈ ఎన్నికలలో 8 మంది వైఎస్ఆర్ సిపి సభ్యులు టిడిపికి మద్దతు తెలిపారు. దాంతో వైఎస్ఆర్ సిపి, టిడిపి బలాలు సమానమయ్యాయి.

జడ్పీ హాలులో జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ తొలుత సభ్యుల చేత ప్రమాణం చేయించారు. ఆ తరువాత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ మొదలు పెట్టారు. మొత్తం 46 మంది సభ్యులలో వైఎస్ఆర్ సిపికి 23 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. 8 మంది వైఎస్ఆర్ సిపి సభ్యులు టిడిపికి మద్దతు పలికారు. దాంతో టిడిపి బలం కూడా 23కు చేరింది. రెండు పార్టీలకు సమాన బలం ఉండటంతో లాటరీ ద్వారా కో-ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఇరు పార్టీలకు చెందిన చెరొకరు కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. లాటరీ ద్వారా మొదటి కో-ఆప్షన్ సభ్యుడిగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అక్బర్ బాషా, రెండవ సభ్యుడుగా తెలుగుదేశం అభ్యర్థి చాంద్ బాషా ఎన్నికయ్యారు.

చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను భోజన విరామం తరువాత 3 గంటలకు వాయిదా వేశారు. ఇరు పక్షాల బలం సమానంగా ఉండటంతో అధ్యక్షులుగా ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top